పూర్వం పల్నాడు ప్రాంతంలో విద్యారణ్యుడు అనే సాధు ఉండేవాడు. అతడు అనేక పుస్తకాలు చదివి స్వయంకృషితో విజ్ఞానం సంపాదించుకున్నాడు. ఆ విద్య తనతోనే పోకూడదనే తలంపుతో ఓ గురుకులం స్థాపించాడు. అందులో పేద విద్యార్థులకు చదువు చెబుతూ తన ఆశయం నెరవేర్చుకుంటున్నాడు.
తక్కువ కాలంలోనే మంచి బోధకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎంతో మందిని ఉత్తములుగా, ఉన్నతులుగా తీర్చి దిద్దాడు. ఆ పరిసర ప్రాంతంలోనే శంకరయ్య అనే బోయవాడు వున్నాడు. అతనికి ఒకే ఒక కొడుకు. వాడు చాలా అల్లరివాడు. అంతేకాదు చిల్లర చిల్లర దొంగతనాలు కూడా చేసేవాడు. వీడిని మార్చటానికి ఎంతో ప్రయత్నించాడు శంకరయ్య. అతడి వల్ల కాక విద్యారణ్యునికి అప్పగించాడు.
"అయ్యా! వీడు నా ఒక్కగానొక్క కొడుకు. వీడికి పుట్టుకతోనే చపల బుద్ధి అలవడింది. ఎలాగైనా వీడిని మార్చి మనిషిగా చేయండి అని వేడుకున్నాడు. తండ్రి ఆవేదనను కాదనలేక బడిలో చేర్చుకున్నాడు. కాలం కదులుతూ ఉంది. బాలుడిలో మార్పులేదు.
ప్రతిరోజు ఎవరినో ఒకరిని కొట్టడం, బూతులు తట్టడం చేస్తుండేవాడు. ఎవరులేని వేళలో పిల్లల పెట్టెలు పగలగొట్టి డబ్బులు, తినుబండారాలు దొంగిలించేవాడు. వీడి ఆగడాలు భరించలేక గురువుకు చెప్పుకునేవారు. గురువు వాడిని పిలిపించి హితోపదేశం చేసేవాడు.
వాడికి గురుబోధ నెత్తికెక్కేది కాదు. చీమకుట్టినట్టు అయినా అనిపించేదికాదు. ఎన్ని సార్లు చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టే. కొట్టినా, తిట్టినా ఎన్ని శిక్షలు వేసినా వాడిలో పరివర్తన లేదు. తోటి విద్యార్థులు వాడి చేష్టలు భరించలేక పోయారు. వాడైనా ఉండాలి. మేమైనా ఉండాలి. అంతేగాని వాడితో కలిసి మేముండలేము. వాడిని వెళ్ళగొట్టండి" అని గురువు ముందు వాపోయారు.
ఆయన చిరునవ్వుతో " నాయనలారా! ఓపిక పట్టండి. వాడిలో తప్పకుండా మార్పు వస్తుంది. సహనానికి ఉన్న శక్తి సముద్రానికి కూడా ఉండదు" అని సర్ది చెప్పాడు. మళ్ళీ వాడిని పిలిచి అందరిముందు మందలించాడు. వాడు కొంతకాలం గురువు ఆజ్ఞను మీరే వాడు కాదు. తరువాత మళ్ళీ మాములే. పిల్లలంతా విసిగివేసారి పోయారు. ఓసారి పిల్లలంతా పెట్టె బేడా సర్దుకుని గురువు వద్దకు వచ్చారు.
"అయ్యా! వాడిలో మార్పు రావడం కల్లా. ఇంకొన్నాళ్లు వాడితో వుంటే మేమూ వాడిలా మారతామనే భయం పట్టుకుంది. కడవడు పాలలో చుక్క విషం కలిసినా అన్నీ విషం అవుతాయి. అలాగే మేముకూడా. ఇక సెలవు. వెళ్ళొస్తాం. వాడిని వెళ్లగొట్టి అప్పుడు కబురంపండి. మళ్ళీవస్తాం" అని ఒక్కొక్కరూ బయటకు వెళ్లిపోయారు. గురుకులం అంతా ఖాళీ అయింది. వాడొక్కడే మిగిలాడు.
గురువు వాడివంక చూసి " అరేయ్! చూశావుగా. ఇక నీవక్కడివే నా శిష్యుడవు. ఎవరిమీద పోరాడతావో పోరాడు. ఎవరి వస్తువులు దొంగిలిస్తావో దొంగిలించు. వెళ్లిన వంద మందికన్నా నీవంటేనే నాకు ప్రేమ. ఎప్పటికైనా మారతావనే నా ఆశ. నా అవసరం వారికి లేదు. ఎందుకంటే వారు బుద్ధిమంతులు. వారు జనారణ్యలో ఎక్కడైనా బ్రతకగలరు. కానీ నీవలకాదు. నిన్ను వెల్లగొట్టి సమాజంలోకి వదలితే, సమాజం అంతా కలుషితం అవుతుంది. కాబట్టి నీలో పరివర్తన వచ్చే దాకా నిన్ను వదలను" అని ఒక్కడికే విద్యనేర్పటానికి నిర్ణయించుకున్నాడు.
గురువు మాట్లాడు తుండగానే వాడి కళ్ళలో జలజలా నీళ్లు రాలాయి. గురువు కాళ్లపై పడ్డాడు. పరుగునా వెళ్లి, దారిన వెళ్లుతున్న తోటి విద్యార్థుల కాళ్లపై పడి వారిని తీసుకు వచ్చాడు. మరెప్పుడు అల్లరి పనులు చేయనని ఒట్టేసాడు. అన్నట్టుగానే మారిపోయాడు. ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. గొప్ప చదువు చదివాడు. ఉన్నతమైన ఉద్యోగం చేసాడు.