ముందుచూపు - దార్ల బుజ్జిబాబు

Preview

పూర్వం పల్నాడు ప్రాంతంలో మిరప పంట బాగా పండించేవారు. ఎండిన మిరపకాయలను వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్మేవారు. మంచి లాభం గడించేవారు. ఎడ్ల బండిలో మూటలు వేసుకుని అడవి మార్గం గుండా వెళ్లి, మళ్ళీ అదే మార్గంలో తిరిగి వచ్చేవారు. ఇలా కొంతమంది వ్యాపారులు ఒక రోజు ఎండు మిరపకాయల మూటలు ఎడ్ల బండ్లపై వేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లారు.

నెల రోజులు అక్కడే ఉండి తీసుకు పోయినవన్నీ అమ్మారు. బాగా లాభం వచ్చింది. డబ్బును జాగ్రత్తగా పంచలో మూటకట్టుకున్నారు.

దాన్ని బొడ్లోనో, గోచీలోనో దోపుకున్నారు. మరికొంతమంది తలగుడ్డలో చుట్టుకున్నారు. గుడ్డ ముడి ఊడకుండా గట్టిగా బిగించి కట్టారు. రామయ్య మాత్రం వారిలా కాకుండా ఓ గోనె గోతంలో వేసాడు. దాన్ని ఎడ్లకువేసే గడ్డిలో పడేసాడు. బండ్లపై ఎక్కి బయలుదేరారు. అడవి మార్గంలో వస్తుండగా మార్గ మధ్యలో మబ్బులు పట్టాయి. మధ్యలో ఉన్న సత్రం వద్ద బండ్లు అపి విశ్రాంతి తీసుకున్నారు. వర్షం మొదలయింది. బండ్లపై ఉన్న మేతను, గోతలను లోపలకు తీసుకువెళ్లారు. వర్షం చాలా సేపు కురిసింది. వెలిసిన తరువాత మళ్ళి బయలుదేరారు.

అప్పటికే పొద్దు గుంకింది. కాసేపటిలో సమీపంలోని గ్రామం చేరుకుని అక్కడ ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవొచ్చు. కానీ,కొంత దూరం వెళ్ళీవెళ్ళాక ముందే దోపిడీ దొంగలు బండ్లను అడ్డగించారు. సాధారణ ఆ మార్గంలో దోపిడీ దొంగలు రారు. అక్కడక్కడ రాజభటులు ఎల్లవేళలా కాపలా కాస్తూనే వుంటారు. వర్షం పడటంతో వారంతా సమీపంలోని సత్రాలలోకి వెళ్లిపోవటం, అదే సమయంలో చీకటి పడటంతో దొంగల పంటపండింది.

వస్తాదులులా కండలు తిరిగిన పది మంది దొంగలు వున్నారు. వీరు కూడా పదిమంది ఉన్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా వీరు ఎదిరించలేరు. దొంగలను చూడగానే పైప్రాణాలు పైనే పోయాయి. రామయ్య తెలివిగా ఎడ్లకు మేత వేస్తున్నట్టు గోతాన్ని పరిచి దానిపై గడ్డి వేసాడు. ఎడ్లు తింటూ ఉన్నాయి. దొంగలు కత్తులు చూపి బెదిరిస్తూ వారి దగ్గర ఉన్న డబ్బును దోచుకున్నారు. రామయ్య వద్ద మాత్రం తలగుడ్డలో గాని, గోచి లో గానీ డబ్బులేదు. బండిపై ఉన్న గోతాలను ఒక్కొక్కటి తీసి వెదికారు.

డబ్బులేవి లేకపోవడంతో గోతలను అక్కడే విసిరేసి, వంటి పై రెండు దెబ్బలు వేసి వదిలిపెట్టి వెళ్లారు. వారువెళ్లిపోయిన తరువాత పరిచిన గోతం తీసుకుని బండి మీదున్న గడ్డిపైన వేసి బయలు దేరాడు. ఆ పరిచిన గోతంలోనే ఉన్నాయి డబ్బులు. "రామయ్య! నీ డబ్బులు ఎక్కడ దాచావు?" అడిగారు తోటి వ్యాపారులు. రామయ్య నవ్వుతూ అసలు విషయం చెప్పాడు. డబ్బులు సంపాదించటమే కాదు, వాటిని దాచుకునే తెలివితేటలుకుడా వ్యాపారికి ఉండాలని వారంతా తెలుసుకున్నారు. రామయ్య తన ముందుచూపుతో డబ్బును కాపాడుకున్న విధానాన్ని ఆ గ్రామం వారంతా ఇప్పటికి కథలుగా చెప్పుకుంటూ వుంటారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు