బొమ్మలు చెప్పిన కమ్మని కథలు.
కైలాసగిరి పై సదాశివుని పాద పూజ ముగించిన పార్వతిదేవి "స్వామి ఏదైనా కథ చెప్పండి"అన్నది.
"దేవి నీకు తెలియని కథాలా! నీ వర ప్రసాదితుడు విక్రమార్కునికి ఇంద్రుని ద్వారా లభించిన మణిమయ స్వర్ణ నెమలి పింఛె ఆకృతి కలిగి ముపై రెండు మెట్లు కలిగి ప్రతి మెట్టుకు సాల భంజికాలు (బొమ్మలు) కలిగిన ఆ సింహాసనం భోజ మహా రాజు అధిష్టించే ప్రయత్నంలో మెట్టుకో బొమ్మ చెప్పిన కథలు చెపుతాను విను. భూ లోకంలో మోక్ష ప్రదాయమైనవిగా పేరు పొందిన అయోధ్య-మధుర-హరిద్వార్-కాశీ-కంచి-అవంతిక-ద్వారక అనేవి సప్త నగరాలు. అవంతికి మరో పేరు "ఉజ్జయిని" అనే రాజ్యం ఉంది.దీనికి మరి కొన్ని పేర్లు ఉన్నట్లు స్కంద పురాణంలో వివరింప బడింది. అవి కనక శృంగ-కుశ స్ధలి-పద్మావతి-కుముద్వతి-వైశాలి-ధరాపురి అనే పేర్లు ఉన్నాయి. ఈ రాజ్యాన్నిసకల గుణ సంపన్నుడు మహావీరుడు అయిన "భోజ రాజు పరిపాలిస్తుండే వాడు.ఆ రాజ్య పొలిమేరలలోని గ్రామాలపై తరచూ అడవి మృగాలు దాడి చేయడంతో అక్కడి ప్రజలు భోజ రాజుకు తమ కష్టాలు చెప్పుకున్నారు. తన పరివారంతో అడవిలోని జంతువులను వేటాడుతూ ఉండగా, అక్కడకు కొద్ది దూరంలో సజ్జ చేలో మంచెపై పక్షులను వడిసెలతో తరుముతున్నబ్రహ్మణుని చూసి నీళ్లు అడుగుదామని ఆ చేలోకి భోజుడు తన పరివారంతో వెళ్లాడు. భోజ మహారాజును,అతని పరివారాన్ని చూసిన మంచె పైన వ్యక్తి "దయ చేయండి మహారాజా ఈ సజ్జ కంకులు, ఇక్కడి చెట్ల పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి.ఆరగించండి.నా చేల్లోని దిగుడు బావి నీరు చల్లగా అమృతంలా ఉంటాయి, మీరంతా ఆకలి దాహం తీర్చుకుని ఆ చెట్ల నీడన విశ్రమించండి" అన్నాడు. అతని మాటలకు సంతోషించిన భోజ మహారాజు తన పరివారం తో ఫలాలు, సొజ్జ కంకులు ఆరగించి దాహం తీర్చుకున్నాడు. మంచ దిగి వచ్చిన ఆ వ్యక్తి "మహారాజా మీరు ఎవరి అనుమతితో నా పంట చేనులో ప్రవేసించారు.ఈ సంవత్సరం అంతా నా కుటుంబానికి జీవనాధారమైన పంటను, పండ్లను నాకు దక్కకుండా చేసారే! పాలకులైన తమరే ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి?దయచేసి మీరు మీ పరివారం నా చేనులోనుండి వెలుపలకు వెళ్లండి" అన్నాడు. "బ్రాహ్మణోత్తమా చింతించకండి మీకు జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లిస్తాను"అని భోజమహారాజు తన పరివారంతొ వెనుతిరిగాడు. ఇంతలోనే మంచె ఎక్కిన బ్రాహ్మణుడు " ప్రభువులు నాకు నష్ట పరిహారం ఇవ్వడం ఏమిటి తమ సేవ చేసుకునే అదృష్టం కలగడం నాభాగ్యం.ప్రభు వెళ్లి పోతున్నారే! ఆ చెట్ల నీడన కాసేపు విశ్రమించండి. తమ అశ్వాలకు కొంత విశ్రాంతి తో పాటు నా చేలో పచ్చిక (పచ్చిగడ్డి) మేసే అవకాశం లభిస్తుంది"అన్నాడు రెండు చేతులు జోడించి. అతని వింత ప్రవర్తన గమనించిన భోజ మహారాజు మంచె పైకి ఎక్కాడు. ఏదో దివ్యానుభూతి తనను ఆవహించడం గమనించి, ఈ స్ధలంలో ఏదో మహత్తు ఉందని గమనించి , ఆ బ్రహ్మణుడు కోరినంత ధనం చెల్లించి ఆ పంట పొలం తను స్వాధీన పరుచుకున్న భోజ మహారాజు తన పరివారాన్ని మంచ కింద ఉన్నప్రాంతాన్ని తొవ్వించాడు. స్వర్ణము పై రెండు మెట్టు కలిగి మెట్టుకో సాలభంజికం గల స్వర్ణ సింహాసనం లభించింది. దాన్ని వెలుపలకు తీయించి శాస్త్ర యుక్తం పూజలు చేయించి రాజధానికి తరలించాడు. బ్రాహ్మణోత్తములు నిర్ణయించిన ముహర్తానికి సర్వాంగా సుందరంగా అలంకరించుకుని, సుగంధ పరిమళాలతో పలు రకాల పుష్పాలతో అలంకరించిన సింహాసనం పై అధిష్టించేందుకు తొలి మెట్టుపై కాలు మోపాడు. అప్పుడు ఆ సింహాసనం లోని తొలి మెట్టుపై ఉన్న సాలభంజికం 'ఆగు మహారాజా ఆగు. నా పేరు వినో రంజిత ఈసింహాసనం ఎవరిదో తెలుసా? చంద్ర వర్ణున కుమారుడైన విక్రమార్కుడు అనే వీరాధి వీరునిది. ఈ రాజ్యాన్ని చిర కాలం పాలించిన ఘనుడు ఆయన. అష్ట సిధ్ధులు, అరవై నాలుగు కళలలో నేర్చిన పౌరుష, పరాక్రమ శాలి, రంభా ఊర్వశి నాట్య విన్యాసాలకు తీర్పుచెప్పి ఈసంహాసనం, ఇంద్రునిచే బహుమతిగా పొందిన దుర్గాదేవి వర ప్రసాది.ఆయన గుణ గణాలతో, వీరశౌర్యాలతో సాటి రాగలిగిన వాడవు అయితే ఈ సంహాసనం అధిష్టించు అంది. ఆ బొమ్మ మాటలకు ఆశ్చర్య పోయిన భోజ మహారాజు" ఓ వినోరంజిత నువ్వు చెప్పిన విక్రమార్కుడు ఎవరో నాకు తెలియదు.నువ్వు అతని గురించి చెపితే ఆ గుణ గణాలు, శౌర్య ప్రతాపాలు నాలో ఉన్నాయో లేవో తెలుసుకుంటేనే కదా తెలుస్తుంది. విక్రమార్కుని కధ నాకు తెలియ జేయి" అన్నాడు భోజుడు.