శృతి మించిన ప్రేమ నల్లమల అటవీ ప్రాంతంలో ఓ గువ్వల జంట ఉండేది. వాటికి లేక లేక రెండు పిల్లలు పుట్టాయి. వాటిని అల్లారు ముద్దుగా పెంచసాగాయి. ఆ పక్షి పిల్లలు ఆడిందే ఆట పాడిందే పాట. అంత గారభంగా పెంచుతున్నాయి. అవి రోజురోజుకు పెరుగుతున్నాయి.
తల్లి పక్షి వాటి దగ్గర కావలి ఉంటే తండ్రి పక్షి వేటకు వెళ్లి ఆహారం తెచ్చేది. తండ్రి పక్షి పిల్లల వద్దవుంటే తల్లి పక్షి వేటకు వెళ్ళేది. ఇలా ఇవి రెండూ పిల్లలను కదలనివ్వకుండా ఆహారం తెచ్చి నోటికి అందిచేవి. పిల్లలు మాత్రం కడుపులో నీళ్లు కదలకుండా తల్లిదండ్రులు తెచ్చేవి తింటూ దుక్కాల్లా బలిసాయి. వాటికి రెక్కలు వచ్చాయి. గూటిలో నుండి బయటకు వచ్చి అటూ ఇటూ తిరుగుతూ తమ ఆహారం తామే సంపాదించుకునే ప్రాయం వచ్చింది.
అయినా అవి కాలు బయట పెట్టకుండా అమ్మానాన్న తెచ్చినవే తింటూ కాలక్షేపం చేస్తున్నాయి. తల్లిదండ్రులు ఎంత చెప్పినా అవి వినటంలేదు. దీనితో వారిలో ఆందోళన మొదలయింది. ఇక కఠినమైన చర్యలు తీసుకోకపోతే పిల్లలు సోమరులైపోతారని, మనసును కఠినం చేసుకుని వాటిని గూటిలోనుంచి బయటకు నెట్టాయి. అయినా అవి అక్కడే ఉంటున్నాయి తప్ప వేటకు వెళ్ళటం లేదు. ఎంత కొట్టినా, తిట్టినా అవి కొంచమైన కదలటంలేదు. కనీసం రెక్కలు టపటప అని కూడా కొట్టి ముందుకు కదలటం లేదు.
తల్లి తండ్రి పక్షులు కొంగ వైద్యుడు వద్దకు వెళ్లి విషయమంతా చెప్పాయి. కొంగ వైద్యం చేయటంతో పాటు మంచిమంచి సలహాలు ఇస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. "మీరు గారాభంగా పెంచటం వల్లనే వాళ్ళు అలా తయారయ్యారు. ఆహారం తెచ్చి నోటికి అందిస్తుంటే అవి ఎందుకు బయటకు వెళతాయి. మీరు తెచ్చినవి చక్కగా తింటూ దుక్కల్లా బలిసాయి. వళ్ళు పెరగటంతో బద్ధకం వచ్చింది. మొక్కగా వంచినప్పుడే కొమ్మలు వంగుతాయి.
మానైన తరువాత వంచటం సాధ్యమా? మీ ప్రేమే మీ పిల్లలకు శాపంగా మారింది. శృతి మించిన ప్రేమ వొద్దేవొద్దు. అతి గారభం అనర్దదాయకం. పిల్లలు చెడిపోవటానికి తల్లిదండ్రులే కారణం. ఎప్పుడు వారిపై ఒక కన్నేసి ఉంచాలి. లోపల ప్రేమ ఉంచుకుంటు పైన కటువుగా వ్యవహరించాలి. అప్పుడే వారు, వారి విలువ గుర్తిస్తారు. సమాజానికి పనికొచ్చే పౌరులుగా మారతారు. ఇప్పటికైనా మించింది లేదు. కఠినాతి కఠినంగా వ్యవహరించండి. వీలైతే మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి. ఆకలికి తట్టుకోలేక చచ్చినట్టు అవి బయటకు వెళ్లి ఆహారం సంపాయించుకుంటాయి.
ఇదొక్కటే మార్గం. మీరు ఇక్కడే ఉంటే మాత్రం మీ పిల్లలు దేనికి పనికిరాని వారుగా మారతారు. త్వరగా నిర్ణయం తీసుకొండి" అని చెప్పింది కొంగ. పెద్ద పక్షులు వైద్యుడు చెప్పినట్టే చేశాయి. పిల్ల పక్షులకు చెప్పకుండా కాశీ యాత్రకు వెళ్ళాయి. చేసేదిలేక పిల్ల పక్షులు ఆహారం వెదుకోవటానికి అలవాటు పడ్డాయి. వాటి పొట్ట అవి నింపుకుంటున్నాయి. రెండు నెలల తరువాత పెద్ద పక్షులు తిరిగి వచ్చాయి. పిల్లల్లో వచ్చిన మార్పుకు అవి ఎంతో సంతోషించాయి.