గోపాలపట్నం ఊళ్లో బట్టలు ఉతికే చాకలి లచ్చన్న దగ్గర ఒక ముసలి గాడిద ఉంది. ఊళ్లోంచి తెచ్చిన మాసిన బట్టలు మూటలు కట్టి గాడిద వీపు మీద రెండు వైపుల సర్ది పెంపుడు కోళ్లు, చిన్న పిల్లాడిని కూర్చోబెట్టి ఊరి బయట చెరువు దగ్గరి చాకిరేవుకి తోలుకెళతాడు. చాకిరేవు వద్ద గాడిద వీపు మీదున్న మురికి బట్టల మూటల్ని , కోళ్లని దించి గాడిదను తిండి కోసం ఊరీ మీదకు వదిలేస్తాడు లచ్చన్న. దారిలో దొరికేది , బ్రాహ్మణ పెరళ్లలో అంట్లాకులు తిని కడుపు నింపుకుని సాయంత్రం చాకిరేవుకి తిరిగి వస్తే ఉతికిన బట్టల మూటలు కోళ్లు చంటోణ్ణి కూర్చోబెట్టి చాకలిపేటకు తీసుకు వస్తాడు.
పగటి సమయంలో దారిలో తిండి కోసం తిరుగేటప్పుడు జట్కా స్టాండు వద్ద జట్కాతోలే ఫకీర్ సాయిబు గుర్రం శరీరాన్ని చేత్తో రుద్దడం చూసేది. గోనె సంచిలోని పచ్చగడ్డి మేపడం కనబడేది.ఒక్కొక్కరోజు ఆప్యాయంగా గుగ్గిళ్లు తినిపిస్తాడు. నగిషీల టాప్ జట్కాబండి నడిపే టప్పుడు గుర్రానికి మెడలో మువ్వలు, కళ్లకి గంతలు కట్టి నెత్తిమీద రంగురంగుల ఈకల తురాయితో అందంగా అలకరిస్తాడు. ఇదంతా చూసిన ముసలి గాడిద ఆలోచనలో పడింది. ఇంత కాలం నుంచి రోజంతా ఈ చాకలి లచ్చన్న దగ్గిర బండచాకిరీ చేసినా ఒక్క నాడైనా ప్రేమగా పట్టెడు పచ్చగడ్డి బరికలు వేసింది లేదు.
రాత్రిళ్లు కూడా బ్రాహ్మణవీధి ఇళ్లనుంచి తెచ్చిన పాచి అన్నం, కుడితి నా ముఖాన పోస్తాడు. అలసిన నా ఒంటిని ఒక్కనాడైనా రుద్దింది లేదు. దురదేస్తే నేనే నేలమీద పడి దొర్లుతాను. ఈ చాకలి లచ్చన్న పరమ పిసినారి. ఊరి జనాల బట్టలుతికి పండగ లప్పుడు పెళ్లిళ్లప్పుడు మస్తుగా డబ్బు సంపాదిస్తున్నా నన్ను అర్దాకలితో పస్తులు పెడుతున్నాడు. ఎలాగైనా యజమాని లచ్చన్నకి తగిన గుణ పాఠం చెప్పాలనుకుంది మనసులో. సంక్రాంతి పండగ రోజులు దగ్గరైనందున ఉతికే బట్టల వత్తిడి ఎక్కువైంది లచ్చన్నకు. ఒకరోజు మురికి బట్టల మూటలతో చాకిరేవుకి వెల్తున్న గాడిద దారిలో ఒక్కసారిగా కిందపడి కళ్లు తేలేసింది. వెనక నడుస్తున్న లచ్చన్న గాబరాపడి గాడిద నడుం మీదున్న బట్టల మూటలు పక్కన పెట్టి ముంతలోని గంజి దాని నోట్లో పోసాడు. గాడిద కళ్లు తెరిచింది కాని లేచి నిలబడలేదు. లచ్చన్న గాడిదకి ఏమైందోనని భయపడ్డాడు. మురికి బట్టల మూటల్ని తను పెళ్లాం లచ్చి నెత్తి మీద పెట్టుకుని చాకిరేవు దగ్గర ఉంచి పరుగున కింద పడున్న గాడిద దగ్గరకు వచ్చారు. గాడిద అలాగే పడుంది. లచ్చన్న , పెళ్లాం లచ్చి సాయంతో మెల్లగా లేపి నిలబెట్టి నడిపించుకుని ఊళ్లోని పశువుల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పాడు.
పశువైద్యుడు గాడిద కళ్లు , నోట్లో పళ్లు, చెవులు , కడుపు పరిక్షించి దానికి వార్దక్యం వల్ల వంట్లో రక్తం తగ్గి నీరసించిందనీ, బలమైన తిండి పెట్టకపోతే బరువులు మోయలేక చచ్చిపోతుందనీ చెప్పాడు. పశువుల డాక్టరు మాటలు విన్న చాకలి లచ్చన్న గుండె గుభేల్ మంది. గాడిద లేకపోతే తనకి చాలా ఇబ్బందౌతుంది. దాన్ని ఎలాగైనా బతికించుకోవాలనుకున్నాడు. వెంటనే సంతకెళ్లి పచ్చగడ్డి మోపు కొని తెచ్చి గాడిద నోటికి అందించాడు.రాత్రప్పుడు పెళ్లాం లచ్చి చేత బియ్యం నూకల జావ వండించి గోలెంలో పోయిస్తున్నాడు.
గాడిద బాగా కోలుకునే వరకూ వీపు మీద బరువులు తగ్గించి చాకిరేవుకి తోలుకెల్తున్నాడు. దార్లో అవీ ఇవీ తింటే దాని ఆరోగ్యం పాడౌతుందని చెట్టు నీడన ఉంచి ప్రత్యేకంగా అన్నం గంజి వెంట తెచ్చి పోస్తున్నాడు లచ్చన్న. తన పాచిక పారి పిసినారి లచ్చన్న తన బాగోగులు జాగ్రత్తగా చూస్తు న్నందుకు సంతోషించింది ముసలి గాడిద.