ఆ అడవిలో అన్ని జంతువుల, పక్షుల ఐకమత్యంగా ఉండేవి. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇతర జంతువులు, పక్షులు ఆదుకునేది. ఆ జంతువులలో జింక చాలా చాలా మంచిది. ఒకరోజు ఒక వేటగాడు ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడి, ఆ అడవిలో జింకకు కనిపించాడు. ఆ జింక వేటగానికి తగిన వైద్యం చేసింది. గుర్రం జింకను హెచ్చరించింది "మానవునికి అందునా మనకు శత్రువైన వేటగానికి అస్సలు సేవ చేయవద్దు. చేస్తే మనకే ప్రమాదం." అని. "మనకు శత్రువైనా అతనికి మేలు చేస్తే అతనిలో మార్పు రావచ్చు కదా!" అన్నది జింక. ఈ జింకకు ఎంత చెప్పినా మారదు అనుకుంది గుర్రం. జింక చేసిన వైద్యంతో వేటగాడు కోలుకున్నాడు. జింక వేటగానితో ఇలా అంది. "ఓ మానవా! ఈ అడవిలో అన్ని ప్రాణులు ఐకమత్యంగా ఉంటాయి. నువ్వూ మాతో స్నేహం చేయవచ్చు. తరచూ మా అడవిలోకి స్వేచ్ఛగా రావచ్చు, పోవచ్చు." అన్నది.
వేటగాడు తరచూ ఆ అడవిలోకి వస్తూ పోతున్నాడు. జింక మాటపై ఆ అడవిలోని ప్రతి జంతువూ ఆ వేటగాణ్ణి ప్రత్యేకమైన అతిథిగా చూసుకుంటున్నాయి. రకరకాల పళ్ళతో, తేనెతో ఆ వేటగానికి విందు చేస్తున్నాయి. వేటగాడు మంచి స్నేహాన్ని, ఆరోగ్యాన్ని పొందుతున్నాడు. జింకకు వేటగాడు ప్రియమిత్రుడు అయినాడు.
" ఓ ప్రియ మిత్రమా! నా భార్యా పిల్లలు నిన్ను చూడాలని అనుకుంటున్నారు. నీకు మా ఆతిథ్యం ఇవ్వాలని ఉంది. నా వెంట ఒక్కసారి రమ్ము. ఒక వారం రోజులు నిన్ను మా ప్రత్యేకమైన అతిథిగా చూసి, సురక్షితంగా ఇక్కడే వదిలిపెడతాను." అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు జింకను పక్కకు పిలిచి చెవిలో వేటగాని మాటలు నమ్మవద్దని, ఇందులో ఏదో మోసం ఉందని అంది. కుందేలు మాటలను జింక ఖండించింది. వేటగాని వెంట జింక వెళ్తుంది.
హఠాత్తుగా రెండు గ్రద్దలు వేటగానిపై దాడి చేశాయి. వేటగానిపై పడి, వాని కళ్ళపై పొడిచాయి. అతణ్ణి గుడ్డివాణ్ణి చేశాయి. ఈ హఠాత్పరిణామానికి జింక ఉలిక్కిపడింది. గ్రద్దలపై మండిపడింది. అప్పుడు గ్రద్దలు జింకతో ఇలా అన్నాయి. "అందరి మేలు కోరే హరిణమా! ఈ వేటగాని స్వభావాన్ని కనిపెట్టడానికి రామచిలుక ఒకరోజు ఈ వేటగాణ్ణి అనుసరించి, అతని నివాసాన్ని కనిపెట్టింది. అప్పుడప్పుడు వేటగాని ఇంట్లో ఉన్న జామచెట్టుపై వాలి, వేటగాణ్ణి గమనిస్తుంది. వేటగాడు నిన్న తన భార్యతో ఇలా అన్నాడట. "అడవిలోని జంతువులన్నీ అమాయకమైనవి, తెలివి తక్కువవి. నా స్వభావం తెలిసి కూడా నన్ను గుడ్డిగా నమ్మాయి. నాకు కమ్మనైన విందు చేస్తున్నాయి. నాకు ప్రతిరోజూ పండుగ రోజే. అయితే ఆ మర్యాదలు నాకు ఏం సరిపోతాయి. అందుకే ఒక్కొక్క జంతువును నమ్మించి, ఇంటికి తీసుకు వస్తాను. కమ్మగా వాటిని తినవచ్చు. నన్ను మరీ గుడ్డిగా నమ్మిన జింక చాలా బలిష్టంగా ఉంది. దానిని రేపు నమ్మించి ఇంటికి తీసుకువస్తా. దాని మాంసాన్ని మనం తినడమే కాక తెలిసిన వాళ్ళకు అమ్ముకుందాం. మనం కొద్ది రోజుల్లోనే ఈ అడవి జీవులతో వ్యాపారం చేసి, అత్యంత ధనవంతులం అవుదాం." అని. ఇది విన్న రామచిలుక మాతో చెప్పింది." అని.
అప్పుడు కుందేలు ఇలా అంది. "ఇప్పటికైనా మేలుకుంటావా మిత్రమా! మరీ మంచితనం పనికిరాదు. మోసం చేయడం సహజ స్వభావంగా ఉన్నవారికి మనం దూరంగా ఉండాలి." అని. జింకకు కనువిప్పు కలిగింది.