" ఏమే, కాత్యాయని ఆ అమెరికా సంబంధమే కావాలంటోందా?" భార్య కామాక్షి ని అడుగుతున్నారు పరంధామయ్య. " ఎంత నచ్చ చెప్పినా ఆ ఫారిన్ సంబంధమే చేసుకుంటుందట.దాని ఫ్రెండ్ ఆస్ట్రేలియా సంబంధం చేసుకుని ఎంజాయ్ చేస్తోందట."జవాబు చెప్పింది. " దాని ఖర్మ.పెరట్లో చెట్టును ఉంచుకుని అడవిలో కెళ్లాడట గొడ్డలి పట్టుకుని మూర్ఖు డొకడు." విసుగు చూపారు ఆయన. " మరొకసారి చెప్పిచూస్తాను" అంది కామాక్షమ్మ.
* * *
" వద్దు మమ్మీ , ఎన్ని సార్లు చెప్పాలి?" విసుగు ప్రదర్సించింది కాత్యాయని. " మళ్లీ ఆలోచించమ్మా! అబ్బాయికి ఏ దురలవాట్లు లేవు"
" ఐతే? "
" మంచి కుటుంబం, సొంత ఇల్లు. ఊళ్లోనే ఉంటారు. పలుకుబడి ఉన్న వ్యక్తులు"
" అబ్బా!...ఎన్నిసార్లు చెప్తావ్ అరిగి పోయిన పాటల రికార్డులా? ఆ పంచె...నామాలు...పిలక...ఉఫ్.."
" అది కాదమ్మా , మీరిద్దరూ ఈడూ జోడూ జాతకాలు కలిసాయని సిద్దాంతి గారు చెప్పేరు. అబ్బాయి కూడా నువ్వంటే ఇష్టపడుతున్నాడు"
" ఛ , మీరు మారరా? జాతకాలట...జాతకాలు..."
" అదేంటమ్మా , అలా అంటావు ? సంబంధం నచ్చక పోతే వదిలెయ్, సంప్రదాయాల్ని దూషించకు. మా పెద్ద వాళ్లు ఏ సంబంధం తెస్తే అదే చేసుకున్నాం. సుఖంగా సంసారాలు చేసుకుంటున్నాం."
" మీ చాదస్థం మీదిలే. అమెరికా న్యూజెర్సీ సంబంధమే ఖాయం చెయ్యండి. ఇదే ఫైనల్..."
" అంత దూరం పంపాలంటే బాధగా ఉందే..."
" నేను బావుండాలా? హ్యాపీగా ఉండాలా? లేక ఆ పూజారితో పొద్దున్నే లేచి మడి కట్టుకుని పూజలు చేసుకోవాలా?"
" వద్దులేమ్మా , నీ ఆనందమే మా క్కావల్సింది. అమెరికా సంబంధం వాళ్లతో మాట్లాడమని మీ నాన్నకు చెబుతాను. ఆ పూజారి అబ్బాయిని ఏమీ అనొద్దు. మంచివాడు, పాపం..."
" సరే , ఆ ప్రయత్నంలో ఉండండి"
* * *
" ఏ మందండీ , మీ అమ్మాయి? ఒప్పుకుందా వదిన గారూ! " అబ్బాయి తల్లి ఆతృతగా అడిగింది. " లేదు వదినగారూ, మీ అబ్బాయిని చేసుకోడానికి ససేమిరా అంటోంది " అంది కామాక్షమ్మ.
" అయ్యో, మా వాడికేం తక్కువ? రోజూ మీరు ఆలయాని కొస్తున్నారు కదా! ఏవైనా అవలక్షణాలు కన్పించాయా? వేదం కూడా చదివాడు"
" ఎంత మాట వదిన గారూ, మీ అబ్బాయిని వేలెత్తి చూపడమంటే మహా పాపం. మాకే అదృష్టం లేదనుకుంటాను. అమెరికా సంబంధమే కావాలని మొండి పట్టుదలగా ఉంది."
" సరే , వదినా! పిల్లల మనస్సు నొప్పించకూడదు. కలిసి బ్రతకాల్సింది వాళ్లు. ఇంక అమ్మాయిని బలవంత పెట్టకండి"
" సరే నమ్మా! "
* * *
" ఏమ్మా , ఏ మైంది? నేనంటే ఒప్పుకుందా కాత్యాయని ?" ఆతృతగా అడిగాడు సుబ్రహ్మణ్యం తల్లిని. " నువ్వు నచ్చావు, నీ నడవడిక నచ్చింది కాని నీ వైదిక వృత్తి నచ్చ లేదట."
" అర్థమైందమ్మా! దిగులు పడకు. నాకు ముందే తెల్సు నా వైదిక వృత్తంటే ఆ అమ్మాయికి చులకన భావనని". కొడుకు మాటలు విన్న పేరయ్య పంతులు " బాధ పడకురా, ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తాను" అనునయిచాడు. " మంచి సంబంధం కాదు, మంచి అమ్మాయి ఐతే చాలు. మీతో కలిసి పోయి ఉండ గలిగితే బాగుంటుంది."
* * *
" అన్నీ సర్దుకున్నావా? మళ్లీ సంవత్సరం దాకా రావాయె. అల్లుడు పెళ్లవగానే మరుచటి రోజే అమెరికా వెళ్లి పోయాడు. పట్టుమని పది రోజులు కూడా లేడు."
" మమ్మీ , పెద్ద జాబ్. ఊపిరి సలపని పని. ఇదేమైన గుడి ఊడ్చి దేవుడి ముందు గంట వాయించే పని అనుకున్నావా? జనరల్ మేనేజర్. శలవు దొరకడమే పెద్ద విషయం ఆయనకి." ఒకింత దర్పం కనబర్చింది కాత్యాయని. " సర్లేమ్మా... మళ్లీ ఆ పూజారి అబ్బాయి సంబంధాన్ని దెప్పడం ఎందుకు? మంచి పిల్లని వాళ్ల చుట్టాల్లోనే చూసి సుబ్రహ్మణ్యానికి పెళ్లి చేసారు పోయిన నెలలో. చిలకా గోంరికల్లా ఉన్నారట ఆ జంట.
" వాటెవర్, క్యాబ్ వచ్చేసింది. ఏడవకు.నేనేమీ జైలుకి పోవడం లేదు. జస్టు, అమెరికా. అంతే! స్కైప్ లో రోజూ మాట్లాడుతా. వెళ్లొస్తా మమ్మీ... వెళ్లొస్తా డాడ
* * *
" ఏమోయ్... ఏంటి దిగాలుగా ఉన్నావ్ ?" ప్రభాస్ ప్రశ్న. " నేనొచ్చి అప్పుడే రెండేళ్లు అయిపోతోందండీ, సెలవుకి సీరియస్ గా ప్రయత్నించండి. మా చెల్లాయ్ పెళ్ళికి నెల రోజులు ముందైనా లేకపోతే బాగుండదు." " చూస్తున్నావు కదా...ఆదివారాలు కూడా వెళ్లాల్సొస్తోంది. ఉదయం ఆరింటికి బయల్దేరితే ఆరింటికి ఇంటి కొస్తున్నాను. పని వత్తిడి వల్ల శలవు దొరకట్లేదు."
" అదేంటండీ...ఏడెనిమిది నెలల నుంచీ ఇదే చెప్తున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోంది. ఇండియా చాలా మిస్సౌతున్నాను"
" సరేలే, ఒక నెల నువ్వు ముందెళ్లు. శలవు దొరక్క పోతే ఒక వారమైనా ఎమర్జెంసీ లీవు పెట్టుకుని పెళ్ళి కొస్తాను. ఫ్రెష్ అవు. గుడి కెల్దాం. మా బాసు , వాళ్లావిడా కూడా వస్తున్నారు."
" ఎప్పుడో సంక్రాంతి కి వెళ్లాము.మళ్లీ దీపావళి వచ్చేసింది. ఇంటికి దగ్గరే గుడి , కానీ వెళ్లే సమయమే లేక పోతోంది."
" అవన్నీ ఇప్పుడెందుకు ? నువ్వు రెడీ అయి రెడ్డి గారి మిసెస్ తో గుడికి వచ్చెయ్.నేను పూజా సామాన్లు షాపింగ్ చేసి తిన్నగా గుడికి వచ్చేస్తాను.
* * *
" అరే, ఇతను ఇక్కడున్నాడేంటి...? పూజారిని చూసి ఆశ్చర్య పోయింది కాత్యాయని. " నీకు తెల్సా ఆయన ? ఈ మద్యనే ఇండియా నుంచి తీసుకొచ్చారట. వేద పండితుడని పెద్ద పూజారి చెప్పారు." సంశయంగా అడిగింది రెడ్డి గారి శ్రీమతి.
" తెలుసు. నాకు ముందర ఇతని తోనే పెళ్లి చేద్దామను కున్నారు మా వాళ్లు. నవ్వుతు, మా కాలనీలో ఉండే గుడిలో పూజారిగా ఉండేవారు."
" ఎందుకు నవ్వుతావ్? ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నావు. ఆయన కేమి తక్కువ? ఆరు నెలల కొకసారి ఏవో యజ్ఞ యాగాదుల కోసం ఇండియాకి వెళ్లొస్తారు.మనం ఇండియా కెళ్లడం మాట దేవుడెరుగు.,నెల కొకసారైనా ఇల్లు దాటి బయటి కెళ్లలేక పోతున్నాము. ఆయన జీతం కూడా మనతో సమానంగా సంపాదన ఉంది. అదిగో అటు చూడు, ఎదురుగా ఉండే విల్లా ఈయనకిచ్చిన ఫేమిలీ ఎకామొడేషన్. మనలా అగ్గి పెట్టెల్లాంటి గదులు కావు. పెద్ద హోదాలో ఉండే వారు ఈయన కాళ్లకు మొక్కుతారు" వివరం చెప్పింది రెడ్డి గారి భార్య. " గుడి పూజారి అని చేసుకోలేదు." బాధగా చెప్పింది. " నీ ఖర్మ, పురోహితుడని చిన్న చూపు చూసావు.వారి సంపాదన ఉద్యోగస్థుడికన్నా ఎక్కువ. కనబడని ఆదాయం. మానసిక వత్తిడిలేని ఆధ్యాత్మిక వాతావరణం. పది మందితో పలకరింపులు చిరునవ్వుల జీవితం. అటు పద, మీ ఆయన మా వారు పూజా సామాన్లు తీసుకొస్తు న్నారు. మన భర్తల ప్రమోషన్ల కోసం జీతం పెంపు కోసం ఉధ్యో గాలు పీక్కుండా ఉండాలనీ దేవుడితో పాటు ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదాలు తీసుకోవాలి.