గతమెంతో...వైభవమే! - రాము కోలా దెందుకూరు.

gatamento vaibhavame

అదో అద్భుతమైన మానవ నిర్మిత ప్రపంచం! రంగుల లోకం! రాత్రికి రాత్రి కోటీశ్వరులను రోడ్డు పైకి లాగగలదు. అతి సామాన్యుని అహో!అనుకునే స్థాయికి చేర్చనూ గలదు. హారతులు పంటించేది అదే. జీవితాలను చేజార్చుకునేలా చేసేది కూడా అదే. అదో రంగుల మాయాలోకం. వింతైన ఊహల సౌధం.. ఇప్పటికి అప్పటికి ఎంతో తేడా! అది 1978 ఉదయం పదిన్నర. శుక్రవారం. అందరం ఎదురు చూస్తున్నది .

గోడపై మారే బొమ్మ కోసమే... ప్రతి శుక్రవారం మారుస్తారని తెలుసు . అందుకే మా కోతి మూక అంతా అక్కడే చేరిపోయింది. "వస్తుందంటావా!" గుంపులో ఎవ్వడో అనుమానంగా అనేసాడు అందరం వాడి వైపు అదోలా చూసాం. మా చూపులకే శక్తి ఉంటే! పాపం వాడి సంగతి దేవుడికే తెలియాలి.

దూరంగా! మైక్ సౌండ్. "రండి బాబూ రండి! నేడే చూడండి! మీ అభిమాన టూరింగ్ టాకీస్ "రంగమహల్" వెండి తెరపై, తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఇంతవరకు కనీ వినీ ఎరుగని , పైట్లతో, ఒళ్ళు జలదరించే విన్యాసాలతో! వినసోంపైన పాటలతో! కన్నులు జిగేల్ మనిపించే లైటింగ్ లతో మీ ముందుకు వస్తున్న చిత్రం "కాలయముడు" మీ అభిమాన హీరో, ఆరడుగుల అందగాడు.. కోన సీమ కుర్రవాడు శోభన్ బాబు. అతిలోక సుందరి!చిరు ధరహాసిని పదహారణాల తెలుగు కుందనాల బొమ్మ! శ్రీదేవి.. కలసి నటించిన ఈస్ట్ మన్ కలర్ తెలుగు చిత్రం.. .

కాలయముడు". భారీఫైట్లు... మునుపెన్నడూ చూడని కుటుంబ కథా చిత్రం... . మీ అభిమాన అందాల తార శ్రీదేవి నటించిన సకుటుంబ సమేతంగా చూడ దగిన సినిమా కాలయముడు" చూపులకు చిన్నది! పాలకోవా సోగసులది! నవరసాలు పండించడంలో నటమయూరి శ్రీదేవి. ఆరడుగుల ఆజానుబాహుడు. కుర్రకారు హృదయాలను గెలుచుకున్న నీవే మన్మధుడు. శోభన్ బాబు జతగా కలిసి నటించిన,విజయా వారి కలర్ చిత్రం కారయముడు ‌ రండి బాబూ రండి.. !

కడుపుబ్బా నవ్వించే మీ హాస్య నటులు.. రేలంగి, రమా ప్రభ కలసి నటించిన ఉత్తమ హాస్య చిత్రం. రేపటి నుండి నాలుగు ఆటలతో మీ అభిమాన టూరింగ్ టాకీసు "రంగమహల్ "లో.. భారీ తారాగణం నటించిన చిత్రం.. మరియూ మీ అభిమాన నర్తకి జయమాలిని ఆటా పాటలతో మత్తెకించే చిత్రం... ! రేపటి నుండి. నాలుగు ఆటలు ప్రదర్శించబడును తప్పక చూడండి. అంటూ మైక్ తో చెప్పుకుంటూ వస్తున్న రిక్షా కనిపించడంతో పరుగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళి. రిక్షా తో పాటు మా రాగిచెట్టు వరకు పరుగెత్తుకుంటూ ,రిక్షాలో అతను అందించే కాయతాలకోసం పరుగులే ఊరులోకి రిక్షా వచ్చిందంటే మాలాంటి బడిలో చదువు కునే పిల్లలకు పండగే... రిక్షా అగి సినిమా పోస్టర్ తీసుకుని, కాస్త మైదా గొడకు రాసి అంటించే వరకు, కళ్ళు పెద్దవి చేసుకుని ఆత్రంగా చూసేవాళం.

సినిమా పోస్టర్ లో ఏవరు కనిపిస్తారో, ఎలా కనిపిస్తారో చూడాలని ఒకటే ఆశ! అంతటితో ఆగుతామా! సినిమాకు సంబందించిన కరపత్రాలు అందుకునే వరకు రిక్షా వెంట పరుగులే. అందకపోతే బతిమాలి మరీ అడిగి తీసుకుని ఇంట్లో తలుపుకు గంజితో అంటించి తెగ సంబరపడిపోయేవాళ్ళం. పోస్టర్ పైన హీరోలా.. చేతిలో బొమ్మ తుపాకితో డిషుయ్.. డిషుమ్ అంటూ, ఇంట్లో తలుపులు వేసుకుని ఒకటే పైట్లు చేసెవాళ్ళం. సినిమాను రంగమహాల్ టాకీసు లో చూడాలని ఒకటే ఆశ. మా అయ్యను ఎన్నోసార్లు అడిగినా, !

"అయ్యా! పట్నం బోయి ఒకసారి సినిమా చూద్దామే అని. అయ్య ముసిముసిగా నవ్వుతుంటే చిర్రేత్తుకొచ్చేది నాకు. సినిమా కోసం వరి కోసిన పొలంలో మిగిలిన కంకులు ఏరి నూర్చి, షావుకారి అంగట్లో అమ్మి.. పదిపైసలు. పావలా ఒక్కొకటిగా ఇంటి యెనెక కాకర పాదు మొదట్లో దాచేవాన్ని.. రోజులు గడుస్తుంటే సినిమా చూడాలని ఒకటే కోరిక పెరిగిపోతుండే, చూడు చూడూ మని స్కూలుకు దసరా సెలవులు ఇచ్చిండ్రి. ఇక చూడు!

రోజూ అయ్యను సతాయించుడే.. నా పని. అయ్య! నా గోల తట్టుకోలేక "సరే "అనేసిండు. ఇక చూడండ్రి, నా సంతోషం. నా సహహస గాండ్లకు అందరికి చెప్పినా. ! సినిమా జూడ పట్నం పోతున్నా అని. ఇక చూడుండ్రి మావాళ్ళు.. "అరే రాగానే మాకు చెప్పలరా సినిమా ఎట్టుంటదో," అని ఒకటే సతాయించుడు మొదలెట్టిండ్రు. అందరి నడుమ మధ్య లో.. సినిమాలో హీరో లెక్క..నేను. కొత్త అంగీ కోసం ఊరిలో మా దర్జీ దగ్గరకు ఎన్ని సార్లు పోయిన్నో.. "కుట్టావా నా అంగీ, నే పట్నం సినిమాకి పోవాలా..!" అంటూ గర్వంగా అంటుండేవాడిని తనకు కూడా తెలియాలి అని.. అనుకున్న రోజు రానే వచ్చింది,

పొద్దు పొద్దుగలనే లేచి కొత్త అంగీ ఏసుకు కూకున్న, అయ్య బయలుదేరుడే ఇక సురూ అనుకుంటూ... పట్నం చేరుకునే సరికి మిట్టమధ్యాహ్నం అయిపోయో. టూరింగ్ టాకీసు రోడ్డుపక్కన గోలీసోడా తాగినా, పది పైసలిచ్చి., చల్లగుంది. అయ్యనడిగి పుటో కూడా ఒకటి దిగినా! అక్కడే ఉన్న రంగురంగుల కళ్ళజోడు, ఒక టోపీ అడిగి తీసుకుని .. టాకీసు నుండి" నమో వెంకటేశా "అనే పాట మొదలయ్యే.. జనాలు కదులుతుండ్రు. ఆ పాట మొదలు "సినిమాకు టిక్కెట్లు ఇస్తున్నడని గుర్తు" అని అయ్య చెప్పిండు. టాకీసు ముందుగాలో జూడాలా..! ఎవరో పెద్ద గథ భుజాన యెట్టుకున్న బొమ్మ పెద్దగుంది. అయ్యచెప్పిండు!

మహానటుడు యస్ వీ రంగారావుగారని. " చూడగనే చేతులెత్తి దండమెట్టెలా, అంత గొప్ప గుంది మరి బొమ్మ. అయ్య! వరుసలో నిలబడి జనాలను నెట్టుకుంటూ రెండు కాయితం ముక్కలు తెచ్చిండు, కాస్త ఎర్రగుంది. టాకీసు పేరు గూడుంది. టాకీసు నుండి "శుక్లం భరధరం "పాట వస్తుంది. "పదపదా సినిమా ఇక మొదలౌద్ది అంటూ " నా చెయ్యట్టుకుని లోపలికి తీసుకుపోయిండు...

అయ్య కింద అంతా ఇసక ,ఎవరికి వారు కుప్పచేసుకుని కూచ్చుంటండ్రూ. వెనక్కి తిరిగి చూసినా. మా ఇసుకుల్లో పంతులయ్య కూకునే బల్లలెక్క కనిపించే. "అయ్యా! అక్కడ కూకుందామే "అన్నాను. "అట్టా కుదరదురా.. " "అక్కడ డబ్బులు ఉన్నోల్లు కూచుంటరు.."

"చాలా ఖరీదు పెట్టాలి అక్కడ కూడుకుని చూడాలంటే " "ఎక్కడుండి చూత్తే ఏముంది! సినిమా యేకదా" అంటున్న అయ్య మాటకు నిజమే అని తలూపినా. ఏటో అనుకుంటాం కానీ... చుస్తుంటే బలే ఇచిత్రంగుంది.. తెర గుడ్డ చుట్టూ రంగురంగుల బుడ్లు ఎలిగి ఆరిపోతుంటే ఎంతబాగుందో..

"అయ్యా! ఈల్లంతా తెర వెనకుంటారా. ! ఇప్పుడు బయటకు వచ్చి కొట్టుకుని, పాటలు పడుకుని లోపలకు పోతారా!" అడిగిన నన్ను దగ్గరకు తీసుకుంటూ, "కాదురా అయ్యా. మన యెనకాల ప్రోజిట్టర్ ఉంది ,అక్కడ రీలెట్టి తిప్పుతుంటే ఇక్కడ బొమ్మ ఆటాపాట వస్తది.." "చూడు చూడు మొదలైంది" అంటూ తెరవైపు చూపిండు అయ్య. యేటీ అర్దం కాలేదు..

ముందుగల దేవుడు బొమ్మ.. తరువాత ఇక చూడూ.. గుర్రాల పరుగులు.. తన్నుకోడాలు.. కత్తులు దూసుకోడాలు అబ్బో అబ్బో బలే రంజుగుంది ఆట. మధ్య లో కాస్త ఆపిండు, బయటకు పోయి కలర్ సోడా తాగి పావలా సెనక్కయలు. పదిపైసల బఠాణీలు కొనితెచ్చిండయ్య. అవి నవులుతూ తిరిగి తెరమీద బొమ్మ లు కదులుతుంటే, నాకు కూడా అలా ఎగిరెగి తన్నేయాలనిపించింది.. మధ్య లో ఓ పాట వచ్చింది ఇక చూసుకో. జనాలు ఈలలు. ఎగురుడు అబ్బో అబ్బో ఎంతో సందడి చేసిండ్రు, అయ్యను అడిగా" ఎవరే అయ్యా అట్టా ఎగురుతుంది." "మన ఊర్లో కొలుపులకు ఈరతాడు అట్టుకుని ఎగిరినట్టు" అంటుంటే అయ్య చెప్పిండు. ఆమేరా జ్యోతిలచ్చిమి." "ఈమె పాట లేకుండా సినిమా ఉండదు అసలు. సగం జనం ఈ పాటలకోసమే వత్తరు" అంటుంటే నిజమే అని పించింది.

"ఎం ఎగిరింది అబ్బా!" అనుకున్నా. సినిమా అయిపోయిందంటూ.. తిరిగి " నమో వెంకటేశా పాట మొదలైంది. అందరు లేసి దులుపుకుంటూ బయటకు వస్తుంటే, "అయ్యా. !పాపం దెబ్బలు అన్ని తగిలాయికదా! మళ్ళి లేచి ఎట్టా ఎగురుతారే" అంటున్న నాతల నిమిరాడు అయ్య.. వస్తూ వస్తూ పోద్దుగల తీయించుకున్న పుటో తీసుకుని ఇంటికి చేరుకున్న..... ఇంటి దగ్గర నా దోస్తులు సిద్దంగున్నరు. నే చెప్పే సినిమా ఇస్టోరి ఇనేందుకు. అప్పుడు తీయించుకున్న పుటోనే మీరు విచిత్రంగా చూసింది.అందులో ఉన్నది నేనే" నలబై సంవత్సరాల క్రితం నా సినిమా అనుభవం చెపుతుంటే కాలేజీ పిల్లలు ఎంత శ్రద్దగా వింటున్నారంటే.. సినిమాను ఆస్వాదించడం అంటే ఇలాగే కదా! అంటూ ఆశ్చర్యంగా...... గతమెంతో వైభవం కదా అనుకుంటూ..

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు