‘‘హాయ్ బాబాయ్.నేను కూడా మీరు ఉంటున్న అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాను.ఈ మధ్యే వచ్చాను.నైస్ అపార్ట్మెంట్ బాబాయ్ అని ఓ చిన్న నవ్వు నవ్వి,‘‘అంకుల్ అనడం ఎందుకని, బాబాయ్ అని అంటున్నాను.’’ చెప్పిందామె, సుబ్బారావు గారు కూర్చున్న సిమెంట్ బెంచి పై కాస్త దూరంగా కూర్చుంటూ.
‘‘చాలా సంతోషం .ఇంతకీ నీ పేరెవిటమ్మా.’’ అడిగారు సుబ్బారావు గారు.
‘‘రోధిని బాబాయ్.’’
‘‘రోధిని, బ్బా...బావుందమ్మా.పేరు కొంచెం వింతగా” అని ఆగిపోయి, “అదే అదే కొత్తగా ఉంది.మా అమ్మాయిది కూడా ఇంచు,మించు నీ వయసే. తనపేరు లలిత.ఇపుడు తన కోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను.తను వచ్చాక ఇద్దరం కలిసి రైతు బజారుకు వెళ్ళాలి.మా అమ్మాయి సంగీతం నేర్చుకుంది.అలానే తను నాటికలు వ్రాస్తుంది,నటిస్తుంది కూడా. అలాగే పక్క వీధి స్కూల్లో ప్రైమరీ టీచరుగా కూడా పనిచేస్తోంది.’’చెప్పాడాయన.
‘‘నాకు తెలుసు బాబాయ్.మీ అమ్మాయి పాడటంలో బాగానే పాడుతుంది కానీ నటన మాత్రం నాకు ఎందుకో అంతంత మాత్రమే అనిపించింది బాబాయ్”.
“మా అమ్మాయ్ బానే నటిస్తుందమ్మా .మరి నీకు ఎందుకని అలా అనిపించింది”.అడిగాడయన ఆశ్చర్యంగా.
“ఎందుకంటే,నేను మీ అమ్మాయి నటించిన ఏడుపుగొట్టు పిల్ల నాటికని కొద్ది రోజుల కిందట యూట్యూబ్లో చూసాను.కానీ అందులో ఎవరూ సరిగా ఏడవలేదు.అంతా ఏదో మమ అన్నట్టుగా ఏడ్చి కళ్ళు తుడుచుకున్నారు.మీ అమ్మాయి లలిత కూడా మనసుపెట్టి,మనస్ఫూర్తిగా,ప్రేక్షకుల మనసు పిండేలా ఏడవాల్సినంత ఏడవలేదనిపించింది బాబాయ్.ఆ సందర్భానికి ఇంకా ,ఇంకా వెక్కి,వెక్కి,గుక్కపెట్టి ఏడ్చి నటించినా బానే ఉంటుందని నాకనిపించింది.’’చెప్పిందామె కాస్త నిరాశగా.
‘‘అలాగా!నేనూ ఆ నాటిక చూసానే. కళ్ళ నీళ్లు పెట్టుకుంది.కళ్ళు తుడుచుకుంది .బాగానే ఏడ్చిందని శాలువా కూడా కప్పారు కదమ్మా. అయినా ముక్కుపుడక పోతే అంతకన్నా బాధపడటం అనవసరమేవోనమ్మా ‘‘అడిగారు సుబ్బారావు గారు బుర్రగోక్కుంటూ అమాయకంగా .
‘‘భలే వాడివే బాబాయ్. బాధపడటం, ఏడవటం అంటే అదా! ఏడుపంటే అది కాదు బాబాయ్.కళ్ళు ఎర్రగా అయిపోవాలి. పత్తికాయల్లా ముందుకు పొడుచుకొచ్చేయాలి. వల,వలా ఏడవాలి.కన్నీరు జల,జలా రాలాలి.నెత్తిబాదుకోవాలి.మొహం ఉబ్బిపోవాలి.ముక్కు చీదుకోవాలి.అరిచి గీ పెట్టాలి. గుండెలు బాదుకోవాలి.వెక్కి వెక్కి ఎగిరిపడుతూ ఏడవాలి. అపుడే కదా ఏడుపు పండేది.కానీ ఇందులో ఏడుపు అంత పండలేదు ప్చ్’’ చెప్పిందామె.
‘‘అదేంటమ్మా అలా అంటావ్.ఏడుపు అంటే నువ్వు చెప్పినంత బీభత్సం అక్కరలేదు.కళ్ళు చెమర్చినా,ఓ చుక్క కన్నీరు కారినా,కళ్ళు తుడుచుకున్నా అదీ ఏడుపే కదమ్మా. కాకపోతే అవసరం అనుకున్న వరకే ఏడవాలి కానీ, అతికి పోతే అతై పోవచ్చు లేదా అతకకపోవచ్చ.ఉప్పు, తీపి కూడా ఆయా పిండివంటని బట్టే వాడతారు.లేకుంటే వెగటు,కశిం అయిపోవచ్చును.అలాగే ఇదీనూ.మోతాదు తగ్గిందనడం వరకూ ఏమో కానీ,నువ్వనుకున్నట్టే అంతా ఏడవాలంటే ఎలా అమ్మా.అప్పటికి తోచినట్టుగా అలా ఏడ్చింది.పోనీ ఆ నాటికలో నువ్వూ పాల్గుని ఏడవాల్సింది కదా.నీకూ శాలువా కప్పేవారు.’’అడిగాడాయన.
ఆయన మాటలకి మెలికలు తిరుగుతూ, ‘‘ఆ....అమ్మా నేను అలా ఏడవలేను బాబూ. నాకలా ఏడవడం రాదు .కానీ ఎవర్ని ఎలా ఏడిపించాలో , ఎవరెలా ఏడవాలో ,ఎంత ఏడవాలో,ఏ రకంగా ఏడవాలో మాత్రం చెప్తాను.’’చెప్పిందామె గొప్పగా పళ్లికిలిస్తూ
‘‘అలాగా!ఇంతకీ నువ్వు ఏం ఏడుస్తుంటావ్” అని నాలుక్కరుచుకుని, “అదే అదే ఏం చేస్తుంటావమ్మా’’ అడిగారు సుబ్బారావు గారు.
‘‘నేను, ఏడుపు కాపురం,రోధించే మనసు,నన్ను చూసి ఏడవకు,ఆమె ఏడ్చింది,కొందరి ఏడుపు నాపైన, నా ఏడుపు అందరి పైనా అనే డైలీ సీరియల్స్ డైరెక్ట్ చేసాను బాబాయ్. నా ప్రస్తుత సీరియల్ నీకు పడి ఏడుస్తాను ఇరవైరెండు వేల రెండువందల ఎపిసోడ్లు పూర్తయ్యాయి.ఏడుపు నవ్వింది అనే కొత్త డైలీ సీరియల్ కూడా నిన్ననే ప్రారంభం అయింది. అయితే ఆ టైటిల్ కి అర్ధం గూగుల్ లో కూడా దొరకలేదని కొందరూ, ఈ టైటిల్ కి అర్ధం పర్దం ఉందా అని కొందరూ,పరమ విచిత్రంగా ఉందని కొందరూ ఇప్పటికే ఫోన్లు చేసి చెప్పారు బాబాయ్ ’’చెప్పిందామె మరింత గర్వంగా.
‘‘అలాగా’’ అని పైకి అనేసి, ‘‘ఓసినీ మొహం మండా. పచ్చని కుటుంబాల్లో వెచ్చని కుట్రాలూ, రచ్చకీడ్చే కుతంత్రాలూ ఎలా చేయొచ్చో పూసగుచ్చినట్టు చెబుతూ,అవతలి వారిని రాచి రంపాన పెట్టి లబో,దిబోమని ఎలా ఏడిపించొచ్చో చూపే ఆ ఏడుపుగొట్టు ఓవర్ ఏక్షన్ సీరియల్స్ నీవా.’’ అనుకున్నాడాయన మనసులో.