ఒక శుభ ముహూర్తాన తన పరివారంతో కలసి పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలుకుతుండగా, భోజరాజు రాజ సభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇరవైయ్యవ మెట్టుపై కాలు మోప బోయాడు.ఆ మెట్టుపై ఉన్నసుందర వినోద వళ్ళి అనే బంగారు ప్రతిమ ' ఆగు భోజ రాజా బ్రహ్మ చర్యం, గార్హస్త్యం,వాన ప్రస్ఢం, సన్యాసాలు అనే నాలుగు ఆశ్రమ నియమాలు, మృత సంజీవిని, వైశల్య కరణి, సౌవర్ణ్య కరణీ, క్షుణంగా తెలిసిన విక్రమార్కుని కథ చెపుతాను విను....
ఆరు నెలల పాలన అనంతరం భట్టికి రాజ్య పాలన అప్పగించి దేశాటనకు బయలు దేరిన విక్రమార్కుడు పలు దేశాలలో పర్యటించి, అమరావతి రాజ్య పొలిమేరల లోని అరణ్యంలో ఉన్న దేవాలయ ప్రాంగణం లోని మండపంలో విశ్రమించాడు.అక్కడకు చేరువ లోని ఆశ్రమంలోని ముని ఫలాల సేకరణకు వెళుతూ విక్రమార్కుని చూసి ఆహా ఇంత చక్కటి రూపు రేఖలు, శుభ లక్షణాలు కలిగిన ఇతనిని నేను తిరిగి వచ్చే వరకు స్త్రీ గా మార్చి వెళతాను అనుకుని విక్రమార్కుని స్త్రీ గా మార్చి వెళ్ళి పోయాడు. తన రూపం మారి నందుకు చింతిస్తూ కళ్ళు మూసుకుని మనసులో కాళీ మాతను స్మరించ సాగాడు విక్రమార్కుడు. కొంత సేపటి మరో కుటీరం లోని స్త్రీ మంచి నీరు తీసుకు రావడానికి వెళుతూ స్త్రీ రుపం లోని విక్రమార్కుని చూసి ఆహా ఇంత అందమైన స్త్రీ ఈ కుటీర ప్రాంతంలో ఉండటం మంచిది కాదు అని తలచి తన తపో శక్తితో విక్రమార్కుని పురుషునిగా మార్చి తన దారిన తాను వెళ్ళి పోయింది. తనకు మరలా తన రూపం వచ్చినందుకు కాళీ మాత కు నమస్కరించుకుని, ప్రయాణిస్తూ శోణి పురం రాజధాని అయిన విద్యా కటకం చేరి, పూట కూళ్ళ అవ్వ ఇంట బస చేసి 'అవ్వా ఏం జరిగింది? మీ రాజధాని ఇంత కళా విహీనంగా ఉందేం' అన్నాడు' ఏం చెప్ప మంటావు నాయనా మా దేశ రాజు చంద్ర సేనుడు సంతానం కొరకు ఎన్నో పూజలు చేయగా, రాణి గర్బ వతి అయింది. రేపో మాపో బిడ్డకు జన్మ నివ్వ బోతుంది. గత రాత్రి వన విహారం చేస్తున్న మా రాజు గారు పాము కాటుకు లోనై మరణించారు. భర్తతో పాటు మా రాణి సతీ సహ గమనం చేయ బోతుంది. అందుకే మేము వేదనతో తల్లడిల్లిపోతున్నాం' అన్నది అవ్వ. వెంటనే కాళీ మందిరానికి వెళ్ళి పూజలు చేసి దేవి పాదాల వద్దనున్న కుంకుమను చితి పై ఉన్న రాజు నుదుట పూసి మృత సంజీవిని ప్రయోగించాడు విక్రమార్కుడు. నిద్ర నుండి లేచిన వాడిలా చితి నుండి వచ్చాడు చంద్ర సేనుడు. ఆ దేశ రాజు, ప్రజలు బ్రహ్మ రధం పట్టారు విక్రమార్కునికి.నువ్వు అంతటి వాడివైతే ఈ సింహాసనం అధిష్టించు' అన్నది ప్రతిమ. అప్పటికే ముహూర్త సమయం మించి పోవడంతో తన పరివారంతో వెనుతిరిగాడు భోజరాజు.