ఈ ప్రపంచమనే మహా సముద్రంలో జీవితమనే నౌక మీద ప్రయాణం చేస్తున్నాను . ప్రయాణం మొదలయ్యి చాలా కాలం అయింది. ఎక్కడ మొదలైందో, ఎక్కడకు వెళ్తుందో, ఎటు వెళ్తుందో, అర్ధం అయ్యి కానట్లుగా ప్రయాణం సాగుతుంది. నా జీవిత నౌక ఏ ఒడ్డు కి నన్ను చేరుస్తుందో, ఎలా చేర్చబోతుందో అనే సందేహం నా ఆలోచనలను పరిగెత్తిస్తుంది. ఈ ప్రయాణంలో అనేక సార్లు ఒడి దుడుకులు ఎదురయ్యాయి.
కొన్నిసార్లు జీవిత నౌక మునిగిపోయే ప్రమాదం కూడా సంభవించి బయటపడటం జరిగింది. మరికొన్ని సార్లు ప్రయాణం ఏ అలజడి లేకుండా ప్రశాంతంగా సాగింది. అలాంటప్పుడే అనిపిస్తుంది చివరి వరకు యిలాంటి ప్రయాణమే కావాలని. చాలా ఆశగా కూడా అనిపిస్తుంది. ఆలా అనుకునేంతలోపే ఊహించని ఒక పెద్ద అగాధం ఎదురు రావడం, వెన్నులో నర నరాలు వణికిపోవడం, దేవుడా నువ్వే దిక్కు అని వేడుకోవడం, మళ్ళీ మామూలు అవ్వడం అన్ని జరిగిపోయాయి.
చుట్టూ ఎటు చూసినా విశాలమైన సముద్రమే. సూర్యోదయమైతే అందమైన సముద్రం, చిరుజల్లులు పడితే పులకించే సముద్రం, ఎండా కాస్తే వళ్ళు చుర్రు మనే సముద్రం, చీకటి ఐతే భయం పుట్టించే సముద్రం, నిశ్శబ్దంగా ఉంటే హాయిగా ఉండే సముద్రం, అల్పపీడనం పుడితే ఉదృతం చెందే సముద్రం, భూకంపం వస్తే సునామీని సృష్టించే సముద్రం, వెన్నెల వస్తే మరపురాని జ్ఞాపక సముద్రం, సొరచేపలు పైకి లేచినపుడు అభద్రతా భావాన్నిచ్చే సముద్రం, సాధారణ రాయిని కూడా నౌక గుద్దుకున్నపుడు ఉరుములాంటి ధ్వనిని ఇచ్చే సముద్రం. యిలా ఎన్నీన్నో రక రకాల సమ్మేళనాల మధ్యన సాగే నా జీవిత నౌక ఎపుడు ఏమౌతుందో ఊహకు కూడా అందజాలదు..
ఒంటరిగా మొదలెట్టిన ఈ ప్రయాణంలో నాలాగా ప్రయాణం మొదలెట్టిన ఎంతోమందిని కలవటం జరిగింది. అందులో కొందరు ఆప్తులు , మిత్రులు, బంధువులు, పరిచయస్తులు, ఎందరో మరెందరో మహాను బావులు, భాదించేవాళ్ళు, నవ్వించేవాళ్ళు, ఆనందాన్ని పంచేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, చేయందించేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అసూయాపరులు ఇలా ఎన్నో రకాల వాళ్ళు కలిశారు. నా అని అనిపించినవాళ్లు నాతోనే కడవరకు వస్తారని నమ్మినవాళ్లు నాకు తోడు గా ఉంటారని అనుకున్నవాళ్ళు,
దురదృష్టవశాత్తు మధ్యలోనే దిగిపోవటం మల్లి నన్ను ఒంటరిని చేయటం జరిగింది. ఇన్నాళ్ల నా ప్రయాణంలో నాకు అనిపించింది ఒక్కటే ఇప్పటిదాకా నాతో కలిసి ప్రయాణం చేసినవాళ్లు ఎవరు శాశ్వతంగా లేరు. నాతో ఎదో ఒక టైములో నను ఒంటరిని చేసిన వాళ్ళే. అందుకే ఎవరొచ్చినా రాకపోయినా నా గమ్యం వరకు నా ప్రయాణం ఒంటరిగానైనా జరిగి తీరవలసిందే. నా జీవిత నౌక నడిమధ్యలో మునిగినా గమ్యం చేర్చినా మధ్యలో ఆగిపోయినా ఏమి జరిగినా నా ఈ ఒంటరి ప్రయాణం అలుపెరగని బాటసారిలా కడవరకు సాగుతూనే ఉంటుంది.