ఒక సైనికుని తీపి జ్ఞాపకం. ఈసంఘటన బహుశా 1970వ సంవత్సరంలో జరిగిందను కుంటా. నేను పూణే నుంచి ఉధ్యోగ బదిలీ మీద జమ్ముకశ్మీరుకి వెల్తున్నాను. అప్పట్లో మేము ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరడానికి కనీసం ముప్పై గంటలపైన రైళ్లలో ప్రయాణం చెయ్యవలసి వచ్చేది.
స్నానం ఉండదు. అవే యూనిఫాంలో గంటలకొద్దీ ప్రయాణం చెయ్యవలసి వచ్చేది. రైల్వే వారు మా కోసం మిలిటరీ కంపార్టుమెంటు సమకూర్చేవారు.మా సహచర రక్షణ దళ సబ్యులతో మా లగేజికి భద్రత ఉంటుందని, గుర్తింపు కోసం యూనిఫాంతోనే ప్రయాణం చెయ్యవలసి వలసి వచ్చేది.. ఇన్ని గంటలూ పత్రికలు, మిగత సహచరులతో బాతఖానీతో, కొంతసేపు నిద్ర ఇలా ప్రయాణం పూర్తి చెయ్యవలసి వచ్చేది. ఫాస్టు ట్రైన్సు, డైరెక్టు ట్రైన్సు ఉండేవి కావు అప్పట్లో. బొగ్గు స్టీమ్ తో మెల్లగా నడిచేవి.
సిగ్నల్ పడి స్టీమ్ ఇంజన్ ఫ్లాట్ ఫారం మీద స్పీడ్ అందుకోడానికి సమయం పట్టేది. ఒక్కొక్కసారి లింకు ట్రైను కోసం ప్లాటుఫాంపై గంటల కొద్దీ కాలయాపన చెయ్యవలసి వచ్చేది. సరైన తిండి సదుపాయం ఉండేది కాదు.ఏది అందుబాట్లో ఉంటే అవే కొని కడుపు నింపుకునే వాళ్లం. ప్రయాణంలో అందరం నవ యువకులమే. అప్పుడు జరిగిన సంఘటన గర్తుకు వచ్చి రాస్తున్నాను.
ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడ్డలు ఉంటాయి. ఎంత క్రమశిక్షణ కలిగిన సైనికులైనా ఒక్కొక్కప్పుడు వారి లోని యువరక్తం బయట పడుతూంటుంది.అమ్మాయిల్ని చూసి ఈలలు వెయ్యడం, సంజ్ఞలు చెయ్యడం , కామెంట్స్ చెయ్యడం చేస్తూంటారు.అతి ప్రకృతి సహజ చర్య కానీ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడి ప్రవర్తనకి విరుద్ధం. వారు చెయ్యాలని అలా ప్రవర్తించక పోయినా చూసే ప్రజల్లో చెడు భావన కలగవచ్చు.
నా ప్రయాణం లో ఝూంన్సీ అనే ఒక పెద్ద స్టేషన్లో ట్రైను ఆగింది. మధ్యాహ్న సమయమైనందున అందుబాట్లో ఉన్నవి కొని ఆకలి తీర్చుకున్నాము. ట్రైనుకి సిగ్నల్ ఇచ్చారు. రైలు కదలడం మొదలైంది.నేను కంపార్టుమెంటు తలుపు దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాను. ఇంతలో గ్రామీణ వస్త్రధారణలో నెత్తి మీద మూటతో ఒక ముసలి అవ్వ పరుగున వస్తూ కనబడింది. ఆయాసంతో మా ముందు బోగీ తలుపు అందుకోడానికి ప్రయత్నిస్తోంది.
నెత్తి మీద బరువుకి అదుపు తప్పి ట్రైన్ చక్రాల కింద పడబోయింది. వెంటనే నా సహచరుడు కూడా ఆ దృశ్యం చూసి నాకు సాయం చేసి అవ్వనీ మూటనీ అందుకుని మా కంపార్టుమెంట్లోకి లాగాము. ప్లాటుఫాం మీద ఆందోళన తో చూస్తున్న ప్రయాణీకులు, వ్యాపారస్తులు మేము ఊపిరి పీల్చుకున్నాము. మా సాహసం, సాయానికి ప్రజలు చేతులు ఊపి కృతజ్ఞతలు తెలియజేసారు.అప్పుడప్పుడు మరిచిపోయిన సంఘటనలు జ్ఞాపకం వచ్చి ఆనందం కలుగుతుంది.
సైనికుడంటే యుద్ధ భూమిలోనే కాదు సమయం వచ్చినప్పుడు తన సాహసాన్ని ప్రదర్సించే ట్రైనింగ్ ఇస్తారు వారి మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో.