"అక్కా! నాకు అత్త మరీ కొత్త పెళ్ళి కూతురిలా తయారవుతున్నట్టు అనిపిస్తుంది. ఉదయాన్నే జాగింగ్, జిమ్, తర్వాత మొలకలు,పళ్ళ రసాలు. రిటైర్మెంట్ దగ్గర లో ఉన్న మన అత్త అచ్చు హీరోయిన్ల దినచర్య పాటిస్తుంది" తన చారెడు కళ్ళను వెటకారంగా తిప్పుతూ విడ్డూరంగా తన తోడికోడలితో చెబుతుంది లత. "నాకు అదే అనిపిస్తుంది లతా! మావయ్య చనిపోయి ఏడు నెలలు అవుతుందా!? అప్పటినుంచి ఇలానే చేస్తుంది. నాకు తెలిసి ఒక పదిహేను కేజిలు తగ్గినట్టుంది. చాలా అందంగా మారిపోయింది.
ఇదిగో తొమ్మిది అవుతుందిగా ఉద్యోగానికి బయల్దేరుతుంది." అని తన నైటీని పట్టుకొని లాగుతున్న రెండేళ్ళ కొడుకుని ప్రేమగా కసురుకుంటూ చెబుతుంది సునంద. తన బెడ్రూమ్ లో ఉన్న రాధకి కోడళ్ళు అనే మాటలు వినిపిస్తున్నాయి. కాదు...కాదు వినబడేలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవేమి ఆమె మనసును తాకలేదు. ఆమె కట్టుకున్న పచ్చని చీర పైటకి పిన్ను పెట్టుకునే చోట ఉన్న చిరుగు చూసి చిన్న నవ్వు ఆమె పెదవులపై పూసింది. ఇరవై యేళ్ళ ముందు ఇలానే అద్దం ముందు ముస్తాబై తను హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ముందుకి కదులుతుండగా చిన్న శబ్దం. కోపంగా వెనక్కి తిరిగి చూసేసరికి బిక్కమొహం వేసుకొని, చేతిలో ఉన్న చీర కొంగుని వెంటనే వదిలి "సారీ!" అన్న మాధవ్. "ఇంకెందుకు ఆ కొంగు పట్టుకుని సరాసరి నాతో పాటు ఆఫీస్ కి వచ్చెయ్యండి" అంది ఆదుర్దా కలగలిసిన విసుగుతో. "ఎందుకంత కంగారు?" అని మంచం మీద సాగిలబడి తలకింద చేయిపెట్టి చిరునవ్వుతో అడిగాడు.
"మీకంటే ఈ రోజు సెలవు కనుక, ఇలా విష్ణుమూర్తి లా ఫోజ్ కొడుతూ నవ్వుతారు. నేనీరోజు మీటింగ్ ఎటెండవ్వాలి. రిపోర్ట్ సబ్మిట్ చేయాలి" అని చీరను సర్దుకుంది కంగారుగా. "నీకెంటి రాధా! నువ్వేదైనా సాధించగలవు" అని దగ్గరగా వస్తున్న మాధవ్ ని చూస్తూ, "దూరం అన్నానా దూరం..." చిరుకోపంతో పక్కకి తోసింది తను., తలుపు తట్టిన శబ్దం విని ఈ ప్రపంచంలోకి వచ్చిన రాధ తలుపు తీసింది. "అత్తమ్మా!! ఆచారిగారు ఈ బ్యాగ్ మీకివ్వమన్నారు" అని బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయింది లత. బ్యాగ్లో ఉన్న చిన్న ఎర్ర పెట్టె తీసింది. అందులో ఒంటిగా నవ్వుతున్న లాకెట్ కనిపించింది. అది ఒంటిదా!? తన భర్త కన్నా ముందుగా, మంగళ ప్రదంగా తన ఎద సింహసనాన్ని అలంకరించింది. తన బిడ్డలకి తొలి తాయిలం అయింది. ప్రతిరోజు కళ్ళకద్దుకుని చూసుకోక పోయినా ఏ క్షణము వదలక గుండెల్లో దాచుకున్న మంగళ సూత్రాలు.
సూత్రాల మధ్యన ఉన్న నాన్ కోడ్ వారధిగా పక్క పక్కన ఉండేవి కానీ, ఇప్పుడు శాస్త్రీయమో కాదో తెలియక పోయినా వాటిని రెండింటిని కలిపి లాకెట్ లా చేయించుకుంది. మనిషికి మనో ధర్మానికి మించిన శాస్త్రమేముంది!! మనశ్శాంతికి మించిన స్వావలంబన ఏముంది. ఆమెకి ఇప్పుడు ఆ లాకెట్ వేసుకుంటుంటే తన భర్తను ధరిస్తున్నట్టుగా అనిపించి, అలవాటుగా గుండెల్లో దాచుకుని హ్యండ్ బ్యాగు తీసుకుని బయటికి వచ్చింది. "అమ్మా! ఇది నా చిన్నప్పటి చీర కదూ!? నాకెంత ఇష్టమో! ఇదిగో కొంగు చివరన అప్పుడు తెలియక నేనే పసుపు పెయింట్ రాసా, ఇంకా ఆ మరక పోలేదు.., చూడు.." తన పెద్ద కొడుకు వినయ్ పసిపిల్లాడిలా చీరకొంగు చేతిలోకి తీసుకుని మురిపెంగా చూస్తూ అన్నాడు. "అలాగే కొంగు పట్టుకుని సరాసరి అత్తగారి వెనక ఆఫీసుకెళ్ళిపొండీ" అని మేలమాడింది లత తన బావగారితో. పచ్చని చీరకు ప్రాణం పోసిన పదిలమైన జ్ఞాపకాలు తన మదిని తాకినట్టుగా రాధ పగలబడి నవ్వింది. ఆ నవ్వుకి అక్కడ ఉన్న వారంతా జత కలిపారు. తటపటాయిస్తూనే వినయ్ రాధ దగ్గరగా వచ్చి " అమ్మా!! నువ్వు నాన్న చనిపోయిన దగ్గర నుంచి, అయితే మౌనంగా ఉంటున్నావు లేదంటే నవ్వుతున్నావు కనీసం కన్నీటి చుక్క అయినా కార్చలేదు.
నాకెందుకో భయం వేస్తోంది. నీ బాధ బయటికి పంపించెయ్ అమ్మా!" అన్నాడు. అది విన్న రాధ వినయ్ భుజం మీద చెయ్యి వేసి, "నువ్వేమీ భయపడకురా నాన్నా!! నేను మామూలుగా ఉన్నాను. ఓదార్చే తోడున్నప్పుడే బాధ బయటికొస్తుంది. తుడిచే చేతులున్నప్పుడే కన్నీరు ఉబికొస్తుంది.." అని చెప్పి రెండు అడుగులు ముందుకు వేసి, " సునందా!! నేను సాయంత్రం రావడం ఆలస్యమౌతుంది. నాకోసం ఏమి వండొద్దు" మనవడిని ఎత్తుకుని ముద్దుపెడుతూ చెప్పి, ముందుకు నడుస్తూ, వాకిలిలో ఉన్న కొద్దిపాటి స్థలంలో మట్టి పోసి పెంచిన మొక్కలను కనులతోనే పలకరించింది. ఉదయం పూట ఆ పలకరింతకి వాకిలిలో విరబూసిన రంగురంగుల గడ్డి గులాబీలు నవ్వుతూ బదులు పలికాయి. స్కూటీపై ఆఫీస్ కి వెళ్ళింది.
సాయంత్రం ట్రైనర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరకి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకుంది. తనకు కావలసిన బట్టలు, వస్తువులు సిద్దం చేసుకుంది. ఇంటికి వచ్చే సరికి రాత్రి పది అయింది. ఉదయం ముంగిలిలో నవ్విన గడ్డి గులాబీలు ఇప్పుడు లేవు. పున్నమి చంద్రుని కాంతులకి తెల్లని చంద్రకాంత పువ్వులు మరింత అందంగా నేలపై వెన్నెలలా విరబూసాయి. వాటిని చూస్తుంటే రాధకి మాధవ్ తో ఉన్నప్పుడు తను నవ్విన నవ్వులు గుర్తొచ్చాయి. ఆ పక్కగా ఎర్రగులాబి ఒళ్ళంతా ముళ్ళున్నా అందంగా మందహాసం చేస్తుంది. ఆ మందహాసం ఇప్పుడు తను నవ్వే నవ్వులా అనిపించింది. మనమెలా ఆలోచిస్తే మనచుట్టూ ఉన్నవి అలాగే కనిపిస్తాయనుకొని ఇంటి లోనికి వెళ్ళి సరాసరి తన గదిలోనికి వెళ్ళి తలుపేసుకుంది.
ఉదయం నుంచి రాత్రి వరకు బతుకు హడావిడిలో బాధని గుండెమాటున కట్టి పడేయగలుగుతుంది. గదిలోనికి అడుగు పెట్టిన తర్వాత తెరుచుకునే గుండె తలుపులను ఆపలేక పోతుంది. తన కళ్ళు యథాలాపంగా చూస్తూ, "ఎన్నో పెను ఉప్పెనల తగాదాలకి తీపితీర్పులు చెప్పిన ధర్మాసనం., తన దాంపత్యాన్ని పండించిన మాగాణి., జ్ఞాపకాల నేలమాళిగ గదిలా అయిపోయింది" అని నిట్టూరుస్తూ ప్రేమగా మంచాన్ని తడిమింది. ఎప్పట్లానే తన మనసు కొద్ది నెలల క్రితం మాధవ్ అన్న చివరి మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంది.
"రాధా!! ఎన్ని బాధలు, సంతోషాలు, జయాపజయాలు పంచుకున్నాం. కాని పదేపదే కోరి నే వేడుకున్న మొదటి కోరిక తీరనేలేదు" అన్నాడు మాధవ్ కినుకుగా. "అలా అంటారేంటండి!! మొదటి సారి మీరడిగినప్పుడు పెళ్ళైన కొత్తరోజులు, మనమింకా సెటిల్ అవ్వలేదు., తర్వాత ప్రెగ్నెన్సీ, పిల్లలు వాళ్ళ పెంపకం ఎప్పుడూ కుదరలేదు. అన్నీ బాధ్యతలు తీరాయి అనుకుంటే, ఇదిగో మీరిలా...." మాధవ్ కళ్ళలో కి చూస్తు తన కళ్ళలోకి పరుగున వస్తున్న నీటిని కనురెప్పల మాటునే అదిమి అడ్డుకట్ట వేసింది రాధ. "మీరిలా!! అని ఆగిపోతావేం? ... లంగ్ క్యాన్సర్ అని అను.
నిజాన్ని నోటితో అనడానికి భయపడి, బ్రాంతిలో బ్రతకకూడదు రాధా!! ఏదేమైనా నా కోరిక ఇక తీరదు" నిష్టూరంగా అన్నాడు మాధవ్. "అయినా మీకు ఎన్నో సార్లు చెప్పాను నాకు ఈ పిల్లలతో కుదరట్లేదు., మీరు వెళ్ళిరండి అని, వింటేనా!?. " అనునయంగా అంటూ మాధవ్ చేతికి టాబ్లెట్ ఇచ్చింది. "ఆ అందమైన అనుభూతిని, ఆ ఆత్మానందాన్ని నీతో కలిసి అనుభవించాలన్నదే నా అసలు కోరిక.." అన్నాడు చిన్నగా నవ్వుతూ. "ఇప్పటికైనా మించిపోయిందేముంది?! మీరు కోలుకోండి, కలిసే వెళ్దాం.." నిబ్బరాన్ని నటిస్తూ ఆశగా అంది రాధ. "రాధా!! నిబ్బరాన్ని నటిస్తే ఎలా? నిబ్బరంగా జీవించడం నేర్చుకో. నీ కనురెప్ప కదలికలు కూడా తెలిసిన నా ముందు ఆ కళ్ళలో ఏముందో తెలియదా? అయినా పిచ్చి రాధా!! ఎందుకింత నమ్మకం! అది కుదిరే పని కాదు.కలిసుండటం అంటే ఒకరితో ఒకరు ఉండటం కాదు ఒకరిలో ఒకరు ఉండటం. నువ్వు ధైర్యంగా ఉంటే నాకదే చాలు." అన్నాడు మాధవ్ లాలనగా..
చ్ కిచ్ కిచ్ మన్న శబ్ధంతో రాధ ఈ లోకంలోకి వచ్చింది. ఆ శబ్దం తన పడక గది దగ్గరగా ఉన్న పారిజాత చెట్టు మీద ఉన్న చిలకల గూడులోనిది. ఇంట్లో అల్మరాలు కట్టగా మిగిలిన చిన్న చిన్న చెక్కలతో మూడు గూడులు తయారు చేసి చెట్టుకు అక్కడక్కడ వేలాడదీశాడు. కొత్తగా ఏ చిలకో కాపురానికొచ్చినట్టుంది. నా ప్రాణం మట్టుకు రెక్కలు కట్టుకుని ఎగిరెళ్ళిపోయింది అనుకుని ఒక నిస్సారపు నవ్వు నవ్వింది. వ్యధ ఊయలలో ఊగుతున్న ఆమె కనులు ఆ ఆలోచనలలోనే అలసి త్వరగా నిదురలోనికి జారుకున్నాయి. గుండె తడుతున్న శబ్దానికి ఆమె నాలుగు గంటలకి ముందే లేచింది తన బ్యాక్ ప్యాక్ లో కావలసిన సామాన్లన్నీ సర్దుకుంది.
మాధవ్ పది సంవత్సరాలు క్రితం తెచ్చినది, అక్కడక్కడ ముత్యపు వర్క్ చేసిన తెల్లని చుడీదార్ ఇప్పుడు సరిగ్గా ఆమె దేహాకృతికి సరిపోయింది. కాంతా వర్క్ చేసిన దుప్పట్టా వేసుకుంది దానిని సర్దుకున్న ప్రతిసారి మాధవ్ ప్రేమ పరామళాలు, జవ్వాదిలా ఆమె ముక్కుపుటాలను చేరుతున్నాయి. తను గదినుంచి బయటికొచ్చేసరికి వినయ్ కారు స్టార్ట్ చేసి సిద్దంగా ఉన్నాడు. రాధ కారు ఎక్కి ఎటో చూస్తూ ఆలోచిస్తుంది. "అమ్మా!!......ఏంటమ్మా నువ్వు!! ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటున్నావు మీ ఆఫీసులో అంతా బాగానే ఉందా? అసలు ఎక్కడికెళ్తున్నావో నాకు కూడా చెప్పవా అమ్మా!?" అని ఆప్యాయంగా అడిగాడు వినయ్. "నీకు చెప్పకూడదని కాదు నాన్నా!! నాకీ మధ్య ఎవరికీ ఏది చెప్పాలని అనిపించట్లేదు. ఏదైతే నేను గట్టిగా నమ్ముతున్నానో అదే చేస్తున్నాను. నీకు తెలియడం ఇష్టం లేకపోతే నిన్నెందుకురా దిగబెట్టమంటాను?!. అదుగో, ఉండు! ఆపూ! ఇక్కడ మా వాళ్ళున్నారు ఆపరా!!" తన బ్యాక్ ప్యాక్ చేతిలోకి తీసుకుంటూ అంది రాధ వినయ్ కారు ఆపి కిందకి దిగి, కారు డోర్ తీసి రాధ చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని, అమ్మ వెంట వెళుతూ అక్కడ అందరిని సమన్వయ పరుస్తూ హడావుడి చేస్తున్న ఒకతన్ని గమనించాడు. ఒకామె ఎదురుగా వచ్చి, "మీ అబ్బాయా? రాధగారు" అని వినయ్ వైపు చూస్తూ రాధని పలకరించింది. ఆ ఆప్యాయప్రశ్నకి చిన్న చిరునవ్వుతో సమాధాన పరిచి కొద్దిగా కొంచెం ముందుకి నడిచాడు.
ఆ నడుస్తున్నప్పుడే ఆ సమూహ చర్చలు బట్టి రాధ ఎక్కడికి వెళ్ళబోతుందో అర్థమయింది వినయ్ కి. ఇదివరకు గమనించిన అతన్ని, "మీరు!?" అని అడిగాడు. "ట్రైనర్ నండి" అన్నాడు అతను. "అవునా అండి! నేను రాధ గారి పెద్ధఅబ్బాయిని. "ఈ వయసులో అమ్మని అక్కడ వరకు పర్లేదా!?" అని సంశయాత్మకంగా అడిగాడు. మీ అమ్మగారు అందరి కంటే ఎక్కువగా ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. నేను చెప్పిన ఆహార నియమాలు పాటించారు. అన్నింటి కంటే ఇలాంటి ప్రయాణాలకి కావలసింది 'నేను వెళ్ళాలి, వెళ్ళగలను' అనే దృఢ సంకల్పం, అది మీ అమ్మగారిలో ఉంది. మీరు ఏమీ భయపడకండి. మీ అమ్మగారు రెట్టింపైన ఆనందంతో తిరిగి మీ దగ్గరకి వస్తారు" అని వివరణ ఇచ్చాడు. ఆ మాటలకి కుదుట పడిన వినయ్ రాధకి వీడ్కోలు చెప్పి వెళ్ళి పోయాడు. రాధ ప్రయాణం మొదలైంది.
విమానం, రైలు, క్యాబ్ ఇలాంటి అన్ని ప్రయాణ సాధనాలలో ఆమె ప్రయాణం సాగుతుంది కానీ, ఆమె మనసు మాధవ్ తో పయనిస్తుంది. కళ్ళకి చేరవలసిన గమ్యమే కనిపిస్తుంది. ఆమె చేరవలసిన గమ్యం చేరువలోకి రాగానే, ఉన్ని దుస్తులు ధరించింది. కాళ్ళకి హైకింగ్ బూట్స్ వేసుకుంది. హ్యాండ్ గ్లోవ్స్ తొడుక్కుంది. తలపై టోపి, కళ్ళకి కళ్ళ జోడు పెట్టుకుంది. బ్యాక్ ప్యాక్ భుజాలకి తగిలించుకుంది. ఒక చేతిలో ట్రెక్కింగ్ పోల్స్ పట్టుకుని నడుస్తుంది. దూరం నుంచి వెండి కొండ ధగధగలాడుతూ బంగారు, పగడ వర్ణాలతో కనిపిస్తు అలౌకిక ఆనందంలో ఉన్న రాధకి మల్లెపూల మంచంపై హిమాలయమంతటి తన మాధవ్ గుండెలపై తలవాల్చినప్పుడు, మృదువుగా తన తల నిమురుతూ "రాధా! మనం కైలాస మానస సరోవరానికి వెళ్దామా?" అని మాధవ్ అడిగిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆమె మానస సరోవరం దగ్గరికి వచ్చింది. నీలం వర్ణంలో కనబడుతున్న సరోవరం మరికాస్త దగ్గరికి వెళ్ళేసరికి పచ్చని మరకత వర్ణంలా కనిపిస్తుంది. ఉదయం మూడు గంటలయినందు వలన దేదీప్యమానమైన కాంతులు ఆ కైలాస పర్వతం నుంచి సరోవరంలోకి వెళుతున్నాయి. కొంతమంది స్నానమాచరించి ధ్యానం చేస్తున్నారు. సరోవరం దగ్గరికి వెళ్ళిన రాధ గుండెతడి లేపినట్టు ఒక్కసారిగా, "ఎందుకు నన్ను వదిలివెళ్ళావు? నేను ఎలా బ్రతకగలననుకున్నావు? నేనెవరితో నవ్వాలి, పోట్లాడాలీ. నీ ఇష్టం, నీ ఇష్టం అంటూ నువ్వు తప్ప ఏదీ ఇష్టం లేకుండా చేసావు. బాధ్యతల బండరాయిలు మోస్తున్నామని నీ కోరికను పక్కన పెట్టమన్నాను. ఎందుకంటే? ఎప్పటికైనా వెళ్తాం అని. కానీ, నువ్వు నన్ను విడిచి వెళతావని నేను కలలో కూడా అనుకోలేదు.
ఇదిగో చూడు!! నువ్వు కోరుకున్నది.." అని గుండెల్లో దాచుకున్న లాకెట్ ని మధ్యగా తెరిచి అందులో ఉన్న మాధవ్ ఫోటో మానస సరోవరానికి ఎదురుగా పెట్టి భోరుభోరున ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడానికి వారితో వచ్చిన ఒకామె వెళ్ళబోతుంటే అక్కడే ఉండి జరుగుతున్నదంతా గమనిస్తోన్న ఒక సాధువు వద్దు అన్నట్టుగా సైగలతోనే వారించాడు. రాధ కాసేపటికి ఏడుపాపింది. ఆశోక వనంలో సీతలా నిశ్చలంగా కూర్చుంది. మరికాసేపటికి తననుతానే సంభాళించుకొని లేచి నుంచుంది. "ఇన్ని నెలలలో నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు.
ఏమిటి మేడం ఇంతలా డీలాపడిపోయారు?" అని కొంచెం కంగారుగా మరి కొంచెం మీకెమన్నా అయ్యుంటే అనే అర్థం ధ్వనించేట్టుగా అడిగాడు ట్రైనర్. "మీరేం కంగారు పడకండి. ఎన్నాళ్ళనుంచో నాలో నాకే తెలియకుండా గూడుకట్టుకున్న దుఃఖమది. ఇప్పుడు నా గుండెలోని భారం తగ్గింది. అయినా నాకేమవ్వదు. ఆయనతో ఉన్న అనుబంధమే నా ఆసరా, ఆ మరపురాని బంధమే నా బలం" అని చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పి వాక్కు అర్థం కలగలిసి వెలసిన కైలాస పర్వత పరిక్రమణకు ఉపక్రమించింది మాధవే తనైన రాధ...