అదేమాట పదేపదే నాగుండెను తొలిచివేస్తోంది. ముఖాన కొందరు, చాటుగా కొందరు నాలోటును ఎత్తి చూపుతున్నారు. బాధతో అమ్మ కూడా ఏదో ఒక సందర్భంలో తన అసంతృప్తిని వెలిబుచ్చుతూనే వుంది. కాని అందుకు తను చేసిన తప్పేమిటో ఎంతకు అర్థంకావటం లేదు. అందరిలాగే తనకూ ఆశ ఉంది. కానీ ఎందుకో భగవంతుడికి తన మీద దయ కలుగలేదు. మొదటి నాలుగు సంవత్సరాలు పెద్దగా పట్టించుకోలేదు ఎవరూ. కానీ ఇప్పుడు పది సంవత్సరాలు జరిగేసరికి కొన్ని నిష్టూరాలు, మరికొన్ని ఎత్తిపొడుపులు, ఇంకొన్ని సానుభూతులు అదేదో జీవితంలో జరగకూడని ఘోరమేదో జరిగినట్లు. ఎవరెవరో ఎన్ని రకాలుగా మాట్లాడినా తనను పొరపాటున కూడ ఒక్కమాట అనని వ్యక్తి తన భర్త చక్రపాణి. ఎన్నోసార్లు తన దగ్గర బాధపడింది మనసు నొచ్చుకుని ఏడ్చింది కూడ. కానీ అతని నుంచి ఓదార్పు తప్ప ఎటువంటి తిరస్కారం గానీ, సూటిపోటి మాటగాని విని ఎరుగదు.
అందుకనే ఇంతకాలం ఎవరు ఏమన్నా తను భరించగలుగుతున్నది. అందుకేనేమో పెద్దలంటారు 'భర్త అండవుంటే చాలు లోకాన్ని జయించవచ్చని'. తన భర్తను చూస్తే అది నిజమనిపిస్తున్నది. ఎంతమంది మగవాళ్ళు తన భర్తలా ఉంటారు. ప్రతి చిన్న విషయానికీ భార్యను సాధించేవారు, హింసించేవారు తప్ప. ఇలా సాగుతున్న ఆలోచనలకు కళ్ళెం వేస్తూ ఆగింది శ్రీమహి ప్రయాణిస్తున్న కారు. "మహి ఏమిటి చాలా పరధ్యానంగా ఉన్నావు. ఇందాక రెండుసార్లు పిలిచినా ఎటువంటి సమాధానం లేదు. ఏమాలోచిస్తున్నావేమిటి" కారును ప్రక్కగా ఆపి అడిగాడు చక్రపాణి.
ఉలిక్కిపడి లేచింది మహి "అబ్బే ఏమీలేదు చక్రీ. ఏదో లోకంలో ఉన్నాను. అందుకే వినపడలేదు" "ఊరికే అన్నాను గానీ ఇక దిగు మనం రావాలనుకున్న చోటికి వచ్చేశాము" అంటూ కారు దిగాడు. మహి కూడ దిగి తలపైకెత్తి చూసింది. ఎదురుగా ఒక ఇల్లు కనిపించింది. తేరిపారచూసింది పైన బోర్డు ఆమెను ఆకర్షించింది. "తల్లి సంరక్షణ (అమ్మ నిలయం)" "ఇదేనా చక్రి నువ్వు చెప్పింది. ఇక్కడినుంచేనా మనం ఎవరినైనా తెచ్చుకుందామనుకుంది. కానీ వద్దనుకున్నాము కదా మరల" సందేహం వెలిబుచ్చింది మహి. "వెళ్దాం పద. లోపలికి వెళ్ళిన తరువాత చెప్తాను" అంటూ ఇంటి లోపలకు దారితీశాడు చక్రి. "నమస్తే సర్. మీరు చెప్పినట్లుగా అన్నీ రెడీ చేశాను.
రేపు ఉదయానికల్లా ఇద్దరు ఆయాలొస్తారు. నిన్న మేనేజర్ కల్యాణి గారు రైలు దిగి వస్తుంటే ప్లాట్ ఫామ్ మీద పసిపాప ఏడుస్తూ కనిపించిందట. దగ్గరకు వెళ్ళి ఆ పాపను ఎత్తుకున్నదట. ఆ పాపతో పాటు ఉన్న ఒక చిన్న కాగితంలో " నా పాపం పాప రూపంలో పండింది. సమాజానికి భయపడి వదలివెళుతున్నాను. మనసున్న తల్లి చేరదీస్తుందని ఆశ" అని రాసివున్నదట. ఎలాగు మనం ఇలాటి వారిని చేరదీయాలనుకుంటున్నాము కదాయని తీసుకువచ్చింది. మీకభ్యంతరం లేకపోతేనే" అంటూ ఎదురువచ్చాడు
ఒక వ్యక్తి. "మంచిపని చేసింది. ఇంతకూ ఆ పాప ఎక్కడ? చూపించు రమేష్" అంటూ మహి చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు చక్రి. మహికి అంతా అయోమయంగా ఉంది. గుడ్డిగా చక్రిననుసరించింది. "ఇదుగోండి సర్" అంటూ ఉయ్యాలలో వున్న పాపను చూపించాడు రమేష్. బొద్దుగా, తెల్లగా వుంది పాప. అప్రయత్నంగా చేతుల్లోకి తీసుకుంది మహి. ఆమె కళ్ళల్లో తెలియని ఆనందం. పాపను గుండెకు హత్తుకుంది.
"చక్రీ. మనం ఈ పాపను తీసుకెళ్ళి పెంచుకుందామా" అనాలోచితంగా అడిగింది మహి. "మహి నన్ను తప్పుపట్టకు. ఇదంతా నీకు తెలియకుండా చేశాను. మనకు పిల్లలు లేరని నలుగురు అనే మాటలు, నువ్వు పడే బాధ చూశాను. పిల్లలున్న తల్లులలో కూడా చూడని అమ్మమనసు నీలో చూశాను. కంటేనే తల్లి కారు మహి- ప్రేమించే మనసున్న ప్రతి ఆడపిల్ల తల్లే. కడుపున బిడ్డను మోయని వారిని మనసులేని వారంతా అప్రజాత, గొడ్రాలు అని ముద్రవేస్తారు. వారంతా బిడ్డల తల్లులే. వారికి మనసనేది ఉన్నదా? లేదు మహి వారు మనసులేని తల్లులు.
పిల్లలను కనలేకపోవడం ఆ అమ్మాయిల తప్పుకాదనీ, అది విధిరాతయని తెలియని కసాయివారు. వారి మాటలు పట్టించుకోకు మహి. ఆకాశమంత నీ ప్రేమ ఏ ఒక్కరికో పరిమితం కాకూడదు. అందుకే ఈ నిలయాన్ని మనమే మొదలుపెట్టాలి. మనసుపడో, ఎదుటివాడు మోసంచేసో తల్లులై సమాజానికి భయపడి వారిని దిక్కులేని వారుగా వదిలేస్తే వారు సమాజంలో ఎంత నిర్లక్షానికి గురవుతారో మనకు తెలుసు.
అలాటి వారిని కొందరినైనా చేరదీసి అమ్మా, నాన్నల ప్రేమను పంచుదాం. దేవతలాటి నీ ప్రేమను వారికి పంచు అప్పుడు ఒకరు కాదు మహి ఎందరో నీకు పిల్లలవుతారు. ఎందరు చిన్న కృష్ణులకో నీవు యశోదవవుతావు. మనం నివసించే సమాజానికి మేలు చేస్తూ మనము కూడ తృప్తిని పొందుదాం" ఆనందంతో చెప్తూ మహి కళ్ళలోకి చూశాడు చక్రి. మహి కళ్ళలో నీరు పెల్లుబికింది.
తన మనసును ఇంతగా చదివిన భర్త దొరకడం ఎవరికి దక్కే అదృష్టం. ఆనందంతో ఆమెకు నోట మాట రాలేదు. మహి ఆనందాన్ని అర్థం చేసుకున్న చక్రి " మహీ ఈ పాప దేవుడు మనకిచ్చిన తొలిప్రసాదం" అంటూ పాపను చేతిలోకి తీసుకున్నాడు. "నేను కూడ అమ్మనయ్యాను చక్రీ" అంటూ భర్త భుజంపై తలవాల్చింది శ్రీమహి. "రమేష్. ఇది అనాథాశ్రమం కాదు. ప్రేమనిలయం. అనాథ అనే పదం ఎక్కడా ఉపయోగించకు.
అది వారిని మనకు దూరం చేస్తుంది. ఇక్కడకు వచ్చే ప్రతి బిడ్డకు మహి తల్లి అవుతుంది. అందుకే ఇది అమ్మనిలయం" అంటూ మహిని పొదివి పట్టుకున్నాడు చక్రపాణి.