మాయా వృక్షం - యు.విజయశేఖర రెడ్డి

mayavruksham

అలకాపూరి రాజ్యం పొలిమేర దాటిన తరువాత అడవి మార్గంలో ఒక మాయా వృక్షం ఉంది.మాయ మామిడి పండ్లు ‌‌కొమ్మలకు వెళ్లాడేలా చేసి అటుగా ప్రయాణం చేసే వారికి తినమని ఆశ చూపి దగ్గరకు రాగానే తన కొమ్మలతో బంధించి చంపేస్తుంది అనే ప్రచారం ఎక్కువగా ఉండడం వల్ల అటు వైపు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు.

ఆ రాజ్యంలోని సీతానగరంలో బలవంతుడు, ధైర్యశాలి అయిన భీముడు అనేవాడు ఉన్నాడు. ఒక సారి పొరుగు రాజ్యంలో ఉన్న అతని మిత్రుడి ఆరోగ్యం బాగులేదన్న సమాచారం అందుకుని ఆ రాత్రి వేళలో దూర ప్రయాణం చేసే సమయం లేక వెన్నెల ఉన్నా, రక్షణ కోసం భీముడు దివీటిని చేత పట్టుకుని ఆ అడవి మార్గం గుండా వెళుతుండగా మాయా వృక్షం కొమ్మలకు నిగనిగ లాడుతున్న మామిడి పండ్లు కనిపించాయి.

భీముడు ఆ వృక్షానికి దూరంగా ఉన్న చెరువు వద్ద నుండీ వెళుతుండగా ఆ చెట్టు తన కొమ్మలను పెద్దవిగా చేసి భీముణ్ణి దగ్గరకు లాక్కుంది.

“ఓ మానవా! నా చెట్టు పండ్లు తినకుండా వెళుతుంటే నాకు కోపం వచ్చింది...అందుకే నిన్ను బంధించాను” అని అంది మాయావృక్షం.

భీముడు మాయా వృక్షం గురించి విన్నాడు. “ఏది ముందు ఒక పండు ఇవ్వు తిని చూసి మరిన్ని పండ్లు తింటాను” అన్నాడు ఎంతో ధైర్యంగా.

“ఇదిగో తిను” అని ఒక పండును, ఒక కొమ్మ ఇచ్చింది.

“నన్ను బంధనాల నుండీ విడిస్తే కదా తినేది” అన్నాడు.

వృక్షం కొమ్మలు కొంచెం సడలించింది. భీముడు చేతిలోని దివీటిని ఇసుకలో గుచ్చి ఆ పండును తీసుకుని కత్తితో కోస్తుండగా పొరపాటున కొమ్మకు కత్తి తగిలి కొమ్మ నుండి రక్తం కారసాగింది.

మాయా వృక్షం “అయ్యో! అంది.

ఈ వృక్షానికి కొద్ది దూరంలో ఉన్న మరో మామిడి చెట్టు “ఓ మానవా! ఆ రక్తం కారుతున్న చోట వెంటనే ఆ దివిటీతో కాల్చు అని అంది. భీముడు అలాగే దివిటీతో ఆ ప్రదేశంలో కాల్చాడు.

“చచ్చానురా... మానవా!” అంది మాయా వృక్షం.

“ఓ మానవా! ఆలస్యం చేయకుండా ఆ చెట్టు మొదట్లో కత్తితో గాట్లు పెట్టి....ఆ దివిటీతో మంటను అంటించు ఆ మాయా వృక్షం కాలిపోతుంది” అని మామిడి చెట్టు చెప్పింది.

మామిడి చెట్టుతో “నా వృక్ష రహస్యం చెప్పావు కదా? ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను” అని ఆ మాయా వృక్షం తన చెట్టు కొమ్మలు పెద్దవి చేసేలోపల భీముడు కత్తితో చెట్టు మొదట్లో గబ గబా గాట్లు పెట్టాడు..గాట్లు పెట్టిన చోట రక్తం కారసాగింది వెంటనే మంటను పెట్టి దూరంగా వెళ్ళాడు... మంటల వల్ల చెట్టు కాలిపోతూ మెల్లమెల్లగా ఒరిగి పోసాగింది... కాసేపటికి పూర్తిగా కాలిపోయింది.

“మాయా వృక్షం రహస్యం చెప్పి నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ధన్యవాదాలు” అన్నాడు భీముడు మామిడి చెట్టుతో.

“ఆ మాయా వృక్షం తన రహస్యాన్ని ఎవరికైనా చెబితే నన్ను నాశనం చేస్తానని చెప్పింది..పైగా నీకు చెప్పినట్లు చనిపోయిన వారికి చెప్పే అవకాశం రాలేదు” అంది మామిడి చెట్టు.

“వెళ్లివస్తాను” అన్నాడు భీముడు.

“క్షేమంగా వెళ్ళు” అంది మామిడి చెట్టు.

అక్కడనుండి ముందుకు కదిలాడు భీముడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు