ఉప్పెన! - రాము కోలా

Surge

"మాధవా!" "ఒరే మాధవా!" "నీతో మాట్లాడాలని ఉందిరా!" "నీకు వీలౌతుందా!" నాన్న గొంతు చాలా దగ్గరగా వినిపిస్తుంది. దిగ్గున లేచి కూర్చున్నా! ఎదురుగా నాన్న చిరునవ్వుతో! ఎప్పటిలాగే తెల్లని బట్టలతో.. గోడమీద పుటోలో చిరునవ్వుతో.. గోడకు వ్రేలాడే గడియారం సమయం తెల్లవారు జాము నాలుగు చూపుతుంది.. చాలా రోజుల తర్వాత నాన్న నాతో మాట్లాడాలి అనుకోవడం ఎందుకో నాకు అర్థం కాలేదు?

వెళ్ళి నాన్న గదిలో లైట్ వేసాను! నాన్న రోజు వ్రాసే డైరీ ముప్పై సంవత్సరాలుగా అక్షరం ముక్క కూడా వ్రాయకుండా అలాగే ఉంది !

ప్రేమగా డైరీ చేతిలోకి తీసుకున్న క్షణం.. నాన్న స్పర్శ చేతిని తాకిందేమో అనిపించింది. నాచూపులు ఒక వాక్యం దగ్గర ఆగి ముందుకు కదలడం లేదు.... నాన్న డైరీ తిరగేస్తుంటే.... "ప్రకృతికి ఎందుకో ఇంత కోపం"నాన్న చేతి వ్రాత ముత్యాల్లా మెరిసిపోతూ కనిపిస్తూ నన్ను గతం లోనికి లాక్కెళ్ళింది. నాన్న ఒడిలో కూర్చుని , చెప్పే ఊసులు వింటూ గడుపుతున్న రోజులు అవి ప్రకృతి ప్రకోపానికి మనిషి విలవిల్లాడి పోతూ,చెట్టుకు ఒకరు పుట్టుకు ఒకరుగా చీలి పోయిన రోజు గుండెలను పిండేసేలాంటి వార్త రేడియోలో విన్నరోజు జ్ఞాపకం అనుకుంటా అది...... నవంబర్‌ 19అనుకుంటా.... పచ్చని పంట పొలాలు నవ వధువులా కళ కళ్ళాడుతున్నాయి.

బహుశా తెల్లారితే ఉప్పెన గురించి వినవలసి వస్తుందని.... దివిసీమ చరిత్రలో చీకటి అధ్యాయం నెలకొన్న రోజుగా మిగులుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు... ప్రశాంతంగా ఉన్న దివిసీమపై వరద ఉగ్ర రూపంతో విరుచుకు పడుతుందని తెలియకో ఏమో అమ్మ పొత్తిల్లలో పసి హృదయాలు ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ..... చినుకు చినుకు వరదగా మారి గోదావరి ఉప్పొంగుతుందని మొదటిసారిగా తుపాను గురించి రేడియోలో హెచ్చరికలు ...... అంతగా ప్రభావం చూపదేమోలే అనుకునే వారు కొందరైతే , వరద విళయతాండవం చూడవలసి వస్తుందేమో అనే భయంతో దేవున్ని తలచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు చేరుకునేది కొందరు.

సొర్లగొంది తీరప్రాంత గ్రామాల్ని వరద నీరు తాకుతుంది,ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ అధికారులు.చర్యలు చేపడుతున్నారు అనేది రెండవ సారి వెలువడిన వార్త.... ప్రజల్లో భయం మొదలైన మొదటి క్షణం.... నాగాయలంక మండలం సొర్లగొంది తీరప్రాంత గ్రామాలన్ని వరద నీటిలో కలిపి పోయాయని . . మూడవసారి అందిన విషాద వార్త.... అర్ధరాత్రి ...కంటికి కనిపించని వరద.... ఎటు వెళ్ళాలో తెలియదు.... ఎక్కడ తల దాచుకోవాలో తెలియదు..... కట్టలు తెంచుకున్న వరద ప్రవాహం గ్రామాలపై విరుచుకు పడుతుంది.... జాగ్రత్త ఉండాలని రేడియోలో పదే పదే వినిపిస్తోంది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కనులముందరే తల్లిదండ్రులు కొట్టుకు పోతుంటే హృదయ విధారకంగా రోదించే పసి హృదయాల ఆక్రందనలు మృత్యుఘోషలో కలసిపోతున్నాయ్ ..

ఎందరో మృత్యు వాత పడ్డుతున్నారని ... చిమ్మ చీకట్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో అనేకమంది కొట్టుకు పోతూన్నారని.. ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదులుతున్నారని.... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తూనే ...ఉంది. గంటకు 200 కిలోమీటర్లు వేగంతో వీస్తున్న గాలులకు ...పశుపక్ష్యాదులు సైతం మృత్యు వాత పడుతున్నాయ్ భారీ వృక్షాలు సైతం నేలకొరిగి పొతున్నాయ్... విద్యుత్‌ స్తంభాలు విల్లుల్లా వంగిపోతున్నాయ్. గ్రామం మొత్తం వరదతో నిండి పోయింది...

గడ్డి వాములు మిద్దెలు ఎక్కేస్తున్న జనం. తాజా సమాచారం.... శవాలు గుట్టల మధ్య తమ వారి ఆనవాళ్లను వెతికేందుకు నానా కష్టాలు పడాల్సిన వస్తుందని ఎందరో తల్లిదండ్రుల రోధనలతో ప్రాంతం మరు మ్రోగుతుందని సహాయక చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు అందినట్లు సమాచారం.

రామాలయం, పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్న కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యలో కాస్త సంతోష కరమైన వార్త...ఇది చీకట్లను చీల్చుకుంటూ ఉదయ భానుడు రాలేక రాలేక పైకి వస్తున్నాడు.మూడు రోజుల అనంతరం ఇంతటి విషాదం చూడ లేక... ప్రజలకు అండగా ప్రభుత్వ రంగ సంస్థలు , ఉప్పెనలో అన్నీ కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయ్, అందిన వార్త ఎటు చూసినా శవాల గుట్టలే..

ఇసుకతో మేట వేసిన పచ్చని పొలాలు కుళ్ళిన మృతదేహాలతో భయంకరంగా మారిన నేలపై కాస్త చోటు కనిపిస్తే పోలీసులు సామూహికంగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని వార్త. ప్రభుత్వం నిరాశ్రయులకు ఆహార పదార్థాలు.విమానం ద్వారా అందించేందుకు సైన్యం సహాయం కోరిందని. ప్రజలు ధైర్యంగా సమిష్టిగా ఉండాలని తాజా వార్త రేడియో ద్వారా... తల్లి దండ్రులు లేక అనాధలుగా మిగిలిన చిన్నారులు విలపిస్తున్నారు.

ప్రభుత్వం వారం రోజులు సంతాప దినంగా ప్రకటించింది.. దివిసీమ శవాల దిబ్బగా మారింది. ఇక అక్షరాలు లేవు.... చెరిగిన సిరా అక్షరాలు....అంటే నాన్న కన్ను చెమర్చిందేమో....అవును అంతటి ప్రళయం చూసిన కన్ను చెమర్చదా.... గాలికి గోడకు తగిలించిన క్యాలెండర్ ఊగుతుంటే 19వ తారీఖు కనిపిస్తుంది నా కంటికి.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు