ఒక శుభ ముహుర్తాన పండితుల వేద మంత్రోఛ్చరణ జరుగుతుండగా తన పరివారతో రాజ సభ లోని విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ పద్దెనిమిదవ మెట్టుపై కాలు మోప బోయాడు. ఆ మెట్టు పైన ఉన్న'పరిమళ మోహనవళ్ళి' అనే సాలభంజికం 'ఆగు భోజరాజా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకల లో పేరు పొందిన విక్రమార్కుని మేథస్సు తెలిపే కథ చెపుతాను విను...... 'పురంథరపురి' అనే పట్టణంలో 'రత్నస్వామి' అనే వ్యాపారి ఉండే వాడు.ఆయన తన మరణ దశలో తన కుమారులను చేర పిలిచి 'నాయనలారా నా మరణానంతరం అటక పైన ఉన్నఇత్తడి పెట్టెలో నా ఆస్తి పంపకాలు తెలిపాను అలా నేను సూచించిన విధంగా పంచుకుని సుఖంగా జీవించండి' అన్నాడు. తండ్రి మరణానంతరం అటక పైన ఉన్నఇత్తడి పెట్టె లో చూడగా నాలుగు కప్ప బోమ్మలు నాలుగు పరిమాణాలలో కనిపించాయి.అన్నింటి కన్నా పెద్ద కప్ప బోమ్మను పెద్ద కుమారుడు తెరిచి చూడగా అందులో 'బోగ్గులు' రెండవ బోమ్మలో 'మట్టి' మూడవ బొమ్మలో 'ధాన్యం' నాలుగొ బొమ్మలో 'ఎముకలు' కనిపించాయి. అర్ధం కాని ఆ నలుగురు సోదరులు వాటిని వివరించ గల వారి కోసం ఎన్నో రాజ్యాలు తిరిగి, చివరిగా ఉజ్జయిని లోని విక్రమార్క మహారాజును సభలో ఆశ్రయించి 'ప్రభువులకు వందనాలు మేము నలుగురం అన్నదమ్ములం. అందరిలో పెద్ద వాడి నైన నా పేరు 'విష్ణుదత్తుడు' రొండో వాని పేరు 'శివ దత్తుడు' మూడవ వాని పేరు 'రామ దత్తుడు ' నాలుగో వాని పేరు 'కృష్ణ దత్తుడు' మేము పురంథర పురి వాసులం.మా తండ్రి మరణిస్తూ ఈ కప్ప బోమ్మలలో ఉన్న విధంగా తన ఆస్తిని మమ్మలను పంచుకొమ్మన్నాడు. ఎన్నో రాజ్యాలు తిరిగాం ఎందరినో వీటి అర్ధం అడిగాము ఎవ్వరూ చెప్పలేక పోయారు. తమరు సకల శాస్త్ర విశారదులని, ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరించ గలరని విని వచ్చాం. మా తండ్రి ఆశయం మేరకు మాకు న్యాయం జరిగేలా పంపకం చేయండి ప్రభూ' అని అన్నదమ్ములు తమ కప్ప బొమ్మలు అందించారు. కప్ప బోమ్మలను పరిశీలించి అందులో ఉన్నవాటిని గమనించి 'విష్ణు దత్తా ఈ కప్ప బోమ్మలో మట్టి ఉన్నది కనుక నీవు వ్యవసాయ భూమిని తీసుకో వాలి. శివ దత్తుని బోమ్మలో ధాన్యం ఉంది కనుక ధాన్య వ్యాపారం అతనికి, రామ దత్తునికి పసు సంపద, కృష్ణ దత్తునికి ఇల్లు దానిలో ఉండే బంగారు, వెండి పాత్ర సామానులు చెందాలి' అలా మీ తండ్రి గారు ఈ కప్ప బోమ్మలలో వివరించారు' అన్నాడు విక్రమార్కుడు. నలుగురు అన్నదమ్ములు ఆస్తి పంపకాలకు సంతోష పడి వెళ్ళి పోయారు. ' భోజరాజా ఎంతటి జటిల సమస్య నైనా ఇట్టే పరిష్కరించే నైపుణ్యం నీకు ఉందా! ఉంటే ముందుకు వెళ్ళు' అన్నది సాలభంజికం.అప్పటికే ముహూర్త సమయం మించి పోవడంతో భోజరాజా తన పరివారంతో వెను తిరిగాడు.