ఒంటరిశవం - శింగరాజు శ్రీనివాసరావు

ontari shavam

ఎటునుంచి వచ్చి కాటేసిందో తెలియదు. మూడు నెలలుగా నా జోలికి రాకుంటే, ఇక రాదని సంతోషపడ్డాను. అటువంటిది నాలుగు రోజుల కిందట ఒళ్ళు వెచ్చబడింది. మామూలు జ్వరమనుకుని పారాసిటమాల్ మాత్రలు మింగాను. కానీ తగ్గలేదు. డాక్టరును కలిస్తే ఏ బాంబు పేలుస్తాడోనని జడిసి వెళ్ళలేదు.

జ్వరం వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళను దూరం పెట్టాను. అయనా ఎవరున్నారు. నేను, నా భార్య అంతే. పిల్లలంటారా.. ఉన్నారు, అమెరికాలో. వాళ్ళ గోల వాళ్ళది. అక్కడా ఇంతే. బయట మొహం చూసి నాలుగు నెలలు దాటిందట. ఇక్కడే నయం కనీసం పాలకు, కూరలకన్నా బయటకు పోతున్నాను. వాళ్ళకంతా డోర్ డెలివరీనే. ఉద్యోగాలన్నీ ఇంటిపట్టునే. తప్పదుగా. పోయి పోయి రోట్లో తల పెట్టలేము కదా. వయసు మీద పడడం వలననో, ఏదో అర్థం గాని పిచ్చి పిచ్చి ఆలోచనల వల్లనో కానీ, ఇంతకు ముందంత శక్తి నాలో లేకుండా పోయింది.

అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాను. అయినా రావలసిన ఉపద్రవం రానే వచ్చింది. నాలుక రుచిని కోల్పోయేసరికి పరీక్ష చేయించాల్సి వచ్చింది. అప్పుడు బయటపడింది కోవిడ్ పాజిటివ్ సోకిందన్న అసలు నిజం. ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాలు ఖాళీ లేవని, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

అక్కడైతే గదులు ఎక్కువ లేవని, ఒక గదిలో కనీసం ముగ్గురినైనా ఉంచేవారు. ఇక్కడ ఆ అవకాశమే లేదు. ఒంటరి పోరు. మందులు, ఇంజక్షన్లు, ఆహారం అన్నీ వారి సరఫరానే. సెల్ కూడ తీసేశారు, వయసు పెద్దది కదా అని. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మాత్రమే మాట్లాడనిస్తున్నారు.

ముందు జాగ్రత్త చర్య పేరుతో నా శ్రీమతిని కూడ గృహబందీని చేశారు. ఉన్నదే ఇద్దరం. ఇప్పుడు ఎవరికి ఎవరమో. ఉదయం, సాయంత్రం చేసే ఫోనులో మా శ్రీమతి మాటలలో ఎక్కువ భాగం నా స్నేహితుల ప్రస్తావనే. అందరూ ఎంతో బాధపడుతున్నారట. వచ్చి చూడాలని ఉందిగాని, ఏమవుతుందోనని భయమట. పిల్లలు బాధపడుతున్నారని మరికొంతసేపు. అంతా సానుభూతి పవనాలే తప్ప, కంటిచూపుకు ఎవరూ అందడం లేదు.

నాకే నవ్వు వచ్చింది నాపరిస్థితికి. పదిమందితో మంచిగా ఉంటే, మన అవసాన దశలో వారు తోడుగా నిలుస్తారని పెద్దలు చెబుతుంటే, అందరితోటి సన్నిహితంగా మెలుగుతూ, చేతనయిన సాయంచేస్తూ గడిపాను. పనిపిల్లలకు సైతం ఇతోదిక సాయం చేసేవాడిని. అందరూ నాది మంచి మనసని తెగ మెచ్చుకునేవారు. నలుగురి మనిషిగా మెలుగుతున్నానని తెగ సంబరపడి పోయేవాడిని. నాకు అండగా పదిమందైనా వస్తారని ఎంతో ఆశతో ఉండేవాడిని. అంతా తలక్రిందులయింది.

వైరస్ సోకిందని తెలిసి అంతా ఎక్కడికక్కడ సర్ధుకున్నారు. కంటితుడుపు మాటలు తప్ప, ఇంకేమీ మిగలలేదు. రోజులో రెండు సార్లు వచ్చి నాలుగు ఇంజక్షన్లు పొడిచి, అంత ముద్ద పారేసి పోయేవారే తప్ప, అంతా ఒంటరి జీవనం. ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా నా వల్ల కావటం లేదు. అలాగే రోజులు దొర్లిపోతున్నాయి. ఈ శిక్ష ఎంతకాలమో అర్థం కావటం లేదు.

*****

పది రోజులు గడిచాయి. జ్వరం తగ్గుముఖం పట్టింది. అక్కడ నా భార్యకు ఏ లక్షణాలు కనిపించలేదు. మరల పరీక్షకు పంపారట. ఈసారి నెగటివ్ రావచ్చనుకుంటున్నారు. కానీ నాకు జ్వరం తగ్గినప్పటికీ ఆయాసం తగ్గలేదు. రాత్రి నుంచి మరీ ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ కూడ అందడం కష్టమనిపించింది. బయట నిలబడ్డ పెద్ద డాక్టర్, కోవిడ్ ఇన్ ఛార్జి డాక్టరుతో చెబుతున్నారు. " ఈ నరసింహం కేసు కొంచెం సీరియస్ అయేటట్టే ఉంది. వెంటిలేటర్ ను ఏర్పాటుచేయండి. ఇతని ఇన్స్యూరెన్స్ పరిమితిని దాటి ఖర్చు అయేటట్లుంది. ఒకసారి వాళ్ళ ఇంటికి ఫోను చేసి విషయం చెప్పండి. బ్రతకడం కొంచెం కష్టం కనుక, మరీ ఎక్కువ ఖర్చు కాకుండా చూడండి. మనిషి పోయిన తరువాత డబ్బు కట్టమంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది.

ఆలోచించి నిర్ణయం తీసుకోండి" అని చెప్పి వెళ్ళిపోయారు. నేను నిద్రపోతున్నాననుకుని పెద్దగా చెప్పినట్లున్నాడు డాక్టర్. ఆయన చెప్పినట్లుగానే వెంటిలేటర్ పెట్టారు. అయినా ఊపిరి అందడం గగనంగా మారుతున్నది. నా పరిస్థితి నాకు అర్థమయింది. ఇంటికి ఫోను చేశారో లేదో తెలియదు. క్రమక్రమంగా నా శరీరం నా వశం తప్పుతున్నది. గుండె కొట్టుకోవడం మందగించింది. నాకిక చివరి క్షణాలు దగ్గరపడ్డాయనిపించింది. నాకు తెలియకుండానే నన్ను దుఃఖం ఆవహించింది. నా చుట్టూ మనుషులుంటారనీ, నేను ఒంటరివాడను కాననీ, ఎంతో ఆశపడ్డాను. అయిపోయింది, అంతా అయిపోయింది. " ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం" అన్న పాట గుర్తుకు వచ్చింది.

పెద్దగా ఏడవాలనిపించింది. కానీ స్వరం పెగలలేదు. ఏదో పెద్ద బండ గుండెల మీద పెట్టినట్లనిపించింది. కనీసం ఈ చివరిక్షణాలలో నా సగభాగమైనా దగ్గర ఉంటుందనుకున్నాను. ఆ అదృష్టమూ లేకుండా పోయింది. ఆలోచనలన్నీ ఒక్కసారి స్తంభించిపోయాయి. ఏదో గాలి నా శరీరం నుంచి వెళ్ళిపోయినట్లనిపించింది. ఒక్క క్షణం నిశ్శబ్దం.

****

ఇప్పుడు నా శరీరంలో నేను లేను. నిరాకారంగా తిరుగుతున్నాను. నాకు అన్నీ కనిపిస్తున్నాయి. మాట మాత్రం రావటం లేదు. వేరే పేషెంట్ వచ్చాడని నా శరీరాన్ని.. కాదు.. నా శవాన్ని వరండాలో పారేశారు. అక్కడికి ఇందాకటి పెద్ద డాక్టర్ వచ్చారు.

" వీళ్ళ వాళ్ళకు ఫోను చేశారా" అక్కడ ఉన్న కాంపౌండరును అడిగాడు. " చేశాము సర్. వీళ్ళావిడ శాంపిల్ ను పరీక్షకు పంపాము. ఫలితాలు రావాలంటే మరో వారం పట్టవచ్చు. ఈలోపుగా ఆమె బయటకు రాకూడదు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు రావడానికి విమానాలు లేవు. ఇక బంధువులు, స్నేహితులు ఉన్నా ఎవరు ముందుకు వస్తారో చెప్పలేం"

" సరే. రేపు ఉదయం వరకు శవాన్ని మార్చురీలో ఉంచండి. ఎవరూ రాకపోతే తీసుకెళ్ళి ఊరి చివర పడేసి రమ్మని వ్యాను డ్రైవరుకు చెప్పండి." అని వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, బాంధవ్యాన్ని పెంచుకున్న వాళ్ళు, స్నేహితులు ఒక్కరూ ముందుకు రాలేదు. కాదు ఈ మాయదారి కరోనా రానివ్వలేదు. అయినా నేనందరినీ ఎంతగానో ప్రేమించానే, నా స్వలాభాన్ని మరచి అందరికీ సహాయం చేశానే, మరి ఒక్కరికీ నా మీద దయ కలుగలేదా.. ఎవరి ప్రాణం వారికి తీపి అయిపోయిందా. చివరకు భార్యకు కూడ. శరీరం లేని మనసు ఒక్కసారిగా మూలిగింది. అవును. నిజమే. ఎవరి ప్రాణం వారికి ఎక్కువ. ఒకవేళ వాళ్ళ స్థానంలో నేనున్నా అంతే చేస్తానేమో. పిడికిలి బిగించి భూమి మీదకు వస్తాము, ఏదో సాధిద్దామని. పిడికిలి తెరుచుకుని మరణిస్తాము, ఏదీ సాధించలేదని. చావు, పుట్టుకల మధ్య అనుబంధాల ముడులతో పెనవేసుకున్న సన్నని దారమే జీవితం. తలచుకోగానే నవ్వు వచ్చింది నాకు. రేపటికి నా గతి ఏమిటి? అయినా ఏమయితే ఏమిటి? నేలతో నా ఋణం తీరిపోయింది.

ఎవరు తగలబెడితే నాకెందుకు. నాకు అర్థమయింది, నేను అనాథ ప్రేతమేనని. మాయ తొలగిపోయింది. ఆకాశం నుంచి మెరుపులు దిగి వస్తున్నాయి, నా కోసమే కాబోలు. బ్రతికినంత కాలం ఎంత తాపత్రయపడినా, ఎంత మందిని పోగేసినా, విధివ్రాత ముందు అన్నీ దిగదుడుపేనని తెలుసుకున్నాను. చివరిసారిగా నా ఒంటరిశవాన్ని తనివితీరా చూసుకుని, ఆకాశంలోకి ఎగిరిపోయాను, మెరుపులకు అభిముఖంగా.

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు