తాళంచెవి - చెన్నూరి సుదర్శన్

talamchevi

కొన్ని, కొన్ని సంఘటనలు మన జీవితాలను మలుపు తిప్పుతాయనడంలో సందేహము లేదు. నా జీవితలోనూ అలాంటి ఒక ‘తాళంచెవి’ సంఘటన 1972లో జరిగింది. నన్ను మరింత క్రమశిక్షణ మార్గంలో నడిపించింది.

అప్పుడు నా డిగ్రీ ప్రథమ సంవత్సరపు పరీక్షలు పూర్తై వేసవి సెలవులు వచ్చాయి. ప్రతీ వేసవి సెలవుల్లోనూ నేను మా అమ్మమ్మ ఊరు హుజూరాబాదుకు వెళ్ళడం పరిపాటి. నేను వచ్చానంటే మా అమ్మమ్మ ఎగిరి గంతులేసినంత పనిచేస్తుందంటే అతిశయోక్తిగాదు. అంత సంబరపడి పోతుంది. నేను అమ్మమ్మ చేసే పనుల్లో సాయపడ్తూండమే దానికి కారణం.

తాతయ్య చేనేత మొగ్గం మీద చీరెలు నేసే వాడు. అమ్మమ్మ నూలు పంటెలకు పట్టడం.. ఆసు పోయడం.. కండెలు చుట్టడం తదిర పనులు చేస్తూ.. తాతయ్యకు సహకరించేది. ఇరువురు రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆదాయం అంతంత మాత్రమే. ఇంటి ఖర్చులకు ఇక్కట్లు రాగూడదని అదనపు సంపాదన కోసం అమ్మమ్మ మరో ప్రవృత్తి పెట్టుకుంది. అది సవరాలు అమ్మడం. ఆకాలంలో వాటికి గిరాకీ ఎక్కువగా ఉండేది. ఏమాత్రం సమయం చిక్కినా.. అత్యవసరమైతే రాత్రి గూడా కిరోసిన్ దీపం గుడ్డి వెలుగులోనూ సవరాలు అల్లేది.

తాతయ్యకు ముక్కుమీదే ఉంటుంది కోపం. సమయానికి కస్టమర్లకు చీరెలు అందించాలని తెగ తాప్రయపడే వాడు. దరిమల టీ, టిఫిన్ లు అన్నీ మొగ్గం కాడికే అందించాలి అమ్మమ్మ. కాస్త ఆలస్యమైనా రుస, రుసలాడే వాడు. అందుకే అమ్మమ్మకు నేను వచ్చానంటే.. సంబురం. కాస్త వెసులుబాటు దొరుకుతుందని. నాకు ఆసుపొయ్యడం చేతకాదు గాని మిగిలిన పనులన్నీ చేసే వాణ్ణి. నేను ఒకరికి ఋణపడి ఉండనన్నట్టు, అప్పుడప్పుడు సినిమా చూడ్డానికి అమ్మమ్మ నాకు డబ్బులిచ్చేది.. మాకిద్దరికీ జిగ్రీ దోస్తానా..

మా అమ్మమ్మకు ఇద్దరు కూతుళ్ళు. కొడుకులు లేరు. అల్లుళ్ళైనా.. కొడుకులైనా వాళ్ళే.. అని ఇద్దరికీ తమకున్న ఖాళీ స్థలంలో ఇండ్లు కట్టుకొమ్మని తాతయ్యతో వీలునామా రాయించింది. అలాంటి అమ్మమ్మ అంటే నాకు ప్రాణం. నేను పెద్ద కూతురు కొడుకును. మా నాన్న, చిన్నాన్న తాతయ్య ఇచ్చిన స్థలంలో ఇండ్లు కట్టుకుని కిరాయలకిచ్చారు.

మా ఇంట్లో సత్యనారాయణ ఉపాధ్యాయుడు కిరాయకు ఉండే వాడు. అతణ్ణి అంతా సత్తయ్య సారు అని పిలిచే వాళ్ళు. ఆ రోజు ఆదివారమయినా.. తనకు ట్రైనింగ్ క్లాసు ఉంది. వచ్చేసరికి సాయంత్రమవుతుంది. ఇంతలో మా వాళ్ళు ఎవరైనా వస్తే ఇవ్వుమని తన ఇంటి తాళంచెవి నాకిచ్చి వెళ్ళాడు.

సాయంత్రంయ్యింది. సత్తయ్య సారు రాలేదు.. వారి ఇంటికీ ఎవరూ రాలేదు. నాకు గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటు. తాళంచెవిని అమ్మమ్మకు ఇవ్వడం మర్చిపోయాను. నా జేబులోనే ఉండిపోయింది.

మా ఇంటికెదురుగా ఉండే కనుకయ్య అనే స్నేహితునితో కలిసి గ్రంథాలయానికి వెళ్లాను. కనుకయ్య బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి కూలీ, నాలీ చేస్తూ.. చదివిస్తూంది. బాగా చదువుకోవాలని, తల్లికి బాసటగా నిలువాలని హితవు పలికే వాణ్ణి. నేనంటే కనుకయ్యకు ఎంతో అభిమానం. నేను వచ్చినప్పుడల్లా అతనికి గణితశాస్త్రంలో మెళకువలు నేర్పే వాణ్ణి. అలా మా ఇద్దరిమధ్య గట్టి మైత్రిబంధం ఏర్పడింది.

గ్రంథాలయంలో దాదాపు గంటసేపు గడిపి.. అటునుండి నేరుగా కొత్త బస్ స్టాండు దగ్గరలో ఉన్న ఒక ఆయుర్వేద క్లినిక్ వెళ్లాం. గట్టు విజయ డాక్టరమ్మ పేదలకు ఉచితంగా సేవలందిస్తూ.. మందులు సైతం ఉచితంగానే ఇస్తుంటుంది. కనుకయ్య తల్లి గారికి నడుం నొప్పి జాస్తి. ఆమె కోసం కొన్ని మందులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి దాదాపు ఎనిమిదయ్యింది. నాకోసం సత్తయ్య సారు కళ్ళల్లో ఊపిరి పెట్టుకుని ఎదురి చూస్తున్నాడు. నన్ను చూడగానే తాతయ్య గయ్యిన నా పైకి లేచాడు.

“ఏ ఊళ్లు తిరుగబోయావు క్రిష్ణా.. నీ కోసం సారు లైబ్రరీ.. బజార్లన్నీ వెదకి, వెదకి వచ్చాడు. తాళంచెవి జేబులో వేసుకుని షికార్లు కొడ్తావా?.. సారు పొద్దుననగా టిఫిన్ చేసి వెళ్ళాడు. ట్రైనింగ్ దగ్గరా భోజనం పెట్టలేదట. త్వరగా వంట చేసుకొని తిందామంటే.. తాళంచెవి లేకపాయే..! పాపం..! ఆకలితో సారు నక, నకలాడి పోతున్నాడు” అంటూ కన్నెర్ర చేశాడు.

నాకు చివరిమాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. అమ్మమ్మ పెదవి విప్ప లేదు. ఆమె మౌనం నన్ను మరింత బాధించింది. తాతయ్య మాటలు కనుకయ్య ఇంటి వరకు వినిపించాయో ఏమో!.. గబా, గబా వచ్చి.. “తాతయ్యా.. ఇందులో క్రిష్ణ తప్పేమీ లేదు. నేనే మా అమ్మ మందుల కోసం ఆయుర్వేద హాస్పిటల్ కు తీసుకు..” అంటూండగానే..

“చాల్లే.. పెద్ద పనిమంతుడివి.. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట” చెంప మీద ఛెళ్ళున కొట్టినట్టు సామెతల మీద సామెతలు గుప్పించాడు తాతయ్య. కనుకయ్య కళ్ళ నుండి నీళ్ళు జల, జలా కారసాగాయి. ఆ దృశ్యం చూడలేక పోయాను. నా తప్పుకు తను మాట పడాల్సి వచ్చిందని.. తల దించుకున్నాను. కనుకయ్య కళ్ళు తుడ్చుకుంటూ.. తిరిగి అంతే వేగంగా వెళ్ళిపోయాడు.

ఇంతలో అమ్మమ్మ కూరకటోరతో ప్రత్యక్షమయ్యింది.

“క్రిష్ణా.. ఇది సత్తయ్య సారుకివ్వు” అంటూ కటోర నా చేతికందించింది. తీసుకు వెళ్లి సారుకిస్తూ..

“సారీ సార్.. ఇబ్బంది కలిగించాను. నన్ను క్షమించండి” అంటూ పాదాలనంటబోయాను. సత్తయ్య సారు గబుక్కున వెనక్కి జరిగి “ఇట్సాల్ రైట్” అంటూ అన్నం ఉడుకుతున్న గిన్నె మీద దృష్టి సారించాడు. నేను వెనుదిరిగాను.

ఆరాత్రి అమ్మమ్మ ఎంత బతిమాలినా నేను భోజనం చెయ్య లేదు. అమ్మమ్మ గూడా భోజనం చేసినట్టుగా లేదు.

ఆ మరునాడు సోమవారం.. వేములవాడ రాజేశ్వరునికి శ్రేష్టమైన రోజు. ఆ రోజు భక్తులు తమ మొక్కులు చెల్లిచుకోవడం కద్దు. తాతయ్య గూడా దేవునికి లేగదూడను కట్టిస్తానని మొక్కుకున్నాడట. అమ్మమ్మ, తాతయ్య తెల్లవారుఝామున నాలుగు గంటలకే వేములవాడకు ప్రయాణమయ్యారు. నన్ను రమ్మంటే.. నాకు కాలేజీ ఉంది.. కుదరదని రెండు రోజుల క్రితమే చెప్పాను. ఇంటి తాళంచెవి సత్తయ్య సారుకిచ్చి వెళ్ళమని జాగ్రత్తలు చెప్పింది అమ్మమ్మ.

నేను ఉదయం ఆరు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాను. ఇంటికి తాళమేసి, తాళంచెవి సత్తయ్యసారుకిచ్చి బస్ స్టాండుకు బయలుదేరాను. టీ త్రాగ లేదు. టిఫిన్ చెయ్య లేదు. బస్ రాగానే ఎక్కి కూర్చున్నాను. హుజూరాబాడు నుండి హన్మకొండ దాదాపు ముప్పది కిలోమీటర్లు.. ముప్పావు గంట ప్రయాణం. హన్మకొండ కొత్త బస్ స్టాండులో బస్సు దిగి నేరుగా రాధాస్వామి సత్సంఘ్ లో ఉన్న నా పదమూడవ నంబర్ గదికి వెళ్లాను. నా రూం మేట్స్ నలుగురూ.. రాలేదు. పుస్తకాలు సర్దుకుని.. బాలసముద్రం గుండా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి అలవాటు ప్రకారం నడచుకుంటూవెళ్లాను.

సాయంత్రం గదికి వచ్చేసరికి సత్సంఘ్ కు ఎదురుగా ఉండే నమ్రత అనే పాప నన్ను చూసి పరుగెత్తుకుంటూ వచ్చింది.. “అన్నయ్యా.. ఎప్పుడు వచ్చావు” అంటూ తన సంతోషాన్ని వ్యక్త పర్చింది. నమ్రతకు నేనంటే చాలా ఇష్టం. నేనామెకు సాయంత్రం పూట హోంవర్క్ చేయిస్తుంటాను. మూడవ తరగతి చదువుతోంది. చిన్న, చిన్న మ్యాజిక్ ట్రిక్స్ ఇంకా కథలూ చెబుతూ ఉంటాను.

ఆ పూట కొన్ని నీతి కథలు చెబూతూ..“ఎప్పుడైనా మనం తప్పులు చేస్తే.. జీవితంలో గుర్తుండి పోయేలా.. మనకు మనం శిక్ష విధించుకోవాలి. దాని మూలాన మళ్ళీ మనం అలాంటి తప్పులు చేయడానికి ఆస్కారముండదు” అని నా తాళంచెవి సంఘటన దానికి నేను విధించుకున్న శిక్ష చెప్పాను. ఎంతో శ్రధ్ధగా విన్న నమ్రత “నేను తప్పు చేస్తే.. అమ్మ కొడుతుంది” అంటూ బిక్క ముఖం పెట్టింది.

“తప్పు అని నీకు తెలిసింది కదా..! అలాంటి తప్పులు మళ్ళీ చెయ్యకుండా.. మీ టీచర్లతో గానీ.. అమ్మతో గానీ.. దెబ్బలు తినకుండా మసలు కోవాలి. నీ స్నేహితులతో గూడా దెబ్బలాడే పరిస్థితి తెచ్చుకోవద్దు” అంటూ ముద్దు, ముద్దుగా చెప్పాను. అన్నింటికీ వినయంగా తలూపుతూ.. నేను నీరసంగా ఉండడం గమనించిండెమో!.. ‘గుడ్ నైట్’ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది.

నేను స్నానం చేసి.. ఆకలి మీద ధ్యాస లేకుండా పోవాలని వెళ్లి సత్సంఘ్ లో కూర్చున్నాను. సాయంత్రం ఆరు గంటల నుండి దాదాపు రెండు గంటల సేపు రాధాస్వామి భక్తులంతా స్వామి వారి మహిమలు చెప్పుకోవడం నిత్యకృత్యం. చివరగా భజన, హారతితో కార్యక్రమం ముగుస్తుంది. నేను కేవలం తీర్థం మాత్రమే తీసుకుని.. ప్రసాదం అక్కడి వాచ్ మన్ వీరయ్యకిచ్చి గదికి వచ్చాను.

ఇక పడుకుందామని వీధి గుమ్మం బీగం పెట్టి దుప్పటి సర్దుకుంటున్నాను. గుమ్మం తట్టిన శబ్ధమయ్యింది. నా రూంమేట్ ఎవరైనా వచ్చారనుకుని తలుపు తీశాను. ఎదురుగా నమ్రత టిఫిన్ బాక్స్ తో నిలబడి ఉంది.

“అన్నయ్యా.. అమ్మ పంపించింది” అంటూ దీనంగా ముఖం పెట్టింది తినమన్నట్టుగా.. నేను స్థాణువయ్యాను. “నేను భోజనం చెయ్యలేదని అమ్మకు ఎందుకు చెప్పావు” అంటూ నెమ్మదిగా అడిగాను. నమ్రత మౌనంగా తల దించుకుంది.

“అమ్మకు థాంక్స్ చెప్పు” అంటూ నేను బాక్స్ తీసుకున్నాను.

“తినండి అన్నయ్యా.. నేను కూర్చుంటాను”

“నాకు కాస్త పని ఉందిరా.. అర్జంటుగా బుక్ స్టాల్ కు వెళ్ళాలి. వచ్చాక తింటాను. ప్రామీస్” అంటూ చిన్న అబద్ధమాడి నమ్రతను పంపించేశాను.

ఆ మరునాడు ఉదయం బాక్స్ తెరుస్తుంటే.. నమ్రత ప్రత్యక్షమయ్యింది.

“సత్తయ్య సారు అనుభవించిన ఆకలి బాధ నాకు తెలిసి రావాలని రాత్రి భోజనం చెయ్యలేదురా..” అంటుంటే నమ్రత కళ్ళు చెమ్మగిల్లాయి. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని.. ప్రేమగా వీపు తట్టాను.

“ఇప్పుడు తినేసి కాలేజీకి వెళ్తానురా..” అంటూ గబా, గబా తినేసి టిఫిన్ బాక్స్ కడుగుతుంటే.. నమ్రత అడ్డుకుంది. కాని నేను నచ్చజెప్పి బాక్స్ శుభ్రం చేసి నమ్రతకిచ్చాను.. మరో సారి అమ్మకు థాంక్స్ చెప్పమంటూ..

ప్రస్తుతం నా వయస్సు డెబ్బది వసంతాలకు చేరువయ్యింది. మతిమరుపు అంటే ఏమిటో తెలియకుండా చేసింది తాళంచెవి. *

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి