నిజమైన ఆటగాళ్ళు - సరికొండ శ్రీనివాసరాజు‌

Real players

వేసవి సెలవుల్లో ఒక స్వచ్ఛంద సంస్థ మండల స్థాయి అండర్ 16 క్రికెట్ పోటీలు నిర్వహిస్తుంది. ఫైనల్లో ఓడిపోయిన వారికి తక్కువ పారితోషికం. గెలిచిన వారికి అతి భారీగా పారితోషికం ఉంటుంది. శ్రీపురం మరియు రంగాపురం గ్రామ జట్లు ఫైనల్ చేరాయి‌. రెండూ సమ ఉజ్జీలే. ఫైనల్లో ఎవరు గెలిచేదీ చెప్పడం కష్టం. శ్రీపురం జట్టులో వాసు, రాముల ఓపెనింగ్ జోడీని విడదీయడం అతి కష్టం. వీరిద్దరి భాగస్వామ్యమే పటిష్టమైన పునాది వేసి, జట్టుకు ఎక్కువ విజయాలు తెచ్చి పెడుతుంది. అంతేకాకుండా మంచి ఆల్ రౌండర్స్, బౌలర్స్ శ్రీపురం జట్టులో ఉన్నారు. రంగాపురం జట్టు గెలుపు కోసం చాలా అడ్డదారులు తొక్కుతారు. అవసరమైతే నిబంధనలు వారికి అనుకూలంగా మార్చుకుంటారు.

సెమీ ఫైనల్ తర్వాత ఫైనల్ ఆటకు మూడు రోజుల విరామం ఉంది‌. ఫైనల్ ఆట కోసం మండల కేంద్రంలో రంగాపురం జట్టు ఆ మూడు రోజులు మంచిగా ప్రాక్టీస్ చేశాయి. శ్రీపురం జట్టు సారథి రాజేంద్రకు తెలిసిన వాళ్ళు విందుకు పిలిచారు. రాజేంద్ర తన జట్టును తీసుకు వెళ్ళి ఆరోజు విందు వినోదాలలో మునిగిపోయారు‌. రాము, వాసులు వీరితో కలవకుండా మంచి సాధన చేశారు. రెండవ రోజు రాజేంద్ర టీంను రంగాపురం జట్టు వాళ్ళు విందుకు ఆహ్వానించారు. తీయగా మాట్లాడుతూ మూడు పూటలా కమ్మని విందు ఇచ్చారు. మధ్యలో రాజేంద్ర జట్టు వాళ్ళు రంగాపురం జట్టు సూచన మేరకు ఈత వంటి సరదాలతో ఆ రోజంతా గడిపారు. వాసు, రాములు వీళ్ళతో కలవలేదు. పైగా ప్రాక్టీస్ చాలా ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేశారు. రాజేంద్ర పెడచెవిన పెట్టాడు.

ఫైనల్ మ్యాచ్ మొదలైంది. ముందు బ్యాటింగ్ చేసిన రంగాపురం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 100 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగుకు రాముకు జతగా సోముడు ఓపెనరుగా పంపడానికి నిశ్చియించుకున్నాడు కెప్టెన్ రాజేంద్ర. ఇదేమిటని వాసు ప్రశ్నిస్తే "నీ వికెట్ ఎంతో విలువైనది. దురదృష్టవశాత్తు నువ్వు ముందే అవుట్ అయితే ఎలా? ఎలాగైనా మనం గెలవాలి." అన్నాడు రాజేంద్ర. వాసు మౌనంగా ఉన్నాడు.

ఆట మొదలైంది. సోము స్ట్రైకరుగా వచ్చాడు‌. మొదటి ఐదు బంతులకు ఒక్క పరుగు కూడా తీయని సోము 6వ బంతికి సింగిల్ తీశాడు. రెండో ఓవర్లో మళ్ళీ మొదటి ఐదు బంతులకు ఒక్క పరుగు కూడా తీయలేదు సోము. 6వ బంతికి సింగిల్ తీయబోగా రాము సహకరించలేదు. దీంతో సోము రనౌట్ అయ్యాడు. మూడవ ఓవర్లో స్ట్రైకింగుకు వచ్చిన రాము మొదటి ఐదు బంతుల్లో 24 పరుగులు సాధించాడు. 6వ బంతికి సింగిల్ తీయబోగా నాన్ స్ట్రైకింగులో ఉన్న పాండు సహకరించలేదు. తృటిలో రనౌట్ బారి నుండి తప్పించుకున్నాడు రాము. 3 ఓవర్లలో 25/1.

నాలుగో ఓవర్లో 5 బంతులు ఆడిన పాండు కేవలం 4 పరుగులే చేశాడు. 6వ బంతికి సింగిల్ సాధించాడు. విజయానికి ఇంకా 6 ఓవర్లలో 71 పరుగులు అవసరం. 5వ ఓవర్ మొదటి బంతికి పాండు అవుట్. ఆ తర్వాత ఐదు బంతుల్లో ఐదుగురు బ్యాట్స్ మెన్ అవుట్ ‌ ఇంకా 30 బంతుల్లో 71 సాధించాలి. రాము 6వ ఓవర్లో 5 బంతులకు 12 పరుగులు సాధించాడు. ఒక ఎక్స్ట్రా వచ్చింది. 6వ ఓవర్లో సింగిల్ తీయబోగా నితీశ్ సహకరించలేదు. 7వ ఓవర్లో 4 బంతులకు ఒక్క పరుగైనా తీయని నితీశ్ 5వ బంతికి అవుట్. 6వ బంతికి అప్పుడే బ్యాటింగుకు వచ్చిన ఉదయ్ అవుట్.

అప్పుడు వాసును బ్యాటింగుకు దింపారు. 3 ఓవర్లలో 58 పరుగులు సాధించాలి‌. 8వ ఓవర్లో వాసు 24 పరుగులు సాధించాడు. ఇంకా రెండు ఓవర్లలో 34 పరుగులు సాధించాలి. 9వ ఓవర్లో అతి కష్టమైన బౌలింగులో రాము 6 నలుగురే సాధించాడు. ఆఖరి ఓవర్లో 28 చేయాలి. మొదటి 3 బంతుల్లో 3 సిక్సులు కొట్టిన వాసు నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఐదో బంతిని రాము పెద్ద షాట్ కొట్టాడు. ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. తదుపరి బంతికి మరో బౌండరీ కొట్టాడు రాము. ఆఖరి బంతికి 4 పరుగులు చేస్తే గెలుస్తారు. రాము కొట్టిన షాపుకు బంతి బౌండరీ లైన్ వైపు దూసుకు వెళ్తుంది. బౌండరీ లైన్ ఇవతల ఫీల్డర్ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి, బంతిని వికెట్ల వైపు విసిరాడు. వికెట్ల దగ్గర ఉన్న ఫీల్డర్ ఆ బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ఈ లోపలే రాము, వాసులు 4 పరుగులు చేశారు. 9 మంది ఆటగాళ్ళు తమ జుట్టును ఓడించాలని ప్రయత్నించినా రాము, వాసుల ఇద్దరి కృషి వల్ల శ్రీపురం జట్టు ఘన విజయం సాధించింది. ఆ స్వచ్ఛంద సంస్థ వారు ఆ పారితోషికం మొత్తాన్ని రాము, వాసులు ఇద్దరికే సమానంగా పెంచారు.

ఆట పట్ల అంకిత భావం ఉండాలి. తమ ప్రాంతంపై భక్తి భావం ఉండాలి. తమను నమ్ముకున్న వారిని నిరాశపరచరాదు. ప్రలోభాలకు లొంగరాదు‌.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు