విభూది మహిమ - దార్ల బుజ్జిబాబు

vibhoodi mahima

పూర్వం ఒక ఊరిలో అత్తా కోడళ్ల వుండేవారు. వారికి అసలు పడేదేకాదు. అత్త ఎడ్డేమంటే కోడలు తె్డ్డేెమనేది. అత్త తూర్పు అంటే కోడలు పడమట అనేది. ఇద్దరికి గడియ పడేదికాదు. దీనితో వీరి వాదనలు భరించలేక వారిద్దరి భర్తలు ఎటో వెళ్లిపోయారు. ఏళ్ళు గడిచినా తిరిగి రాలేదు.

ఇలా రోజులు గడిచి పోతున్నాయి. అత్తాకోడళ్ల మధ్య పిల్లి కుక్కల్లా వైరం పెరుగుతూనే ఉంది. ఇంతలో ఆ వూరికి ఓ సాధువు వచ్చాడు. అతడు సత్యం గల సాధువు. సకల శాస్త్రాలు చదివాడు. హిమాలయాలనుండి తన శిష్యుడితో వచ్చాడు. ఆయన పరిష్కరించలేని సమస్యంటూ ఉండదు.

వారి వద్ద దేనికైనా చిటికెలో సమాదానం దొరుకుతుంది. అత్తా,కోడలు ఒకరికి తెలియకుకూడా ఒకరు సాధువును కలిశారు. కోడలిని చంపే మందు ఇవ్వమని అత్తా, అత్తను చంపే ఉపాయం చెప్పమని కోడలు సాధువును అడిగారు. ఆయన వారికి ఓ విభూది పొట్లం ఇచ్చాడు. అరునెలలపాటు ప్రతిరోజు పాలలో కలిపి తాపాలన్నాడు. ఏ పరిస్తిలోనైనా ఈ విషయం తాగిన వారికి తెలిస్తే మందు పనిచేయదని హెచ్చరించాడు. అతి రహస్యంగా వుండాలన్నాడు. కానీ ఓ షరతు పెట్టాడు. ఆరు నెలలు పాటు అత్తను కోడలు కన్న తల్లిని చూసు కున్నట్టు చాలా ప్రేమగా చూడాలన్నాడు. అలాగే కోడలిని అత్త కన్న కూతురు కన్నా మిన్నగా చూసుకోవాలన్నాడు.

ఆరు నెలల తరువాత ఏ క్షణంలోనైనా మరణం సంభవిస్తుందని చెప్పాడు. వారు సరే అని వెళ్లిపోయారు. కాలం ఎవరికోసం అగదు కదా? తనపని తాను చేసుకు పోతుంది. అత్తా కోడళ్లు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు వారి పనులు వారు చేసుకుపోతూ వున్నారు అతి రహస్యంగా. లేని ప్రేమలు ఒలకబోస్తూ ఒకరినొకరు ప్రేమగా చేసుకుంటున్న వారిలో నిజంగా ప్రేమ పుట్టుకొచ్చింది. తల్లీ కూతుళ్ళలా సఖ్యంగా వుండసాగారు. వారిలో మార్పు వచ్చింది. అత్తను వదలి కోడలు, కోడలిని వదిలి అత్తా ఒక్కక్షణంకూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన గడువు దగ్గరపడింది. ఎదుటివారు చనిపోతారేమోననే భయం పట్టుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరు సాధువును కలిశారు. విరుగుడు మందు ఇవ్వమని కోరారు. ఆయన మళ్లీ వేరే రంగు పొట్లం ఇచ్చాడు.

మళ్ళీ ఆరునెలలు అదేవిధంగా పాలలో కలిపి తాపమన్నాడు. మళ్ళీ తల్లి కూతుళ్ళలా సఖ్యంగా వుండాలన్నాడు. వారు అలాగే చేశారు. ఏడాది గడిచింది. ఎంతో అన్యోన్యంగా వుండసాగారు. ఇంతలో దేశాంతరం వెళ్లిన వారి భర్తలు వచ్చారు. వారిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషిించారు. వారికి విభూది ఇచ్చిన సాధువులు వారే అనే సంగతి ఆ తండ్రి కొడుకులకు తప్ప మరేవారికి తెలియదు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు