" వెంకన్నా ! గంగ ఎక్కడి కెళ్లిందిరా,దొడ్లో కనిపించడంలేదు." ప్రశిడెంటు గారు కేకలేస్తున్నారు. " ఏమో బాబూ, నాకూ తెలవడం లేదు. పొలం గట్టంట మేస్తుందని కట్టు విప్పి బయటి కొదిలినా, ఎటుపోయిందో ఏటో. ఉండండి పోయి తోలుకొస్తా" అన్నాడు పాలేరు. " పోయి తీసుకురా, పాలు పితికే సమయమైంది." చికాకు పడుతున్నారు ప్రశిడెంటు. పాలేరు వెంకన్న గబగబా పోయి పొలం అంతా వెతికినా ఆవు గంగ జాడ కనబడలేదు. ఊరి పురోహితుడు రమణ పంతులు ప్రశిడెంటు గారిమనవడికి ఆవుపాలు అవుసరమని తెలిసి వారి వద్ద ఉన్న ఆవుల్లోంచి గంగని వారింటికి పంపించారు.గంగ వచ్చి వారం రోజులైంది.
పంతులు గారింట్లో సమృద్దిగా పాలిచ్చే ఆవు గంగ కేమయిందని తర్జనభర్జన పడుతు విషయం ఆయనకు చెబితే వారూ ఏమీ చెప్పలేక పోయారు. కొద్ది రోజులు చూసి గంగని వాపస్ ఇచ్చేద్దామను కున్నారు ప్రశిడెంటు గారు. పాలేరు వెంకన్న ఊరంతా వెతికినా గంగ కనబడక పోతే ఎవరో తోలుకు పోయి ఉంటారని తలిచి ఆ విషయం ప్రశిడెంటు గారికి చెప్పడానికి భయపడుతు ఇంటికి తిరిగొస్తున్నాడు. సందె చీకటైంది. ఊరి చెరువు గట్టు మీద వినాయక గుడి దగ్గర మైక్ లౌడు స్పీకర్లోంచి శివస్తుతి లలితా స్తోత్రం విష్ణు సహస్రనామం భక్తి పాటలు విన వస్తున్నాయి. అక్కడ గట్టు మీద ఆవు గంగ శ్రద్దగా తల పైకెత్తి లౌడ్ స్పీకర్లోంచి వస్తున్న భక్తి పాటలు వింటు నిలబడి ఉంది.
గంగని చూసి పాలేరు వెంకన్నకి ప్రాణం లేచి వచ్చింది. నీ కోసం ఊరంతా వెతుకుతూంటే ఇక్కడ భక్తి పాటలు వింటున్నావా? అని గంగని ఇంటికి తోలు కెళ్లడానికి ప్రయత్నిస్తే కదలకుండా తన్మయత్వంతో పాటలు వింటోంది. ఏమి చెయ్యడానికి వెంకన్నకి తోచడం లేదు. ఇంతట్లో అనుకోకుండా కరెంటు పోయింది. మైకులో పాటలు ఆగిపోయాయి. కొద్ది సేపు ఆగిన తర్వాత గంగ ఇంటి ముఖం పట్టింది. హమ్మయ్య అనుకుంటు గంగ వెంట ప్రశిడెంటు గారింటికి చేరుకుని విషయం ఆయనకి చెప్పి అతికష్టం మీద పాలు పితికాడు వెంకన్న. చివరకు పరిశీలనలో తేలిందేమిటంటే, ఆవు గంగ ఆధ్యాత్మిక భక్తి సంగీత ప్రియురాలని శ్లోకాలు స్తోత్రాలు ఆప్యాయంగా వింటుందని తెల్సింది. ఆవు గంగ వేదపండితుల ఇంట పుట్టినందున ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగింది. పశువుల పాక ఇంటి పెరటి గోడ నానుకుని ఉంటుంది.
పంతులి గారింట్లో వేదపారాయణం మంత్రాల ఉచ్ఛారణ విష్ణు సహస్రనామ పారాయణం లలితా స్తోత్రం శివస్తుతి విధ్యార్థులు ఉదయం సాయంకాలం సాధన చేస్తూంటారు. పంతులు గారి భార్య మహలక్ష్మమ్మ భక్తి పాటలు , మంగళ హారతులు సాధన చేస్తు పిల్లలకు నేర్పిస్తుంది. అవి వింటూ పెరిగిన గంగ ఆ భక్తి సంగీతానికి పరవసించి ఎక్కువ పాలు చేపేది. ప్రసిడెంటు గారింటి కొచ్చినప్పట్నుంచి ఆధ్యాత్మిక వాతావరణం లేక పాలు చేపలేక పోతోంది. ఆ విషయం తెలిసి గంగ మనోల్లాసానికి మెమరీ కార్డులో ఆధ్యాత్మిక భక్తి పాటలు స్తోత్రాలు రికార్డు చేసి సెల్ ఫోన్లో ఉంచి మెడలో వేలాడదీసి ఉదయం సాయంకాలం రెండు గంటలు వినిపిస్తూంటే పారవస్యంతో వింటూ పాలు సమృద్దిగా ఇస్తోంది.
సంగీతానికి ఇంతటి మహత్తు మాధుర్యం ఉందని రుజువైంది. గోకులంలో కృష్ణుడి వేణు గానానికి పరవసించి గోవులన్నీ మెడలు ఎత్తి వినేవని పురాణాల్లో చదివాము. తల్లి చంటి పిల్లాడిని జోకొట్టి లాలి పాట పాడితే ఆదమరిచి నిద్ర పోతాడు. పాముల వాని నాగ స్వరానికి మైమరచి పడగ విప్పి తల ఆడిస్తుంది నాగుపాము. మొఘల్ చక్రవర్తి అక్బర్ కొలువులో సంగీత విధ్వాంసుడు తాన్ సేన్ తన అద్భుత సంగీత శక్తితో మేఘాల నుంచి వర్షం కురిపించాడని చరిత్ర చెబుతోంది. వైద్యరంగంలో మానసిక రోగులు దీర్ఘ కాలిక రుగ్మతలతో బాధ పడే వ్యక్తులను సంగీతంతో నయం చేయవచ్చని రుజువైంది. ప్రకృతిలో అన్ని ప్రాణుల్నీ ఆకట్టుకునే శక్తి సంగీతానికుంది.