అలెగ్జాం డర్ ! - కుంతి ఉందా నగర్ రైల్వే స్టేషన్ . సాయంత్రం 7:00 అవుతుంది .కర్నూల్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే తుంగభద్ర ఎక్స్ప్రెస్ వచ్చి ప్లా ట్ ఫారం పైన ఆగింది . ప్లాట్ ఫారం బెంచ్ పైన కూర్చుని ఉన్న అలెగ్జాండర్ లేచి వెళ్ళి, ట్రైన్ వైపు చూశాడు.
“ఇంతకు ముందు వచ్చిన పాలమూరు బండి లాగా ఇది కూడా నిండుగ ఉంది. ఇగ లోకలే చూసుకోవాలి” అనుకొని మళ్ళీ బెంచీమీద కూలబడ్డాడు. ట్రైన్ వెళ్ళిపోయింది.
ప్లాట్ ఫారం పైన జ నాలు లేరు. నిశ్శబ్దంగా ఉంది . అలెగ్జాండర్ బీడీ ముట్టించాడు. తన వైపు చూసుకున్నాడు. కోర్టు నల్లగా నలిగిపోయి ఉంది . ప్యాంట్ కింద చిరిగి ఉంది. కుడి చెప్పు రింగు తెగిపోయి ఉంది.
“మిమ్మల్ని మీరు ఒక సారి అద్దంలో చూసుకోండి. అచ్చం రైల్లో ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి సర్వం దోచుకునే వాళ్ళలాఉన్నారు. కొంచెం మంచిగా ఉండే ప్రయత్నం చేయం డి” పొద్దున్న భార్య రోజు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి .
రోజీ కేం తెలుసు నిజంగా తన వృత్తి అదేనని. రైల్వేలో గ్యాంగ్ మాన్ లాగా పని చేస్తున్నాన ని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.
నాలుగు సంవత్సరాలుగా అలాగే మోసం చేస్తున్నాడు. ఆమెను నమ్మించడానికి రోజు పొద్దున్నే ఇంటి నుండి బయలుదేరడం ఏ రాత్రో ఇంటికి చేరడం .. అక్కడికి అప్పుడప్పుడు తన గురించి సందేహ పడుతూ తనను గుచ్చి గుచ్చి అడుగుతూనే ఉంది. జీసస్ తనకు మాట కారి తనం ఇచ్చాడు . దానితో ఇంట్లో భార్యను , రైళ్ళలో ప్రయాణికులను మోసగిస్తూ వస్తున్నాడు.
ఎన్ని రోజులు ఇలా? రేపె ప్పుడైన తాను పట్టుబడి జైలు పాలైతే అమాయకురాలైన రోజీ , ముద్దుల మూట గట్టే చిన్నారి మేరీ యేమి కావాలి అనుకున్నాడు అలెగ్జాండర్ . “ప్రభువా! ఈ బలహీనుని క్షమించు నాకు దారి చూపించు” అని ప్రార్థించాడు ఆలోచనల్లో ఉండగా ఉందా నగర్ సికింద్రాబాద్ లోకల్ బండి వచ్చింది.
యుద్ధరంగంలో కాలుమోపి సుశిక్షితులైన సైనికునిలా , తననుతాను వేటకు సమాయత్తం చేసుకునే అడవి మృగంలా , కళ్ళతోటి రైలు పెట్టెలలో ఉన్న వ్యక్తులను అందులోనే పరిస్థితులను బేరీజు వేసుకుంటూ రైలు పెట్టె లోకి అడుగుపెట్టాడు . తనకు పరిచయమైన క్రీడ అయిన క్రికెట్ లో బ్యాటింగ్ చేయబోయే ముందు పిచ్ ను తనిఖీ చేసి చూసుకునే బ్యాట్స్ మ్యాన్ లా ఒక్కసారి మొత్తం రైల్లోని మూడు పెట్టెలను ఆ చివరి నుండి ఈ చివరి వరకు పరిశీలించాడు .
రైలు పెట్టెలో పెద్దగా జనాలు లేరు. పాటలు పాడుతూ బిచ్చమెత్తుకుని గుడ్డి సీతారాం ఒక మూల కూర్చుని కూనిరాగం తీస్తున్నాడు. మరొక మూల వృద్ధ దంపతులు కూర్చున్నారు. అంతా కలిపి తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. తన ఆపరేషన్ కు అనువైన వాతావరణం ఉంది అనుకున్నాడు . చాక్లెట్లు, కొబ్బరితో చేసిన స్వీట్లు , అల్లమురబ్బాలు ఉన్నాయి. చేయబోయే యుద్ధానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని తగిన ప్రణాళికతో, ముందుకు దూసుకుపోయే సైనికుడిలా ముందుకు కదిలాడు వృద్ధ దంపతుల సీటు దగ్గరికి వెళ్లి వాళ్ళ పక్కన కూర్చున్నాడు . ట్రైన్ బుద్వేల్ చేరుకుంది . అలెగ్జాండర్ దంపతులతో మాటలు కలిపాడు . ఒకవైపు వారితో మాట్లాడుతూ ముసలాయన ప్యాంటు షర్టు జేబుల ను తన ఎక్స్ రే కళ్ళతో పరిశీలిస్తూ అంచనా వేసుకోసాగాడు. ముసలమ్మ దగ్గర చేతి సంచి ఉంది బహుశా అందులో బట్టలు ఉండవచ్చు అనుకున్నాడు.
ఇంత లో బిక్షపతి “పల్లీ బఠాణీ” అంటూ వచ్చాడు. ఒక సంవత్సరం క్రితం ఇదే ట్రైన్లో తన పాచిక పారక పట్టుబడి త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పుడు బిక్షపతి చూశాడు . అందుకే బిక్షపతి అలెగ్జాండర్ ని చూడగానే అనుమానంతో కూడిన చూపు చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. అలెగ్జాండర్ అది పట్టించుకోలేదు . ముసలాయన భిక్షపతిని “చిల్లర ఉందా?” అని అడిగాడు . ‘ఎంత’ అన్నాడు. “ ఐదు వందల రూపాయలు” అన్నాడు. “లేదు” అని చెప్పి ముందుకు వెళ్ళాడు. అలెగ్జాండర్ కు సంతోషం వేసింది ఈ రోజు కనీసం 500 రూపాయలు సంపాదించవచ్చు అనుకున్నాడు . “ఏం పెద్దమ్మ ఎక్కడిదాకా ప్రయాణం” అని అడిగాడు
“సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో నా పెద్ద బిడ్డ ఉన్నదికొడుకా! రేపు నా మనుమడి పుట్టిన దినం అక్కడ పోతున్న “ అన్నది .
“ఏం పెడుతున్నవ్ అవ్వా మనవడికి? ” అడిగాడు
“మాతాన పెట్టేందుకు ఏముంటది కొడకా? నా చెవి కమ్మలు అమ్మి చిన్న చిన్న గొలుసు చేయించిన . బండి దిగినాక మోండా మార్కెట్ ల లో ఒక జత బట్టలు కొంటం “ అని అమాయకంగా బదులిచ్చింది. ముసలాయన పెద్దగా మాట్లాడలేదు. కళ్ళు మూసుకొని ఉన్నాడు.
“తాత ఏందో గమ్మున ఉన్నడు” అని అంటూనే బయట వైపు చూశాడు.
ట్రైన్ ఫలక్నామా చేరుకుంది. గుడ్డి సీతారామ్ మరి కొందరు ప్రయాణికులు దిగిపోయారు . ఎవరు ఎక్కలేదు. ఊపిరి పీల్చుకున్నాడు. ఇక్కడి నుండి కాచిగూడ వరకు చాలాచోట్ల ట్రైన్ ఆగుతుంది. “ఎవరు ఎక్కక పోతే బాగుండు” అనుకున్నాడు“నా చిన్న బిడ్డ శంషాబాద్లో ఉంటది. పొద్దున పాలమూరు నుండి బయలు దేరి ఆమె దగ్గరికి వచ్చినం. ఇప్పుడు పెద్ద ఇంటి పెద్ద బిడ్డ ఇంటికి బయలుదేరినం. మాయి పెద్ద పానాలు కొడుకా. ఇంత తిరుగుడు మా తోటి కాదు. కానీ తప్పదు . నేనేట్లనో కష్టపడిత గానీ మా ఆయనకు మాత్రం గీ తిరుగుడు చాత కాదు. నా జబర్దస్త్ మీదనే తిరుగుతడు. ఆయనకు బీపీ, షుగర్ కూడా అందుకే గమ్మున ఉన్నడు” అని సమాధానమిచ్చింది
“ట్రైన్ కాచిగూడ నుండి సీతాఫల్మండి చేరుకునే లోగా తన పని కానీయాలి” అనుకొన్నాడు. అలెగ్జాండర్ ఆమెతో అనేక విషయాలపై సంభాషణ కొనసాగించాడు.
ఒకవైపు ట్రైన్ “ఎక్కడ ఆగుతుంది” అని గమనిస్తూనే ఉన్నాడు. నిపుణులైన చికిత్సకుడు రోగికి ఆపరేషన్ చేయబోయే ముందు ఆపరేషన్ కి పూర్వరంగం ఎలా సిద్ధం చేసుకుంటాడో అలా చేసుకుంటున్నాడు. ట్రైన్ కాచిగూడ కి చేరుకుంది . ట్రైన్ లో మొత్తం పది మంది కూడా లేరు. దాని ముందే ఎంఎంటిఎస్ బయలుదేరుతుండడంతో , దాదాపుగా అందరూ ఆ ట్రైన్లో కి వెళ్లారు.
సికింద్రాబాద్ కు వెళ్ళాల్సిన రైళ్ళు అన్ని వెళ్ళిన తర్వాత లోకల్ బయలుదేరింది . అన్నీ తనకు అనుకూలంగా జరుగుతుండడంతో సంతోషించాడు .
“తన పథకం పూర్తి చేయాలి” అనుకున్నాడు
“బాగా అలసట గా ఉంది రెండు బిస్కెట్లు తింట” అంటూ తన బ్యాగ్ లో తన కోసం ప్రత్యేకంగా పెట్టుకున్న బిస్కెట్లు తీశాడు. అలాగే మత్తు మందు కలిపిన బిస్కెట్లు బిస్కెట్లు తీశాడు. తన బిస్కెట్లు నోట్లో పెట్టుకుంటూ, వేరే బిస్కెట్లు దంపతులకు ఆఫర్ చేస్తూ, “ పెద్దమ్మ మీరు తినండి” అని అన్నాడు ప్రేమగా. ముందుగా వారి వద్దన్నా , ఇద్దరు తలా రెండు బిస్కెట్లు తీసుకొని తిన్నారు . తిన్న రెండు నిమిషాల్లోనే మగత కమ్ముకున్నట్లయి వెనుక భాగాన్ని ఆనుకొని కళ్లుమూసుకుని స్పృహ కోల్పోయారు .
ట్రైన్ సీతాఫల్మండి లో ఆగింది ఎవరు ఎక్కలేదు . కాసేపైనాక కదిలింది . దంపతులిద్దరూ స్పృహ లేకుండా పడుకున్నారు. చుట్టుపక్కల చూశాడు. ఎవరూ లేరు. ముందు వెనుక పెట్టెలలో ఒకళ్ళిద్దరు వారి వారి ధోరణిలో వారు ఉన్నారు. అలెగ్జాండర్ వెంటనే ముసలాయన జేబులో నుండి పర్స్ తీసాడు.
జేబులో ఉన్న కట్టర్ తీసిముసలామె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కట్ చేశాడు . ట్రైన్ సికింద్రాబాద్ కన్నా ముందే ఔటర్ సిగ్నల్ ముందు ఆగింది. చికిత్స పూర్తి చేసిన వైద్యులు ఆపరేషన్ థియేటర్ నుండి బయటపడినట్లు అలెగ్జాండర్ ట్రైన్ దిగాడు. చీకటి ఆవరించి ఉన్న ట్రాక్ పక్కన ఉన్న సిమెట్రీ లోకి వెళ్లి అక్కడి నుండి తన గమ్యం వైపు వెళ్ళిపోయాడు.
అలెగ్జాండర్ ఇంటికి చేరుకున్నాడు .ఇంట్లో లైట్లు వెలగడం లేదు. తలుపు వారగా వేసి ఉంది. లోపలికి వెళ్ళాడు. బెడ్ లైట్ వెలుతురు పరుచుకుని ఉంది. రోజీ మంచం పక్కన కూర్చుని మంచం పైన తల వాల్చి నిద్రపోతుంది. మంచం పై తన చిన్నారి పాప పడుకొని ఉంది . కాలి మడమ దగ్గర బ్యాండేజ్ వేసి ఉంది. రక్తపు చార కనబడుతుంది. రోజీ భర్తను చూసి, అతని దగ్గరికి వెళ్లి ఏడవసాగింది. ఆమెను మంచం పై కూర్చుండ బెట్టి , ఒకవైపు పాప కాలి గాయం వైపు చూస్తూ, “ ఏమిటి? ఏం జరిగింది?” అన్నట్లుగా చూశాడు.
“మీ పాపం దగ్గర పడింది. దేవుడు మనం శిక్షించారు. యే చిన్నారి గొంతు నులిమి పాపకు కాళ్ళ పట్టీలు తెచ్చారో నాకైతే తెలియదు కానీ ఆ పట్టీలే ఈరోజు నా పాప ప్రాణాలమీదికి తీసుకువచ్చాయి”అంటూ ఏడవ సాగింది.
అతడు అర్థం కానట్లు చూసాడు.
“ఈ రోజు ఆదివారం కావడంతో సాయంత్రం పూట కాలనీ పార్కు లో ఆడుకుంటానంటే పంపినాను. చీకటి పడుతుండగా, దానితో వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చారు. కానీ పాప రాలేదు. నేను పార్కుకు వెళ్ళి చూశాను. పాప స్పృహతప్పి పడిపోయింది. చెవి కమ్మలు కాళ్లకు పట్టీలు లేవు . చేతిలో ఏవో చాక్లెట్లు ఉన్నాయి. చెవి కమ్మలు కాళ్ళ పట్టీల కోసం ఎవడో నీచుడు మన పాపకు ఏదో తినిపించాడు .
పాప స్పృహ తప్పి పడిపోయిన తరువాత దోచుకున్నాడు . కాలి పట్టీ రానట్లుంది . కత్తితోనో ,దేనితోనో కోసినట్లున్నాడు. కాలికి గాయమైంది . నేను వెంటనే పాపను హాస్పిటల్కు తీసుకు వెళ్ళాను. ఫస్ట్ ఎయిడ్, ఇంజక్షన్ చేయించుకుని వచ్చాను . ప్రభు దయ వల్ల పాప త్వరగా స్పృహ లోకి వచ్చింది. జరిగింది తనకు తెలిసినంత వరకు చెప్పింది. దానితో అక్కడేమి జరిగిందో అర్ధంచేసుకున్నాను” అంటూ ఏడవసాగింది.
అలెగ్జాండర్ కు ఆ మాటలు వింటుంటే పెద్ద పెద్ద ఇనుప రాడ్ తీసుకొని ముఖం మీద కొడుతున్నట్లు అనిపించింది. లోయలోకి జారిపోతున్న ట్లు అనిపించింది. వెళ్లి మంచం మీద కూర్చుని ఆప్యాయంగా పాపను తాకబో యాడు రోజీ ఈ రోజు ఒక్క ఉదుటన లేచి, “మీ పాపపు చేతులతో పాపను తాక కండి . మీరు చేసిన మోసాలు,పాపాల వల్లనే మనం ఇలా ఉన్నాం. ప్రభువు ఇంకా మన పట్ల ఉన్నాడు. లేకుంటే ఈరోజు మన పాప మనకు దక్కక పోయేది” అని గట్టిగా అరిచింది అతడు అలాగే వెనక్కు జరిగాడు.
తన పాపాలు తన భార్యకు తెలిసి పోయినట్లు ఉన్నాయి అని తెలిసి సిగ్గుతో తలవంచుకున్నాడు. నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. “మీరు ఏమీ చెప్పకండి. మీరు ఉద్యోగం చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశారు. బిస్కెట్లు చాక్లెట్లలో మత్తు మందు కలిపి దారి దోపిడీ చేస్తున్నారు. మీరు చేసే నీచమైన పనులు నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. పల్లీ బఠాణీలు అమ్మే భిక్షపతి ,సమోసాలు అమ్మే సత్తి మీ గురించి నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ అంతట మీరు బాగుపడతారేమో అని ఎదురు చూస్తున్నాను ప్రభువును ప్రార్థిస్తున్నాను కానీ మీరు నర మాంసం రుచి మరిగిన పులి లాంటి వారు. మీరు మారారు. ఏదో ఒక రోజు మీ పాపాలకు బలిగా నేనూ, పాప కట్ట కొట్టు కుపోతాము. ఇది నిజం కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ప్రభువు. మిమ్మల్ని క్షమించడు” అంటూ ఊగి పోసాగిం ది
ఒక సంవత్సరం క్రితం పాప పుట్టిన రోజుకు ఏమైనా పెట్టాలని ఆలోచించి, అదే రోజు పట్టపగలే సెయింట్ ఆన్స్ స్కూల్ అమ్మాయి ని దొరక బుచ్చుకొని, నోట్లో గుడ్డలు కుక్కి, సికింద్రాబాద్ కోర్ట్ వెనుకభాగం వైపుకు బలవంతంగా లాక్కొని వెళ్ళి , కాలి పట్టాలు, చెవిలో కమ్మలు లాక్కున్న సంగతి .............పట్టాలు ఒక మానాన ఊ డి రాకపోతే కట్టర్ తో పట్టాలు కట్ చేయ బోతుండగా, ఆపిల్ల కాలికి తీవ్ర గాయం కావడం................. అంతా అలెగ్జాండర్ కు గుర్తుకు రా సాగింది తాను యే అపకారం ఇతరులకు తలపెట్టాదో, ఆ అప కారమే తన పాప కాలి గాయం రూపంలో కనిపించసాగింది. గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు రాగా ఒక్కసారిగా మనసులో పశ్చాత్తాపం కలుగగా, “ ప్రభువా! నన్ను క్షమించు” అంటూ నేల మీద కూర్చుని ఏడవ సాగాడు.
అలెగ్జాండర్ ప్రవర్తన గురించి, అతని వ్యాపకాల గురించి, ఆ నోటా ఈ నోటా ముఖ్యంగా వాళ్ళ బస్తీ లోనే ఉంటున్న, రైళ్లలో పల్లీ బఠాణీ లు అమ్మే బిక్షపతి ద్వారా తెలుసుకున్న రోజీ , ఎలాగైనా అతనిలో మార్పు తీసుకురావాలని, తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నది.
ఆ రోజు రోజీ కూతురు మేరీ పార్కులో ఆడుకుంటూ దగ్గర్లో ఉన్న ఇనుప కంచె పై పడడం, కాలికి గాయం కావడంతో వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి పట్టీ కట్టించడం చకచకా చేసింది . ఆ క్షణమే రోజీకి ఫ్లాష్ లాగా ఒక ఆలోచన తట్టింది . పాప చెవి కమ్మలు,పట్టీలు దాచి పెట్టింది ఆ తర్వాత మేరీతో, “నీ కాలికి గాయం ఎలా తగిలింది? అని ఎవరైనా అడిగితే , ‘ఒక అంకుల్ నాకు చాక్లెట్లు ఇచ్చాడు అవి తిన్నాక నాకు ఏమైందో తెలియదు ఆ తర్వాత చూస్తే నా కాలికి కట్టు కట్టి ఉంది’ అని చెప్పు . అలాగే మీ నాన్న వచ్చి నీతో మాట్లాడపోతే మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిద్దుర పో అని చెప్పింది.
తన తల్లి ప్రతి పనికి నాటకీయతను ,వనోదాన్ని జోడించి తనకు ఆనందం కల్పించడం మేరికి తెలిసిన విషయం. ఇది అలాంటిది ఏదో అనుకున్నది. పైగా స్కూల్ లో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసే మేరీ వెంటనే తన పాత్రను అర్థం చేసుకున్నది. పాప అద్భుతంగా తల్లి చెప్పినట్లుగా చేసింది. నేల మీద కూర్చుని ఏడుస్తున్న తన భర్తని గమనించింది. అతడి కళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుంది. తన పథకం పారినందుకు సంతోషించింది. వెళ్లి భర్తను దగ్గరకు తీసుకుంది అతడు ఇంకా కుములు తున్నాడు. కమ్మీ వేడిగా వంచ వచ్చు అనుకుంది . “ప్రభువు దయామయుడు! మన పట్ల ప్రేమతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన పాప చిన్న ప్రమాదంతో బయటపడింది. పొద్దున చర్చి ఫాదర్ కనబడ్డాడు. నాకు యేదైనా పని ఇప్పించమని అడిగాను. చర్చ్ లో పని చేయడానికి ఒక మగ వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు గా చెప్పాడు. నేను నీ గురించి చెప్పాను. అతడు ఒక్కసారి నిన్ను రమ్మన్నాడు. ఇప్పటికైనా ఆ పాపపు పనులు మానుకొని మంచి జీవితం గడపాలనుకుంటే నేను చెప్పింది చేయి. లేకుంటే నేను పాపను తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను” అన్నది.
అతడు ఆమెవైపు తల ఎత్తి చూడబోయి, మళ్ళీ తలదించుకున్నాడు.అతడికి వెంటనే , “మా పిల్లల హాస్టల్ లో టాయిలెట్లు కడిగే పని కొరకు మనిషిని చూస్తున్నాము. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పంపించు. నెలకు మూడు వేలు ఇస్తాను” అన్న చిన్ననాటి మిత్రుడు అయినా హాస్టల్ వార్డెన్ దేవదాసు మాటలు గుర్తుకు వచ్చాయి. “ముందు పిల్లల మలమూత్రాలు పరిశుభ్రం చేసి, నేను చేసిన పాపాలు కడుక్కుం టాను . ఆ తర్వాత చర్చ్ లోకి అడుగుపెడతా”నని అనుకున్నాడు. అదే మాట రోజీతో చెప్పాడు ప్రపంచం గెలవాలనుకునే వాళ్లే కాదు అలెగ్జాండర్ లు. జీవితంలో గెలవాలి అనుకునే వాళ్ళు కూడా అలెగ్జాండర్ లే అనుకుంది మనసులో. జీసస్ ఫోటో వైపు క్రతజ్ఞత పూర్వకంగా చూసింది రోజీ. తనలో వచ్చిన మార్పును ఆహ్వానిసున్న ట్టుగా దూరంగా చర్చిలలో గంటలు వినబడుతుంటే అటువైపు అడుగులు వేశాడు అలెగ్జాండర్