ఓక శుభ ముహూర్తాన పండితులు వేద మంత్రాలు చదువుతుండగా తన పరివారంతో రాజ సభలో ప్రవేసించిన భోజ మహా రాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ పది హేడవ మెట్టు పై కాలు మోప బోయాడు. ఆ మెట్టు పై ఉన్న 'కరుణాకర వళ్ళి' అనే సాలభంజకం 'ఆగు భోజ రాజా ముందుకు వచ్చే సాహసం చేయకు ఈ సింహాసనం అధిష్ఠించిన విక్రమార్కుడు రమ్యక, రుమళిక, ద్వారకా, సింహళ, కైవల్య, మలయ, అశ్వభథ్ర, కేతుగోభి, మాల్యవంత, పుష్కర, వృషభ, రైవత, నిమ్నొచన, నియోమ్యమ, పారావారా, చౌరవశ్రిత, మాల్యాది వంటి అష్టాదశ ద్వీపాలలో పేరెన్నిక పొందిన వాడు. అతని దాన, వీర, శూర, గుణ గణాలు నీకు తెలిసేలా ఓకథ చెపుతాను విను.... ఉజ్జయినీ రాజ్యం లో విక్రమార్కుడు సభ తీరి ఉండగా ఉత్తర దిక్కు నుండి వచ్చిన వేగు 'జయము జయము ప్రభువులకు ఆర్య దేశంలో 'మకర పురి' అనే పట్టణంలో 'సువర్ణ రేఖ' అనే పేరు మోసిన నాట్యగత్తె ఉంది. ఓక రాత్రి నృత్య ప్రదర్శనకు వేయి మొహరీలు తీసుకుంటుంది. ఓక్కరికి మాత్రమే ఆమె నృత్యం చూసే అవకాశం ఉంటుంది. ఆమె నృత్యం చూసిన తరువాత వారు అక్కడే ఆ రాత్రి బస చేయాలి. కాని నృత్యం చూసిన తరువాత వారికి కేటాయించిన గదిలో నిద్రించిన వారందరూ మరణిస్తున్నారు. అలా ఎందుకు మరణిస్తున్నారో ఇప్పటి వరకు ఎవరు తెలుసుకో లేక పోయారు.ఇదే నేను చూసిన వింత ప్రభు' అన్నాడు. ఆ విషయం విన్న విక్రమార్కుడు రాజ్యాన్ని భట్టికి అప్పగించి, ఆర్య దేశం లోని మకర పురి చేరి, ఓక సత్రంలో బస చేసి పేద రాశి పెద్దమ్మ ఇంట భోజనం చేసాడు. అనంతరం సువర్ణ ముఖి ఇంటికి వెళ్ళి వేయి మొహరీలు చెల్లించి ఆ రోజు రాత్రి తను నృత్యం చూడ దలచానని చెప్పాడు. ఆ రాత్రి సువర్ణ రేఖ నృత్యం బాగా పోద్దు పోయిన దాకా సాగింది.అనంతరం సంగీత వాద్య కారులతో కలసి ఆమె వెళ్ళి పోయింది. తనకు కేటాయించిన గది లోనికి వెళ్ళిన విక్రమార్కుడు అక్కడి తల్పం పై మనిషి ఆకారంలో దిండ్లు అమర్చి, తల్పానికి చేరువగా ఉన్న స్ధంభం చాటున దాగాడు. వేకువకు ముందు గవాక్షంలో నుండి వేగంగా వచ్చిన పెద్ద నాగు పాము తల్పం లోని దిండుపై కాటు వేసింది. స్ధభం చాటు నుండి వచ్చిన విక్రమార్కుడు తన చేతి లోని కత్తి తోనాగు పాము ను రెండుగా తెగ వేసాడు. భోజ మహా రాజా అటు వంటి సహనం, సాహసం నీలోఉంటే ముందుకు వెళ్ళు అన్నది సాలభంజకం. అప్పటికే ముహుర్త సమయం మించి పోవడంతో తన పరివారంతో వెను తిరిగాడు భోజ మహారాజు.