దొంగతనం మంచిదే! - సరికొండ శ్రీనివాసరాజు‌

Stealing is good!

రంగ చదువులో బాగా వెనుకబడేవాడు. ఎవరైనా చదువుకోమని హితబోధ చేస్తే వారిని చురచురా చూస్తూ దూరంగా వెళ్ళేవాడు. పైగా బయటి చెడు సావాసాలతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. తరచూ తరగతిలోని విద్యార్థుల వస్తువులు మాయం అవుతున్నాయి. రంగ మీద అందరికీ అనుమానం ఉన్నా ఎవ్వరూ రంగను ప్రత్యక్షంగా పట్టుకోవడం లేదు.

ఒకరోజు ఆ తరగతి పిల్లలు బయట ఆటలు ఆడుతుండగా ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చే శ్రీనాథ సంచిలో విలువైన వస్తువు మాయం అయింది. శ్రీనాథ రంగపై అనుమానం ఉందని ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదు చేశాడు. ప్రధానోపాధ్యాయులు రంగను పిలిచి బాగా మందలించాడు. తన తప్పేమీ లేదని రంగ ఎంతగానో అన్నాడు. అయినా ప్రధానోపాధ్యాయులు వినిపించుకోకుండా రంగ చేత శ్రీనాథకు నష్ట పరిహారం ఇప్పించాడు. ఇంటివద్ద రంగకు బాగా చివాట్లు పడ్డాయి. తన తప్పేమీ లేదని తల్లిదండ్రులకు ఎంత చెప్పినా తల్లిదండ్రులు కూడా వినిపించుకోలేదు.

మరునాడు పాఠశాలకు వచ్చిన రంగ తన ప్రాణ స్నేహితుడై సీనియర్ విద్యార్థి సురేంద్ర కు తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు సురేంద్ర ఇలా అన్నాడు. "ఎవడో చేసిన దొంగతనాన్ని నీ మీద వేశాడా ఆ శ్రీనాథ. నువ్వు దొంగవు కాకున్నా నిన్ను అనవసరంగా దొంగను చేశాడు వాడు. ఎలాగూ నీకు దొంగవనే నింద పడింది వాడి వల్ల. ఇప్పుడు నీ నిజాయితీని నిరూపించుకోవాలన్నా ఎవరూ నిన్ను నమ్మరు. ఎలాగూ నింద పడింది కాబట్టి నువ్వు నిజంగానే దొంగవు కావాలి. ఆ శ్రీనాథ సంపద అంతా నువ్వు దోచుకోవాలి. ఇదే నువ్వు వాడి మీద తీర్చుకునే ప్రతీకారం." అని. "నేను ఏం చేయాలిరా చెప్పు." అన్నాడు రంగ.

"ఆ శ్రీనాథకు తనకే అందరికన్నా ఎక్కువ చదువు వచ్చని పొగరు. ఆ గర్వం తలకెక్కి మనలాంటి వారు వాడి కళ్ళకు కనబడటం లేదు. కాబట్టి ఆ చదువును నువ్వు దోచుకోవాలి. నువ్వు తప్పు చేయకున్నా వాడికి క్షమాపణ చెప్పు. వాడితో స్నేహం చెయ్యి. ఆ తర్వాత వాడి సమయం వృథా చేస్తూ వాడికి వచ్చిన చదువు అంతా చెప్పించుకో. అన్ని సబ్జెక్టులపై శ్రద్ధ పెంచి, వాడితో నీకు తెలియనివి అన్నీ చెప్పించుకొని వాడి తెలివిని మొత్తం దోచుకో. ఇప్పుడు నువ్వు 8వ తరగతి కదా! ఈ మూడు సంవత్సరాలు శ్రీనాథ చెప్పిన చదువుతో నువ్వు అత్యధిక మార్కులు సాధిస్తే వాడి తెలివిని మొత్తం దోచుకున్నట్లే. పదవ తరగతి ఫైనల్ పరీక్షలలో మంచి మార్కులు సాధించాక అప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో అతని స్నేహం చేశావో చెప్పు. దెబ్బకు ఖంగు తింటాడు మనోడు. ఇక జన్మలో కోలుకోడు." అన్నాడు సురేంద్ర.

రంగ సురేంద్ర చెప్పినట్లు చేశాడు. శ్రీనాథతో స్నేహం చేసి, అతణ్ణి వదిలిపెట్టకుండా అన్ని సబ్జెక్టులూ బాగా చెప్పించుకొని గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో శ్రీనాథతో సమానంగా పదికి పది జి.పి.ఎ. పాయింట్స్ సాధించాడు. ఆ సంతోషంతో శ్రీనాథకు కృతజ్ఞతలు చెప్పాడు. చదువును దోచుకోవడం నేరం కాదని, పంచేకొద్దీ పెరిగేది విద్య అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. ఇంటర్మీడియట్ నుంచి తానూ వెనుకబడిన వారికి విద్య నేర్పడం చేస్తున్నాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు