బొమ్మలు చెప్పిన కమ్మని కథలు.16. ఒక శుభముహుర్తాన తనపరివారంతో కలసి పండితులు వేదమంత్రాలు చదువుతుండగా రాజసభలో ప్రవేసించిన భోజరాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదహారవ మెట్టుపై కాలుమోపబోయాడు.ఆమెట్టుపై ఉన్న కృపాపరి పూర్ణవళ్ళి అనే ప్రతిమ 'ఆగు భోజరాజా నువ్వు అధిష్టించదలచిన ఈసింహాసనం చతుర్ధశ విద్యలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, శిక్ష, వ్యాకరణము, ఛంధస్సు, నిరుక్తము, జోతిష్యము, కల్పము, మీమాంసము, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రాలు నేర్చిన సకల గుణసంపన్నుడు అయిన విక్రమార్కుని పరోపకారం తెలిపే కథ చెపుతాను విను...
ఉజ్జయినీ నగర శివారు ప్రాంతమైన కాళీమాతఆలయంలో ఒక పండితుడు ప్రతిరోజు సాయంత్ర సమయంలో పురాణ ప్రవచనం గొప్పగా చెపుతున్నాడని తెలిసి మారువేషంలో విక్రమార్కుడు అక్కడకు వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నాడు.కొంతసేపటికి పడపం లోనికి తనకుమార్తెతో వచ్చిన పండితుడు 'భక్తులారా మన పూర్వీకులు, బ్రహ్మాదులు, మునులు పుణ్యపురుషులు మానవకల్యాణానికి దేవగణాలను సంతృప్తి పరిచే విధంగా మంత్రాలను మూడు విభాగాలుగా విభజించారు. దైవ ఆరాధనకు, మంగళప్రద శుభకార్యాలకు, చదివే మంత్రాలను 'దైవం' అంటారు. ఉపనయం, బారసాల, వివాహం వంటి కార్యక్రమాలకు పఠించే మంత్రాలను 'మానుషం' అని అంటారు. మనిషి మరణానంతరం వారి సంతతి నిర్వహిస్తూ పఠించే మంత్రాలను 'అపరం' అంటారు. సహజంగా ప్రతిమనిషి లోనూ సేవాభావం, పరోపకారం, దైవం, దేశం ఎడల భక్తి విశ్వాసాలు, తల్లి తండ్రి, గురువు, పెద్దల ఎడల భయ భక్తులు కలిగి ఉండాలి. అటువంటి ప్రజలు ఉన్నదేశం సస్యశ్యామలంగా మన ఉజ్జయినీలా ఉంటుంది నేటికి స్వస్తి' అన్నాడు. అక్కడకు వచ్చిన వారంతా తమకు తోచినది పండితుని ముందు ఉన్న హారతి పళ్లెంలో ఉంచి ఆశీర్వాదం పొంది వెళ్ళిపోయారు. చివరిగా వెళ్ళిన విక్రమార్కుడు 'పండితోత్తమా తమరు ఎవరు? ఏమి ఆశించి ఉజ్జయినికి వచ్చారు' అన్నాడు. అయ్యా నేను నందివర్తన రాజ్యవాసిని సకలశాస్త్రాలు చదివాను. నాకు ఎనిమిది మంది పుత్రులు ఆడపపిల్లలేని ఇల్లు చంద్రుడు లేని పున్నమి నాదృష్టిలో ఒక్కటే కాళీమాతను వేడుకోగా ఈ అమ్మాయిని నాకు ప్రసాదించినది. ఆసంతోషంలో ఈమె వివాహంనాడు ఈమె బరువు సరితూగగల బంగారం దానం చేస్తానని అమ్మవారికి మొక్కుకున్నా ఈమె పెండ్లి ఈడుకు వచ్చింది, ఎందరినో అర్ధించాను ఎవ్వరు ముందుకు రాలేదు విక్రమార్క మహారాజు దర్శనం కొరకువచ్చి ప్రవేశం లభించక ఇలా కాలం వెళ్ళతీస్తున్నా' అన్నాడు పండితుడు. 'పండితోత్తమా దీని కావలిదారులకు చూపించండి రాజదర్శనం కలుగుతుంది' అని తన ఉంగరాన్ని పండితునికి ఇచ్చి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు. మరదినం రాజసభలోనికి వచ్చిన పండితుని చూసిన విక్రమార్కుడు తన కోశాధికారి స్వర్ణదత్తుని పిలిచి'ఈయువతిని బంగారం తులాభారం తూసి,ఏడువారాల నగలు ఇచ్చి ఆ పండితునికి ప్రశాంత జీవితం గడపటానికి పదివేలవరహాలు ఇవ్వండి.సేనాధిపతి వీరిక్షేమంగా వారిరాజ్యం చేర్చేఏర్పాట్లు చేయించూండి'అన్నాడు. భోజరాజా అంతటి దానగుణం నీలో ఉందా?నీవు విక్రమార్కునితో సరితూగగలిగినవాడవైతే ఈసింహాసనం అధిష్టించు''అన్నది ప్రతిమ. అప్పటికే ముహుర్త సమయం మించి పోవడంతో తనపరివారంతో వెనుతిరిగాడు భోజరాజు. డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. 9884429899.