అద్దం చూసుకుని ఎన్నాళ్ళు అయ్యిందో, ఈ మధ్యలో అద్దంలో తన మొహం చూసుకున్న గుర్తు లేదు. అద్దంలో తన ముఖం చూసుకోగానే తనకే భయం వేసింది ఒక్క క్షణం. వెంటనే అద్దం తీసేసింది. మనసులో ఉన్న బాధ బయటకి కన్నీటి రూపంలో వచ్చేసింది.
*****
చిన్నప్పుడు ఎంత బాగుండేది తను. అందరూ పేరుకి తగ్గట్టు అచ్చు శ్రీదేవి లా ఉన్నావు అంటుంటే ఎంత సంతోషించేది, అందరి కన్నా మురిసిపోయేది తన తల్లి. "నీకేం అందమైన ఆడపిల్లని కన్నావు, దాన్ని చేసుకోవటానికి ఆ చుక్కల్లో చంద్రుడు అయినా దిగి వస్తాడు. నీకేం దిగులు లేదు. చూస్తూ ఉండు!" అని అమ్మ శారదని అంటూ ఉంటే ఎంతో గర్వ పడేది. కానీ ఆ అందం తనకి శాపం అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. తన అందమే తనకి శత్రువు అవుతుందని ఊహించలేదు. అద్దం ముందు నుంచొని తనని తాను చూసుకుని మెరిసిపోయే శ్రీదేవి తన మొహం చూసుకోలేని పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ విధి బలీయమైనది అంటారు కదా!
ఆ విధి రాతని ఎవరూ తప్పించలేరు అన్నట్టు అలా రాసి పెట్టి ఉందేమో తనకి అనుకుంది.
తను కోరుకున్నట్టే ఒక ఆస్తిపరుడు శంకర్, శ్రీదేవి అందం చూసి ముగ్ధుడయ్యాడు. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆస్తి పాస్తులు లేని, తండ్రి లేని, పల్లెటూరి పిల్ల అవ్వటం వల్ల అబ్బాయి తల్లి తండ్రులు ఒప్పుకోలేదు. వాళ్ళని ఎదిరించి, శ్రీదేవి తల్లిని ఒప్పించి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు శంకర్. కొన్ని రోజులు జరగాల్సిన ముచ్చటలు అన్నీ జరిగిన తర్వాత, ఉద్యోగం సంపాదిస్తానని సిటీకి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. చాలా రోజులు ఎదురు చూసి ఇంక రాడని అనుకుంది. అప్పుడే తెలిసింది శ్రీదేవి కి తను తల్లి కాబోతోంది అని
ఆ ఆనందం తనకి దక్కలేదు. శారద శ్రీదేవిని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎంతో జాగ్రత్తగా సాకుతూ వచ్చింది. కానీ అంత కన్నా ఘోరం శ్రీదేవి జీవితంలో జరిగింది. భర్త తనని వదిలి వెళ్లిపోయాడన్న వార్త ఊరంతా పాకింది. దాంతో అల్లరి మూకలు శ్రీదేవి చుట్టూ చేరి గొడవ చేసేవారు. ఒక రౌడి వెధవ శ్రీదేవి చెయ్యి పట్టుకుని తనతో రమ్మన్నాడు. అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పాడు.
ఛీ పొమ్మంది శ్రీదేవి. "నీ అందం చూసుకునే కదా నీకంత పొగరు, నీ పొగరు అణుస్తా, నీ అందం నీకు లేకుండా చేస్తా, చూస్తూ ఉండు!" అని వెళ్ళిపోయాడు. ఆ మాటకి రోషం తెచ్చుకున్న వాడు కాపు కాసి, కసితో శ్రీదేవి అటుగా వెళ్ళటం చూసి తనపై ఆసిడ్ పోసాడు. ఒక్కసారి తన మొహం అంతా కాలిపోయింది.
తను కన్న కలలు అన్నీ కల్లలు అయిపోయాయి. వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు తనని. కానీ అప్పటికే తన మొహం ఒకవైపు గుర్తు పట్టలేనంతగా కాలిపోయింది. తన మొహం అద్దంలో చూసుకున్న శ్రీదేవి కుమిలి కుమిలి ఏడ్చింది. అప్పటికి తనకి నెలలు నిండటంతో ఆపరేషన్ చేసి ఆడపిల్లని బయటకి తీసి ఇచ్చింది డాక్టర్. తన బిడ్డ కూడా ఒకప్పటి తన లాగే ఎంత అందంగా ఉంది,
తన దిష్టి తగిలేలా ఉంది అనుకుంది. ఆ బిడ్డ ని చూసుకుని మురిసిపోయింది. శారద శ్రీదేవిని, బిడ్డని తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది. ఆ బిడ్డని చూసిన శ్రీదేవి ధైర్యం తెచ్చుకుంది. బిడ్డ కోసం బతకాలి అనుకుంది. తన బిడ్డని తన లాగా కాకుండా ధైర్యం నూరిపోయాలని అనుకుంది. కొన్నాళ్ళకి శారద చనిపోయింది.
****
బయటకి వస్తున్న కన్నీటిని రాకుండా కనుకొనల్లో ఆపేసింది. ఆత్మ స్థైర్యం కూడదీసుకుని లేచింది. బిడ్డని పాలిచ్చి పడుకోపెట్టి, తను పని చెయ్యటానికి బయలు దేరింది. తన బిడ్డ ఎలాగైనా మంచి స్థితికి రావాలన్నదే ఇప్పుడు శ్రీదేవి ఆరాటం...