విజపురి సంస్థానానికి జమిందార్ రాజా రావు బహుదూర్ అదిత్యవర్మ. అతడికి ఇంటినిండా సేవకులు. ఇక్కడి వస్తువు అక్కడ పెట్టాలన్నా , అక్కడివస్తువు ఇక్కడికి తేవాలన్నా బంట్రోతు ఉండాల్సిందే.
ఆఖరికి రాజావారి కోటు విప్పటానికి కూడా ఓ సేవకుడు సిద్ధంగా వుండేవాడు. ఇక రాజావారు చేసే పనల్లా తినటం, మెత్తటి పరుపుపై తనివితీరా కునుకు తీయడం. దీని వల్ల చిన్న వయసులోనే ఊబకాయం వచ్చింది. కొంత దూరం కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది.
అడుగుతీసి అడుగు వేస్తే ఆయాసం. అందువల్ల ఆరోగ్యం ఆందోళనగా మారింది. సంస్థాన వైద్యుడు నయం చేయలేక పోయాడు. సమస్య మరీ తీవ్రంగా మారింది. విదేశీ వైద్యులను పిలిపించారు. వారు అన్నిరకాలా ఆధునిక పరీక్షలు జరిపి జబ్బు నయం కాదని చేతులెత్తేశారు.
రాజా వారిలో భయం ఆవరించింది. ఇక తన గతి ఇంతేనా? అని మానసిక వేదనకు గురయ్యాడు. అదే సమయంలో గుండెపోటు వచ్చింది. సంస్థాన వైద్యుని సమయస్ఫూర్తి వైద్యంతో గండం గడిచింది. అతికష్టంపై కోలుకున్నాడు. ఇలాంటి వేళలో ఓ నాటు వైద్యుడు వచ్చాడు. అతడు ఆ ప్రాంతంలో పేదవారికి మూలికలతో వైద్యం చేస్తాడు. పైసా తీసుకోడు. రాజావారి పరిస్థితి తెలుసుకుని వచ్చాడు. ఆసాంతం పరిశీలించాడు. పరీక్షించాడు.
అయ్యా! రాజా వారికి నేను చికిత్స చేస్తాను. సంపూర్ణగా నయం చేస్తాను" అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. "సరే కానివ్వండి. ఏ పుట్టలో ఏ పాము ఉందొ చూద్దాం" అన్నది రాజావారి భార్య. నాటు వైద్యుడు చికిత్స మొదలుపెట్టాడు. రాజావారు రాత్రి వేళలోమాత్రమే నిద్రించాలన్నాడు. పగలు ఒక్క క్షణం కూడా కునుకు తీయకూడదన్నాడు.
పొద్దస్తమానం ఏదో ఒక పని కల్పించుకుని శారీరక శ్రమ చేయాలన్నాడు.. వళ్లంతా విపరీతంగా చెమట పట్టిన తరువాత మాత్రమే భోజనం చేయాలన్నాడు. చెమటతో వళ్ళు తడవకుండా ముద్దైనా ముట్టవద్దన్నాడు. మాంసం అసలు ముట్టవద్దని, పూర్తిగా శాకాహారమే తినాలన్నాడు. ఇలా మూడు నెలలు చేస్తే రాజావారి ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పాడు. తప్పని పరిస్థితులలో రాజావారు ఒప్పుకున్నాడు.
వైద్యుడు చెప్పినట్టు చేసాడు. పొద్దున్నే నిద్రలేచిన వెంటనే పొలం వెళ్ళేవాడు. చెమట పట్టేవరకు బావిలో నీళ్లు చేది పూల మొక్కలకు, ఆకు కూరల, కూరగాయల చెట్లకు నీళ్లు పెట్టేవాడు. నడుచుకుంటూ ఇంటికి వచ్చి అల్పాహారం సేవించి తిరిగి పొలం వెళ్లేవాడు. చెమట పట్టేదాకా పొలం పనులు చేసేవాడు.
పచ్చటి చెట్ల క్రింద కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు. మళ్లీ పని ప్రారంబించేవాడు. ఇలా మూడు నెలలు గడిచాయి. రాజావారిలో స్పష్టంగా మార్పు కనిపించింది. ఆరోగ్యం బాగైంది. తేలికగా తిరగగలుగుతున్నాడు. మునుపటి రుగ్మతలన్నీ పోయాయి. హాయిగా ఉంటున్నాడు.
ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పక చేయమని చెప్పి నాటు వైద్యుడు ఇంటికి వెళ్లబోయాడు. రాజావారు అతడికి విలువైన బహుమతులు ఇవ్వబోయిన తీసుకోలేదు. "నమ్ముకున్న వైద్యాన్ని నలుగురికి సేవ చేయటానికే ఉపయోగించాలిగానీ అమ్ముకో కూడదు" అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు. శ్రమలోనే ఆరోగ్యం ఉందని, శ్రమ విలువ వెల కట్టలేనిదని రాజావారు గ్రహించారు.