అగ్రహారం బ్రాహ్మణ వీధి ఇంటివసారా వాలుకుర్చీలో కూర్చుని ఊరి పురోహితులు విశ్వనాథశాస్త్రి పంచాంగం చూస్తున్నారు.ఊరి జనం పెళ్లి ముహూర్తాలు , గృహ ప్రవేశం, భూమి పూజలకు శుభ ముహూర్తాలు పెట్టించు కుంటున్నారు. చాకలిపేటలో ఉండే లచ్చన్న గ్రామ ప్రజల మురికి బట్టలకు నల్లజీడితో ఇంటి గుర్తులు పెట్టి మూటలు కట్టి గాడిద వీపు మీద సర్ది ఇంటి కోళ్లు , పెంపుడు కుక్క , పెళ్లాం లచ్చి చేతిలో సిల్వర్ గిన్నెలో గుడ్డ మూట కట్టిన మధ్యాహ్న బువ్వతో సకుటుంబ సపరివార సమేతంగా ఊరి బయట చెరువు చాకిరేవుకి బయలుదేరాడు.
చాకలిపేట నుంచి చాకిరేవు మద్యలో పంచాయతీ రోడ్డు మరామ్మత్తుల కారణంగా బ్రాహ్మణ వీధి లోంచి చాకిరేవుకి బయలు దేరాడు లచ్చన్న. " దండాలు బాబయ్యా ! " " ఏరా లచ్చన్నా ! చాకిరేవుకి బయలు దేరవా? " పంతులి గారి ప్రశ్న " అవును సామీ ! " సరే , వెళ్లు " లచ్చన్న పరివారం ముందుకు సాగి పోయింది. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వీధి వరండాలో కూర్చుని పంచాంగం చూస్తున్న విశ్వనాథం పంతుల గారు అటుగా సకుటుంబ సపరివార సమేతంగా ఇంటికి తిరిగి వెల్తున్న చాకలి లచ్చన్నను చూసి " ఏరా లచ్చన్నా! సాయంకాలం అవకుండానే రేవు నుంచి ఇంటికి బయలు దేరావు ?" తన మనసులోని సంశయాన్ని బయట పెట్టారు.
" వర్షం ముంచుకొస్తోంది బాబయ్యా ! ఉతికిన గుడ్డలు తడిసి పోతాయని బేగె బయలెన్నినాను " సమాధానం చెప్పి ముందుకు కదిలి పోయాడు లచ్చన్న కుటుంబం. అప్పటికి ఎండ తీవ్రంగానే ఉంది. ఆకాశంలో మేఘాల జాడ లేదు. " వెర్రి వెధవ , వర్షం వస్తుందని ముందే ఇంటికి బయలు దేరాడు " మనసులో అనుకున్నారు పంతులు గారు. లచ్చన్న వెళ్లిన అరగంట తర్వాత ఒక్క సారిగా పెద్ద గాలితో కారుమేఘాలు కమ్మి కుంభవృష్టి వర్షం పడింది. సుబ్బరాజు గారి మిల్లు ఆవరణలో ఎండపోసిన ఎర్ర మిరపకాయలు చాకలి లచ్చన్న హెచ్చరికతో వర్షానికి తడియకుండా చేయగలిగాడు. పంతులు గారు ఆశ్చర్యానికి గురయారు. ' నా లెక్క ప్రకారం ఈరోజు పంచాంగంలో వర్ష సూచన లేదు.
మరి చాకలి లచ్చన్న ముందే వర్షం వస్తుందని ఎలా చెప్ప గలిగాడు. ఈ విషయం ఊళ్ళో వాళ్లకి తెలిస్తే నా పరువేం కాను ' అనుకుంటూ అసహనంగా ఉన్నారు. ఇంట్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న పంతులు గార్ని చూసిన భార్య కారణ మడిగింది. ఆయన చిరాకు పడుతు విషయం చెప్పారు. హైస్కూలులో సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వారి అబ్బాయి తండ్రి మాటలు విని బయటకు వచ్చి " నాన్న గారూ ! ఇందులో ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. సైన్సు ప్రకారం వాతావరణం లో వేడి ఎక్కువైనప్పుడు ఆకాశంలో క్యుములోనింబస్ నీటి మేఘాలు ఏర్పడి అప్పటికప్పుడు భారీ గాలితో వాన కురుస్తుంది. అవేవీ పంచాంగాల్లో రికార్డు కావు.
" వివరంగా తెలియచేసాడు. పంతులు గారి మనస్సు అప్పటికి శాంతించినా చదువుసంధ్యలు లేని చాకలి లచ్చన్న కెలా ముందుగా వర్షం వస్తుందని తెల్సిందా అని మదన పడసాగారు. మర్నాడు చాకలి లచ్చన్న చాకిరేవు కెల్తున్నప్పుడు దగ్గర ఎవరూ లేరని చూసి పిలిచి మనసులోని సంశయాన్ని బయట పెట్టారు పంతులు గారు. అందుకు లచ్చన్న చిన్న నవ్వు కనబరుస్తూ " అదా , బాబయ్యా ! మామూలుగా అయితే నా గాడిద తన తోటి గాడిదల్ని ఎతికేటప్పుడు గట్టిగా ఓండ్ర పెట్టి అరుస్తాది.
అదే చినుకులు వచ్చే బెగులుంటే నోటి పల్లు బయటికేసి సకిలిత్తు (నవ్వుతూ) చాకిరేవుచుట్టూ పరుగులెడతాది. అదే నాకు ఆనవాలు సామీ! నేనూ లచ్చీ గబగబా ఆరిన గుడ్డల్ని మూటలు కట్టి ఇంటికి బయలెలు తాము." వివరంగా చెప్పేడు. లచ్చన్న వెళిపోయిన తర్వాత వాడి ముందు చూపుకీ, చదువు లేక పోయినా ఉతికిన బట్టలు గుర్తులు పెట్టి ఎవరి బట్టలు వారికి అందచేసే జ్ఞాపక శక్తికి మనసులో మెచ్చుకున్నారు పంతులు గారు.