ఉత్తమ శిష్యుడు రాజారావు మాస్టారు ఆవూరి హైస్కూల్ హెడ్మాస్టర్. త్వరలో రిటైర్డ్ కాబోతున్నాడు. మంచి మాస్టారుగా ఆయనకు గొప్ప పేరుంది. ఆయన దగ్గర చదినవారు చాలా మంది మంచి స్థాయిలో వున్నారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు కూడా ఉన్నారు. అయితే మాస్టారుకు మాత్రం చాలా అసంతృప్తి ఉండేది. ఒక్క శిష్యుడిని కూడా ఉత్తముడిగా తయారు చేయలేక పోయానే అనేది ఆ అసంతృప్తి. ఆ మాటే అప్పుడప్పుడు వారితో వీరితో అంటూ వుండేవాడు.
చాలు చాల్లే మాస్టారూ! మీ దగ్గర చదివిన వారంతా ఉత్తములే" అని ఉన్న వాస్తవం చెప్పేవారు వారు. అయినా మాష్టారికి సంతృప్తి కలిగేది కాదు. ఒక ఉపాధ్యాయుడిగా తాను చేయవలసింది చేయలేక పోయానే అని ఎప్పుడు మదన పడుతూ వుండేవాడు. మాస్టారి ఉద్యోగ విరమణ రోజు రానే వచ్చింది. ఈ విషయం తెలుసుకుని ఎక్కడెక్కడి నుండో ఆయన శిష్యులు వచ్చారు.
శేష జీవితం సుఖశాంతులతో ఆనందగా గడపాలని ఆకాంక్షించారు. వచ్చిన వారిలో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న వారు ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో పనిచేసే వారు ఉన్నారు. వీరంతా మాస్టారుకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి వారివారి గొప్పలు చెప్పుకున్నారు. "మీ వల్లనే మేం ఇంతటవారం అయ్యాము" అంటూ ఆయన పాదాలను తాకి దండం పెట్టుకున్నారు. అందరూ పిచ్చాపాటి ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుతున్న సమయంలో మాస్టారూ కల్పించుకుని " అబ్బాయిలు! మీ వల్ల మీకు తప్ప సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?" అని అడిగారు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీరంతా ఇంత గొప్పవారయ్యారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అవసరానికి మించి జీతాలు తీసుకుంటున్నారు. అయినా మీరు సమాజానికి చేస్తున్న మేలు ఏమిటో మీకు మీరు ఆలోచించండి" అని మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో చలమయ్య కొడుకు చలపతి వచ్చాడు. అతడు కూడా మాస్టారి శిష్యుడే. అయితే అతడినెవరు గుర్తించలేదు. డిగ్రీ పాసైన తరువాత కాన్సర్ వ్యాధితో తండ్రి చనిపోవడంతో చదువు మానేసి, తండ్రి వృత్తి వ్యవసాయం చేపట్టాడు. వృత్తినే నమ్ముకుని కష్టపడి పనిచేస్తూ ప్రకృతి సహకరించకున్న నేలతల్లిని విడిచిపెట్టకుండా వున్నాడు. దీనికి తోడు చిన్నపాటి పాడి పరిశ్రమ పెట్టుకున్నాడు. ఈ రెంటితో జీవితం నెట్టుకొస్తున్నాడు. మాస్టారూ అతడిని పరిచయం చేశాక అప్పుడు గుర్తుపట్టారు. నువ్వంట్రా అంటూ కౌగలించుకున్నారు. మళ్లీ అందరూ మాములు అయ్యారు. మాస్టారూ మళ్లీ అందరితో ఇలా అన్నాడు "నేను నలభై ఏళ్లు ఉపాధ్యాయునిగా పని చేసాను. ఒక ఉపయోగ కరమైన శిష్యుడిని తయారు చేయలేకపోయానే అనే బాధ మనసులో తొలుస్తూ ఉండేది.
ఈ చలపతిని చూశాక నాకు అబాధ తొలిగింది. సమాజానికి పనికొచ్చే ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడన్న సంతృప్తి మిగిలింది. మీరంతా మీ తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయారు. మీకు మీరే వుంటూ ఓ కొత్తలోకం సృష్టించుకుని, సమాజం బాగోగులు పట్టించుకోకుండా నెలనెలా జీతం తీసుకుంటూ హాయిగా బ్రతుకుతున్నారు. చలపతి అలా కాదు. ఉండు వూర్లోనే వుంటూ, తల్లిని తోబుట్టువులను కంటికి రెప్పలా చూసుకుంటూ, పాడి పంటలు ద్వారా ప్రజలకు అన్నం పెడుతూ. కష్టాలు కలిగినపుడు తనలోనే దాచుకుంటూ, సంతోషం కలిగినపుడు అందరితో పంచుకుంటూ ఉంటాడు.
చదువు కేవలం ఉద్యోగాలు కోసం కాదు, సమాజాన్ని బ్రతికించటం కోసం కూడా ఉపయోగ పడాలి" అని మాస్టారూ మాటలు ఆపారు. ఆయన మాటల్లో ఎంతో సత్యం ఉందని వారంతా గ్రహించారు. ఇంతలో తాను పెద్ద క్యానులో తెచ్చిన జున్ను మాష్టారి నోట్లో పెట్టి, అందరికి పంచిపెట్టాడు చలపతి. "ఏం తీసుకు రాకుండా వట్టి చేతులతో వచ్చామే" అని గుర్తించారు వారంతా.