సుబ్బారాయుడు ఒకప్పుడు ఆ ఊరి మోతుబరి రైతు,అంతేకాదు తాత ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన మునసబ్ ఉద్యోగంలో కూడా చాలా కాలం పాటు వున్నాడతడు.ఎన్ టీ రామారావు ప్రభుత్వం మునసబ్దారీ వ్యవస్థను రద్దు చేసిన తరువాత అర్హత వున్నా విలేజ్ అసిస్టెంట్ పోస్టుకి వెళ్లకుండా కొన్నాళ్ళు ఆదర్శ రైతుగా వ్యవసాయం చేసి...తరువాత గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎంపికై నిన్నమొన్నటి వరకూ ఆ పదవిలో వున్నాడు.ఎప్పుడైతే ఎన్నికల్లో తనతో పోటీకి ఒక వ్యక్తి సిద్ధమయ్యాడో అప్పుడే సుబ్బారాయుడు రాజకీయాలకు స్వస్థి చెప్పి తనతో పోటీగా నిలబడిన వ్యక్తే ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎంపికకాడానికి సహకరించి తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు.
సుబ్బారాయుడు పెద్దగా చదువుకోలేదు,వంద ఎకరాల భూమి, తర తరాలుకు తరగని ఆస్తి మనకుంది,నీకు పెద్ద చదువు లెందుకు?మునసబ్ గిరి చెయ్యడానికి సరిపడా చదువుంటే చాలు అంటూ సుబ్బారాయుడు తండ్రి వెంకట రామరాయుడు సుబ్బారాయుడుకి పెద్ద చదువులు చదివించలేదు.యాదృచ్ఛికమో...దైవ నిర్ణయంమో,జీన్స్ ప్రభావమో తెలీదుగానీ అతని వంశంలో ప్రతి తరంలోనూ ఒక్క మగ సంతానం మాత్రమే ఉండేది.కొన్ని తరాల్లో ఆడపిల్లలు పుట్టినా మగ సంతానం మాత్రం ఒకడికి ఒక్కడే అన్న విధంగా వుంటూ వస్తుంది.
సుబ్బారాయుడుకి కూడా ఒక్కడే కొడుకు అతని పేరు వెంకటరాయుడు.వెంకటరాయుడు తండ్రిలా కాకుండా పట్టుబట్టి మరీ ఇంగ్లీష్ చదువులు చదువుకున్నాడు. తండ్రి మాట కాదనలేక అగ్రికల్చర్ బియస్సీడిగ్రీ చదివినా విదేశాలకువెళ్లి అక్కడే స్థిరపడాలన్నా కోరికతో వెంకట రాయుడు తండ్రి వద్దని ఎంత వారించినా వినకుండా ఇజ్రాయెల్ దేశమెళ్లిపోయి వ్యవసాయ పరిశోధనా విద్యలో ఉన్నత చదువులు చదివి అక్కడ ఒక వ్యవసాయ పరిశోధనా సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తక్కువ జీతానికే పనిచేస్తున్నాడు."ఇంతా బ్రతుకు బ్రతికీ, ఊరికి మోతుబరి రైతు కొడుకు అనిపించుకొని, కోట్లాది రూపాయలు అస్తికి వారసుడవైన నువ్వు ఎక్కడెక్కడో తక్కువ జీతానికి పనిచెయ్యడం దేనికి మనకే బోలెడు వ్యవసాయం ఉంది,పైగా నువ్వు వ్యవసాయ విద్యలో పెద్ద చదువులు చదువుకున్నావు, ఇక్కడకే వచ్చేయ్, వ్యవసాయంలో కొత్త పోకడలు తెచ్చి మంచి పేరు తెచ్చుకో,ఊరికీ,ఈ ప్రాంతానికి,దేశానికి పనికివచ్చాడు నా కొడుకు అన్న సంతృప్తినైనా నాకు మిగుల్చు"అని సుబ్బారాయుడు ఎంతమొత్తుకున్నా వినకుండా"ఏముంది నాన్నా మీ ఇండియాలో నువ్వు కాబట్టి అంత ఆస్తి వున్నా అక్కడే బ్రతుకుతున్నావ్ అదే నేనైతే ఎప్పుడో అక్కడ ఆస్తి పాస్తులు చక్కబెట్టి,హాయిగా విదేశాల్లో వాలిపోతూ కంటికి నచ్చిన దేశంలో స్థిరపడిపోయేవాడిని...
అయినా నువ్వూ అమ్మ వున్నంత వరకే ఇండియాతో నాకు సంబందం, మీరు పోయాక నేను మన ఆస్తిని చక్కబెట్టి వచ్చిన డబ్బుతో అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను...అక్కడే జాతీయత బేధం లేకుండా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మరెప్పుడూ ఇండియా పోకుండా అక్కడే స్థిరపడిపోవాలనుకుంటున్నాను"అని వెంకటరాయుడు తరుచూ అంటుంటే సుబ్బరాయుడు గుండెల్లో గునపాం పోట్లు పొడుస్తున్నట్లు అనిపించినా ఎవ్వరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి రోదించేవాడు సుబ్బారాయుడు,
చివరికి కొడుకు నిర్వాకం భార్యకు కూడా చెప్పలేకపోయేవాడు సుబ్బారాయుడు ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు బాధ్యతారాహిత్యం తెలిసి ఆమె గుండాగి చచ్చిపోతాదని ఆతని బెంగ.
ఇలా చాలా కాలం గడిచింది.సుబ్బారాయుడుకి వయసు మీద పడుతుండటంతో మునుపటిలా వ్యవసాయం అంత చురుకుగా చెయ్యలేకపోయేవాడు. నమ్మకస్తులు అనిపించుకుంటున్న కౌలు రైతులు, గుమస్తాలు, మిల్లర్లు, అధికారులు, గుత్తేదార్లు, వ్యాపారులు, కూలీలు, చివరికి ఇంట్లో పని వాళ్లు కూడా సుబ్బారాయుడు అతి మంచితనాన్ని, దాన గుణాన్ని ఆసరాగా తీసుకొని అతన్ని మోసం చెయ్యడానికే ప్రయత్నం చేస్తుండే వారు.కొన్నాళ్ళకు వ్యవసాయం అతనికి దండగ అయ్యింది. నష్టాలు వల్ల సంవత్సరానికి రెండు మూడు ఎకరాలు భూమి అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చేది. వంశపారపర్యంగా సింహాలులా హుందాగా బ్రతికే సుబ్బారాయుడు కుటుంబం నెల వారీ ఖర్చులకి, సిబ్బంది జీతాల చెల్లింపులకి చిన్నా చితకా వడ్డీ వ్యాపారస్తులు ముందు అప్పుల కోసం నిలబడ వలసిన పరిస్థితి వచ్చింది.
బెల్లమున్నప్పుడే చీమలు చేరుతాయి అన్నట్లు తనకు ఆస్తి పాస్తులు మెరుగ్గా వున్నప్పుడు చెంతకు చేరి తృణమో పనమో పట్టుకు పోయే బంధుమిత్రులు రాయుడు చెయ్యి వెనక బడే సరికి, అతడే సంవత్సరానికి ఐదో పదో ఎకరాలు అమ్ముకొని బ్రతుకుతున్న సమయం వచ్చేసరికి ముఖం చాటెయ్యడం మొదలు పెట్టారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదని సుబ్బారాయుడు ఒక రోజు కొడుకు వెంకట రాయుడుకి ఫోన్ చేసి విపులంగా మాట్లాడి" నువ్వు వచ్చి పరిస్థితి చక్క దిద్దుకోక పోతే మన కుటుంబం పరువు ప్రతిష్టలు పోతాయి,
ముఖ్యంగా ఆస్తులు అనవసరంగా అన్యాక్రాంతం అయి పోతాయి,నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయ్" అని చిలక్కి చెప్పినట్లు చెప్పి బ్రతిమిలాడాడు. "నేను ఉన్నపలంగా రాలేను, నేను వచ్చే సరికి మరో సంవత్సరం పట్టొచ్చు, బైదా...బై మనకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి,భూమి, వాళ్ళు మునసబ్ దారీ పదవుల్లో వున్నప్పుడు అప్పనంగా సంపాదించినవే అయివుంటాయి కదా...ఎలా వచ్చాయో అలాగే పోతాయి,
పోతే పోనివ్వండి, ఇక పరువు మర్యాదలు అంటారా మీరు వున్నంత వరకూ కాస్తో..కూస్తో ఆస్తి వుంటాది,
మీరు పోయాక పరువు ఉంటే ఏమిటీ పోతే ఏమిటి.నేను ఎలాగూ అక్కడకి రాను కదా! కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి,మీ అవసాన దశలో మందులకి,తిండికి అక్కరకు వచ్చే విధంగా ఒక రెండు మూడు ఎకరాలు భూమిని ఉంచుకొని,మిగతా భూమిని,స్థిర ఆస్తుల్ని అమ్మేసి నాకు ఇచ్చేసి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటే నలుగురిలో మీ పరువు ఉంటుంది లేకుంటే అదీ ఉండదు, నాకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది మీరు ఎప్పుడు కాలం చేస్తే అప్పుడు ఉన్నకాడకి మన ఆస్తి పాస్తులు అమ్మేసి ఇక్కడో ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను,ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను "అని ఫోన్ పెట్టేసాడు వెంకటరాయుడు.
తల్లి చెబితే వింటాడేమోనని సుబ్బారాయుడు భార్యతో ఫోన్ చేయించాడు కొడుక్కి.కొడుకు తల్లికి కూడా ముక్కు సూటిగా చెప్పేసాడు,"నేను ఇండియా రాను రాను రాను నేను ఇండియా వచ్చేది కేవలం మిమ్మల్ని చివరిసారిగా చూసి ఆస్తిని,భూమిని అమ్ముకోడానికే... ఆదెప్పుడంటే మీరు చనిపోయేముందే... బైదా బై నేను ఇక్కడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మీకు చెప్పడానికి కూడా టైం లేక అలా జరిగిపోయింది...సరే ఉంటాను"అని ముక్తసరిగా మాట్లాడి ఫోన్ పెట్టేసాడు కొడుకు.కొడుకు అలా మాట్లాడం ఎప్పుడూ వినని ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఏడుస్తూ ఏడుస్తూ రాత్రంతా నిద్రలేకుండా గడిపిన ఆ తల్లి గుండె వేకువజామున భర్త ఒడిలో తాను నిద్రపోతుండగా హఠాత్తుగా ఆగిపోయింది. సుబ్బారాయుడు దిక్కులు పిక్కటిల్లేలా రోదించాడు,"విషయం కొడుక్కి చెప్పండి ఇప్పుడైనా వస్తాడేమో"అని గుమస్తాలకు చెప్పి కొడుక్కి ఫోన్ చేయించాడు.విషయం తెలుసుకొని వెంకట రాయుడు కూడా ఏడ్చాడు కానీ "నాన్న గారిని జాగ్రత్తగా చూసుకోండి నేను రెండు మూడు నెలలు తరువాత వస్తాను,అప్పుడు నాన్నను ఇజ్రాయెల్ తీసుకొని వచ్చేస్తాను,ఇప్పుడైతే రాలేను,సారీ..."అంటూ కొడుకు చెప్పాడని తెలిసి సుబ్బారాయుడు గుండె రోదించి నీళ్ళు ఇంకిపోయి బండ బారిపోయింది,కోట్లాది రూపాయల అస్తి ఉన్న అనాధ బ్రతుకు నాది అనుకుంటూ... భార్య అంత్యక్రియలు జరిపించి,కర్మఖాండలు పూర్తి అయినాక,ఒంటిరిగా ఒక గదిలోకి వెళ్ళిపోయి,ఒక మంచానికి,ఆ గదికి మాత్రమే పరిమితమైపోయి చాలా రోజులు ఒంటరిగా గడిపాడు.
ఒకరోజు రోజు లాయర్లును పిలిపించి తన బంధుమిత్రులు,సిబ్బంది,రైతులు,కూలీలు,పనివాళ్ళు సమక్షంలో తనకు ఉన్న ఆస్తిలో కొంచెం అప్పుని తీర్చగా మిగిలిన దానిలో సగం తన తదనాంతరం ధారాదత్తం అయ్యేవిధంగా అనాథ శరణాలయాలకు రాయించి, మిగతా ఆస్తిని,తనని నమ్ముకొని వ్యవసాయం చేసిన కౌలు రైతులకు, కూలీలకు, పనివారికి, సిబ్బందికి సముచిత వాటాలుగా రాయించి,కొంత భూమిని ఊర్లో భూమిలేని నిరుపేదలకు రాయించి,రాజుల కోటను తలపించే తన బంగ్లాని ప్రభుత్వనికి చెందేటట్లు రాయించి, ఒక ఎకరం భూమిని తన పాత పెంకిటిల్లు ఇల్లుని మాత్రం అమ్ముకోడానికి వీలులేని విధంగా కొడుకు పేరిట రాయించి, ఒకవేళ వాడు వస్తే వాడికి అప్పగించండి లేదా ఆ ఇంటినీ వృద్దాశ్రమం చేసి ఆ భూమినీ దానికి చెందేవిధంగా చెయ్యండి" అని చెప్పి అందరినీ వెళ్ళి పొమ్మని చెప్పి, వాళ్లు దండాలు వెళ్లి పోతుంటే చిరునవ్వుతోనే అందరినీ దీవించి," నాకు చాలా ఇష్టమైన ఈ పట్టి మంచాన్ని మాత్రం నా కట్టె కాలే వరకూ నాతోనే ఉంచండి,
ఎప్పుడు చనిపోయినా నా చావు కబురు నా కొడుక్కి చెప్పకండి, నేను పోయాక అతను వచ్చినా ప్రయోజనం ఏముంది, వాడికి నచ్చినట్లు వాడిని ఉండ నివ్వండి" అని నిశ్చింతగా గెండె మీద చెయ్యి వేసుకొని నిద్రపోయాడు, ఆ తరువాత అతడు ఎప్పుడూ నిద్ర లేవలేదు, శాశ్వత నిద్ర లోనే ఉండిపోయి అంతిమ యాత్రలో అవిరై పోయాడు. మూడేళ్ల తరువాత సుబ్బారాయుడు కొడుకు వెంకటరాయుడు సొంతూరు వచ్చాడు. తన తండ్రి రాసిన ఆస్తి పంపకాలు గురుంచి తెలుసుకొని మారు మాటాడకుండా ఊరు వారిని సమావేశ పెట్టి" నాన్న గారు చనిపోయినట్లు నాకు చాలా కాలం తరువాత తెలిసింది, నాన్న జన్మభూమి గొప్పతనం గురుంచి చెప్పినా నాకు తలకెక్కలేదు. కరోనా వైరస్ ప్రభావం నా కళ్ళు తెరిపించింది, వైరస్ మిగిల్చిన విషాదం వల్ల విదేశాల్లో నా ఉద్యోగం పోయింది, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, నేను రక రకాల దేశాలు తిరిగినా ఎక్కడా నాకు ఆదరణ దొరకలేదు, నేను ఇండియాకి వచ్చి అమ్మా నాన్నల సన్నిధిలో ఊరికి ఉపకారిగా వుందామని బుద్ధి తెచ్చుకున్న సమయం లోనే జరగ రానిది జరిగి పోయింది. నాన్న నాకిచ్చిన ఆ ఎకరం భూమి, ఆ పాత పెంకిటిల్లు చాలు ఇక మా వంశం గర్వ పడే విధంగా నా జీవితాన్ని గడుపుతాను, నాకు మన ఊరు లోనే ఒక మంచి అమ్మాయి ఉంటే చూడండి పెళ్లి చేసుకొని స్థిరపడతాను" అని చెప్పి అందరికీ వినమ్రంగా దండం పెట్టాడు.ఊరు గుండె బరువెక్కింది.