హేమంత సంధ్య. సూర్యుడు కూడా చల్లబడుతున్నాడు అది తెలిసి శీతల వాయువులు మరల పలకరింపు ఆరంభించాయి. శ్రీకాంత్ వంటిట్లో వాళ్ల అమ్మ కాల్చి ఇచ్చిన జొన్నపొత్తు చేతుల్లో ఎగరేసుకుంటు చల్లార్చుకుని గింజలు తింటూ ఆస్వాదిస్తున్నాడు. శ్రీకాంత్ చెల్లి అరవింద కూడా అమ్మ! వాడు నాకు పెట్టకుండా తింటున్నాడు నాకు కూడా ఇవ్వవా అని వంటింట్లోకి వెళ్ళింది.
అలాగే అందరికి తలో కండి ఇచ్చి శారద తను వస్తూ అత్తగారికి తన చేతిలో ఉన్న కండి సగం విరిచి కాసేపు వీటితో కాలక్షేపం చెయ్యండి అత్తయ్యగారు అని చేతిలో పెట్టింది. ఆవిడ మనవడు వంక చూసి ఎరా..! చెల్లికి నాలుగు గింజలు పెడితే ఏమౌతుంది అని అడిగారు సీతమ్మగారు.
ఆహా… నాకు మాత్రం అది పెడుతుందా అని ఇంకా దాచుకుని మరీ తింటున్నాడు. సీతమ్మగారికి నవ్వు వచ్చింది. ఈలోపు అరవింద బామ్మగారి దగ్గరకు వచ్చి మరే! బామ్మగారు.. మాకు ఒక కథ చెప్పండి జొన్నపొత్తు తింటూ వింటాం అని అడిగింది. ఏం కధ చెప్పను అని అంటూ సరే ఈ జొన్నపొత్తుల గురించే చెప్పుకుందాం అని మెల్లిగా కథలోకి వెళ్లారు. అనగనగా సింధూ దేశం.
అంటే ఇప్పుడు పంజాబ్ అన్నమాట అక్కడి భూమి లోయగా ఉండేది. చక్కటి నదీ ప్రవాహాలు ఉండేవి. భూమి ఎంతో సారవంతంగా ఉండేది. ఎక్కువ గోధుమలు, జొన్న పంట పండించేవారు. భూమి సారం చేత చక్కటి పోషక విలువలతో ఆహార ధాన్యాలు దొరికేవి. అందువల్ల అక్కడి జొన్నపొత్తులను ముత్యాలతో పోల్చేవారు. వాటిని ముత్యాల జొన్నపొత్తులు అనేవారు. అక్కడి ప్రజ మంచి దృఢ కాయులై, ఆరోగ్యంగా ఉండేవారు. ఇది ఇలా ఉండగా చోళ దేశ రాజుకు అనారోగ్యం చేసింది. అంటే దక్షిణ భారత ప్రాంతం.
రాజవైద్యులు పరీక్షలు చేస్తున్నారు. మందులు నూరుతున్నారు, కషాయాలు పోస్తున్నారు కానీ ఏమీ ప్రయోజనం లేదు. శిరోభారంతో, సతమతం అయిపోతున్నారు. లాభం లేదని అందరికంటే అనుభవజ్ఞులు తంత్రవైద్యం తెలిసిన కపిలభట్టు గారిని పిలిపించారు. ఆయన వస్తూనే ముందు పాకశాలకు వెళ్లి అక్కడ వంటలను పరీక్షించారు. అక్కడ నుండి రాజ భోజనశాలకు వెళ్లి వేడి నీరు కావాలని కబురు పంపించారు.
అక్కడ వడ్డన చేసే పాత్రలపై దృష్టి సారించారు. అన్ని ప్రదేశాలు చూసి చివరిగా అంతఃపురం చేరుకున్నారు. రాజుగారి నాడి పరీక్షించి వెంటనే పసరు తెప్పించి మందు నూరి రాజుగారిని తీస్కొమన్నారు. కాసేపటికి మగతగా నిద్రపోయారు రాజుగారు. అప్పుడు మంత్రులని పిలిపించి రాజుగారికి వచ్చిన శిరోభారం పిత్త వైపరీత్యం వల్ల వచ్చింది. అందువల్ల రాజ భోజనంలో కొన్ని మార్పులు చెయ్యాలి.
ముఖ్యంగా పీచు పదార్ధాలు ఉండేలాగా చూడాలి. పండ్ల రసాలు బాగా ఇవ్వండి. కొవ్వు చేరే వంటకాలు, మధువు, మాంసాహారం కొన్ని రోజులు మానివెయ్యండి అన్నారు. ఆ ప్రకారమే వంటలు మారాయి. ఇంక మంత్రులు చెయ్యవలసిన పని ఒకటి వుంది వెంటనే సింధు దేశం వెళ్లి ముత్యాల జొన్నపొత్తులు కొన్ని, వాటితో దంచిన పిండి తేవాలి అది ఎంత తొందరగా వీలైతే అంత మంచిది అన్నారు.
మంత్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏమైంది అని కపిలభట్టు గారు అడిగారు. ఆ దేశం వెళ్ళటం చాలా కష్టతరమైన పని మధ్య రాజ్యంలో ఆటవికులను దాటి వెళ్ళాలి. వారు నరమాంస భక్షణ చేస్తారుట అని అన్నారు. భట్టుగారికి కోపం వచ్చింది. రాజుని సంరక్షించటం మన బాధ్యత మంత్రులే ఈ మాట అంటే ఇంక సామాన్య ప్రజలు ఎం చెయ్యాలి. దండోరా వేయించండి. ఈ సాహస యాత్ర చేసి సంభారాలు తెచ్చిన వారికి తగిన పారితోషకం ఇస్తామని చెప్పండి. అని అక్కడ నుండి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి గారు ఆలోచనలో పడ్డారు. అలాగే ఆలోచిస్తూ భోజనం కూడా చేయలేదు. వారి అమ్మాయి భవానికి ఈ విషయం తెలిసి తండ్రిని చేరి కారణం తెలుసుకుంది. నేను వెళ్తాను నాన్న నన్ను పంపండి. ఈ యాత్ర ముగించి మన రాజుగారిని రాజ్యాన్ని కాపాడుకుందాం అని పలికింది. కూతురు ఉత్సాహాన్ని గ్రహించి ఒకింత భయపడినా తన సాహసానికి మెళకువలు చెప్పి ఎప్పుడు జాగరూకత పాటించమని పురుషవేషధారణ లో వెళ్ళమని చెప్పారు. భవాని కొంత సైన్య పరివారముతో వెళ్లి అక్కడి ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించి రాజ ప్రసాదాన్ని చేరి తమ రాజు యొక్క పరిస్థితిని వివరించి అక్కడి సస్య రక్షణ గురించిన వివరాలు తెలుసుకుని ఎంతో ఓర్పుతో మధ్య ఆటవీప్రాంతాన్నిదాటుకుని వారితో కూడా సత్సంబంధాలు సలిపి తిరిగి రాజ్యం చేరి వెంటనే ఆ జొన్నపొత్తులు, పిండి వంటశాలకు చేర్చింది.
రాజుగారికి ఆ రోజు నుండి భట్టుగారు చెప్పినట్లు శాఖపాకాలు తయ్యారు అయ్యి భోజనాలు వడ్డిస్తున్నారు. భట్టుగారు దగ్గరుండి వంట చేయిస్తుంటే ప్రధాన మంత్రి గారు ఇలా అడిగారు. ఈమాత్రం జొన్న పంట మనము పండించుకోలేమా అక్కడ నుండి ఎందుకీ అవస్థ?. పైగా ముత్యాల జొన్నపొత్తులు అని ఎందుకు అంటారు. అప్పుడు భట్టుగారు చూడండి మంత్రి గారు, ఏ ముడిసరుకులో సంతులమయిన పోషకాలు లభిస్తాయో వాటి వల్ల కలిగే ఆరోగ్యం సిసలైనది.
అక్కడ మట్టి చాలా సారవంతం. అందుకే ఈ జొన్నలు లేతగా ఉన్నప్పుడు ఉత్తమమైన పోషకాలను తగిన పీచు సాంద్రతను కలిగి ఉంటాయి. ఇంక పిండి అంటారా నిలువ చేసుకోవడానికి పనికి వస్తుంది. లేత గింజలు తెల్లగా సూర్యకాంతి పడి ముత్యాల వలె మెరుస్తాయి కాబట్టి వాటిల్ని అలా అంటారు అని చెప్పారు. రోజులు గడిచాయి. మెల్లిగా రాజుగారు కోలుకున్నారు. శిరోవేదన, పిత్త ప్రకోపాలు తగ్గాయి. ఆరోగ్యవంతులైయ్యారు.
రాజు గారు భట్టుగారి ద్వారా మొత్తం విషయం తెలుసుకుని వెంటనే భవాని నా సమక్షాన ప్రవేశపెట్టమని ఆదేశించారు. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చి ఆమెను యువరాజుకు వధువుగా ప్రకటించారు. ఇలా కధ సుఖాంతం. మీరు తినే ఈ కార్న్ సీడ్స్ లో ఫైబర్ అలాగే మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జొన్నరొట్టెలు అందుకే చేసుకుంటాం. మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం సమకూరుతుంది. అర్ధమైనదా పిల్లలు అని సీతమ్మగారు అంటుంటే శ్రీకాంతూ అరవిందలతో పాటుగా శారద కూడా ఎంతో శ్రద్ధగా వింటోంది.