సోము, రామూలు 9వ తరగతిలో అత్యంత తెలివైన విద్యార్థులు. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం. సోము చాలా ధనవంతుల అబ్బాయి. తల్లిదండ్రులు ప్రతిరోజూ ఎంతో పాకెట్ మనీ ఇస్తుంటారు. ఆ డబ్బుతో రకరకాల తినుబండారాలు కొని అందరికీ పంచేవాడు. రాము అత్యంత పేద విద్యార్థి. రాము అంటే సోమూకు చులకన. అందుకే చాలా మందిని రాముతో కలవకుండా సోము ప్రయత్నించేవాడు. పైగా రాముపై చెడు ప్రచారం చేసేవాడు.
స్నేహితులకు ఆయా సబ్జెక్టుల్లో ఏమైనా సందేహాలు వస్తే సోము తీర్చకపోయేవాడు. తనకు ఏదో పని ఉందని తప్పించుకునే వాడు. రాము తన స్నేహితులతో కలిసి చదువుకునేవాడు. ఎవరికి ఏ అనుమానం వచ్చినా నివృత్తి చేసేవాడు. ఫలితంగా ఎంతో మంది మామూలు విద్యార్థులు తెలివైన విద్యార్థులు అయ్యారు. ఇప్పుడు వారు 10వ తరగతిలోకి వచ్చారు. సోము తన పుట్టినరోజు సందర్భంగా రామూను తప్ప అందరినీ పిలిచి గొప్పగా పార్టీ ఇచ్చాడు.
ఒకరోజు వాసు అనే విద్యార్థి సోము దగ్గరకు వచ్చి "మనమంతా రేపు ఒక గొప్ప పార్టీకి వెళ్దాం. అది సర్ప్రైజ్." మరునాడు సాయంత్రం వాసుతో పాటు సోము వెళ్ళాడు. అది శేషు వాళ్ళ ఇల్లు. స్నేహితులు అంతా కలిసి రాముకు ముందుగా చెప్పకుండానే శేషు వాళ్ళ ఇంట్లో రాము పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. "ఇదంతా ఎందుకు?" అని అడిగాడు రాము. "నీ ప్రోత్సాహం వల్ల చదువురాని ఎంతో మంది విద్యార్థులు తెలివైన విద్యార్థులు అయ్యారు. నిరుపేద స్థితిలో ఉండాల్సిన వారి భవిష్యత్తు నీ పుణ్యమా అని మంచి ఉద్యోగాలతో మంచి స్థితిలో ఉండబోతుంది. నీకు వారు ఏమిచ్చినా ఋణం తీరదు. కాబట్టి ఈ పుట్టినరోజు వేడుకలు నీకు చెప్పకుండా ఏర్పాటు చేశారు." అన్నాడు వాసు. అది విన్న సోమూకు జ్ఞానోదయం కలిగింది. స్నేహానికి ధనిక పేద తారతమ్యాలు ఉండవని, కావలసింది మంచి మనసు అని తెలుసుకున్నాడు. తనకు వచ్చిన విద్య నలుగురికి పంచితే ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలుసుకున్నాడు. రామూతో తనను క్షమించమని కోరాడు. పుట్టినరోజు సందర్భంగా రాము అభిరుచికి తగ్గట్టుగా స్నేహితులు విలువైన పుస్తకాలను కానుకగా ఇచ్చారు. సోము కూడా రాముకు మంచి స్నేహితుడు అయినాడు.