సముద్ర దేవత -బొందల నాగేశ్వరరావు సముద్రపు ఒడ్డున కాపురముంటున్న నరసయ్య, రామయ్య ,పేరయ్యనే ముగ్గురు స్నేహితులు ఓ ఆసామి వద్ద డబ్బులు అప్పు తెచ్చుకొని ఓ బోటును కొన్నారు.ఆ బోటులో ప్రతి రోజూ సముద్రములో చేపల వేటకు వెళ్ళి దొరికినన్ని పట్టుకొని, పంచుకొని వాటిని బజారులో అమ్ముకొని ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకొని వండుకు తింటూ జీవనాన్ని గడుపు తున్నారు. ముగ్గురిలో శేషయ్య కాస్త తేడా మనిషి. స్వార్థపరుడు,అంతా తనకే దక్కాలనుకొనేవాడు.
సందర్భం దొరికితే దేవుణ్ణి సైతం మోసం చేయగల యుక్తిపరుడు. అతను నరసయ్య, రామయ్యల అమాయకత్వాన్ని, మెతకతనాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని సొమ్ము చేసుకోవాలని ఓ పథకం పన్నాడు.అందులో భాగంగా వేటకు వెళ్ళిన ప్రతిరోజు తన మోసపూ రితమైన చర్యలతో ఎక్కువ చేపలను తీసుకొని అమ్ముకొంటూ డబ్బును వెనకేసుకోసాగాడు. అతను చేస్తున్న మోసాన్ని పసిగట్టిన నరసయ్య,రామయ్య'పోనీ పాపం...స్నేహితుడేలే'అని వూరకుండి పోయారు. కొన్నాళ్ళకు వాళ్ళు చేపలవేటకు వెళ్ళే చోట చేపలు తగ్గిపోయాయి.అందుకు తగ్గట్టు ప్రభుత్వం కూడా చేపల వృద్దికోసం ఆరుమాసాలు ఎవ్వరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళ కూడదని ఆంక్షలు విధించింది.అందువల్ల నరసయ్య,రామయ్యలకు పూట గడవటం కష్టమైయ్యింది.కానీ మొదటే నాలుగు డబ్బుల్ని వెనకేసుకొన్న శేషయ్య మాత్రం భార్యా పిల్లలతో హాయిగా, సంతోషంగా వున్నాడు.
ఆది గుర్తించిన నరసయ్య, రామయ్య వాళ్ళ కష్టాలను మిత్రుడు శేషయ్యతో చెప్పుకొని ఆర్థిక సహాయం కోరారు. శేషయ్య"సరే!మీరు నాకు మిత్రులు కనుక చెరో పది వేలు సహాయం చేస్తాను.కానీ ఆ డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు వడ్డీ రూపంతో కొంత మొత్తాన్నికూడా ఇవ్వాలి.అందుకు సమ్మతమైతే డబ్బు తీసుకొండి"అన్నాడు. ఎటూ చేపల వేటకు వెళ్ళటానికి ఆరునెల్లు పడుతోంది కనుక ఇల్లు గడవటానికి శేషయ్య చెప్పిన షరతులకు ఒప్పుకొని చెరో పదివేలు అప్పు తీసుకున్నారు. ఈ తతంగాన్నంతా గమనించిన సముద్ర దేవత శేషయ్య చేస్తున్న మోసం,అన్యాయాలకు అతనికో గుణపాఠం నేర్పి నరసయ్య,రామయ్య లను కూడా అతనితో సమానంగా వుండేలా చేయాలనుకొంది. ఆరు నెలల తరువాత ముగ్గురు చేపల వేటకు వెళ్ళారు.దురదృష్టంకొద్ది వాళ్ళువూహించి నంతగా వల్లో చేపలు పడలేదు.అప్పుడు నరసయ్య,రామయ్య దిగులుపడగా శేషయ్య మాత్రం సంతోషంగానే వున్నాడు.
అది గమనించిన సముద్ర దేవత ఒక్క మెరుపుతో ప్రత్యక్షమై"భయ పడకండి.మీ కష్టాలను తీర్చటానికే నేనొచ్చాను. నరసయ్యా!నీకేం కావాలో కోరుకో"అంది. నరసయ్యఆశ్చర్యానికి గురై సముద్ర దేవతకు దణ్ణం పెడుతూ"అమ్మా!నాకు ఈ చేపల వ్యాపా రంలో వచ్చే సంపాదనతో భార్య పిల్లలను పోషించుకోవటం కష్టంగా వుంది.తమరు దయుంచి డబ్బుసహాయం చేయగలిగితే పట్టణంలోబట్టల వ్యాపారంచేసుకొని బ్రతుకుతాను"అన్నాడు.
"అలాగే!ఈ మూటలో లక్ష రూపాయలున్నాయి.బట్టలవ్యాపారం చేసుకొని బ్రతుకు"అంటూ డబ్బులున్న సంచిని చేతికిచ్చి రామయ్య వేపు తిరిగి"రామయ్యా! నీకేం కావాలో కోరుకో" అని అడిగింది. "అమ్మా! నేనూ భార్య పిల్లలతో పస్తులు లేకుండా వుండాలి.అందుకు పట్టణంలో ఓ చిన్న తరహా అల్పాహార సెంటర్ను పెట్టుకొని బ్రతికేటట్టు ఆర్థిక సహాయం చేస్తే చాలు"అని అడిగాడు రామయ్య. "అలాగే!ఇదిగో నీకూ ఓ లక్షరూపాయలను ఇస్తున్నాను. నువ్వుకోరుకున్నట్టు అల్పాహార హోటల్ను పెట్టుకొని బ్రతుకు"అంటూ లక్షరూపాయలున్న సంచిని చేతికిచ్చి అటు తిరిగి "శేషయ్యా!నువ్వు బాగా డబ్బున్నవాడివి.డబ్బులను వడ్డీలకిచ్చి బోలెడు సంపాయించావు.
నానుంచి నీకెలాంటి ఆర్థిక సహాయం అవసరంలేదు.కనుక ఇకపై ముగ్గురూ మీమీ పనులను చేసుకొంటూ ఎప్పటిలాగే మంచి స్నేహితులుగా మెలగండి"అంది. "అలా కుదరదమ్మా!వాళ్ళకులా నాకూ మీరు సహాయం చేయాలి!"అన్నాడు శేషయ్య. ఒక్క నిముషం ఆలోచించిన సముద్ర దేవత"సరే!నీకేం కావాలో చెప్పు?"అనిఅడిగింది. "నేను వీళ్ళిద్దరికి చెరో పదివేలు అప్పిచ్చాను.అవి వడ్డీలకు వడ్డీలై,చక్రవడ్డీలుగా మారి ఇప్పుడు చెరో ఇరవైవేలు ఇవ్వాల్సివుంది.వాటిని ఇప్పుడే ఇప్పించండి.లేకపోతే వాళ్ళు చేయబోయే వ్యాపారంలో నన్ను పెట్టుబడి పెట్టని వాటాధారునిగాచేర్చుకోమనండి.అదీ కుదరదంటే వాళ్ళిద్దరికి నువ్విచ్చిన డబ్బును తీసుకొని వాళ్ళను యధాస్థితికి వెళ్ళేలా చేసి తిరిగి అప్పుకోసం నావద్దకు వచ్చేలా చేయండి"అన్నాడు శేషయ్య,
శేషయ్య మాటల్లోని కుతంత్రాన్నిసముద్ర దేవత గుర్తించింది.' నరసయ్య,రామయ్య ఎప్పుడూ తన క్రింద వుండాలని, ఆర్ఠిక ఇబ్బందులు వస్తే తన్నే ఆశ్రయించాలని కోరుకొంటున్న శేషయ్య కుయుక్తి గమనించిన సముద్ర దేవత మళ్ళీ నరసయ్య,రామయ్య అతనివద్ద అప్పు తీసుకుని బానిసల్లా బ్రతక కూడదని శేషయ్యకూ ఒక లక్షరూపాయల సంచినిచ్చిఅదృష్యమై పోయింది.