ఓ శుభ మహుర్తాన పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలుకుతుండగా, తన పరివారంతో రాజ సభలో ప్రవేసించి విక్రమార్కుని బంగారు సింహాసనానికి నమస్కరించి, దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ ఇరవై ఏడో మెట్టు పై కాలు మోప బోతుండగా, ఆ మెట్టు పై ఉన్న బంగారు సాల భంజికం మాణిక్య వళ్ళి 'ఆగు భోజ రాజా సాహాసం చేయక దాన వీర పరాక్రమాల లో విక్రమార్కుడు ఎంతటి వాడో తెలిపి కథ చెపుతాను విను...
విక్రమార్కుడు కొలువు తీరి ఉండగా సభలో ఓ వ్యక్తి ప్రవేసించి 'జయము జయము ప్రభువులకు నా పేరు రత్నశేఖరుడు.నేను అమరావతి నివాసిని తమకు కొన్ని రత్నాలు అమ్ముదామని వచ్చాను' అని తన చేతి లోని రత్నాల సంచి విక్రమార్కునికి అందించి వెల చెప్పి తనకు చూపించిన ఆసనం పై కూర్చున్నాడు. రత్నాలు పరిశీలించిన విక్రమార్కుడు' ఇవి మేలు జాతి రత్నాలు మీరు అడిగిన ధర న్యాయమైనదే, ఇటు వంటివే మరి కొన్ని ఉంటే తీసుకు రండి తప్పకుండా కొనుగోలు చేస్తాం' అన్నాడు. 'ప్రభూ ఇంటి వద్ద మరో ఎనిమిది రత్నాలు భద్ర పరచి వచ్చాను, వచ్చే పున్నమి నాటికి వాటితో వచ్చి తమరిని దర్శించుకుంటాను. అని తనకు రావలసిన ధనం పొంది వెళ్ళి పోయాడు రత్నాల వ్యాపారి. మరు పున్నమి నాటికి రత్నాల వ్యాపారి రాజ సభలో ప్రవేసించి, నాలుగు రత్నాలు విక్రమార్కునికి అందించాడు. అవి చూసిన విక్రమార్కుడు' వ్యాపారి ఎనిమిది రత్నాలు తెస్తాను అని నాలుగు రత్నాలే తెచ్చారే?' అన్నాడు. 'ప్రభు దారిలో నదీ ప్రవాహం ఉధృతిగా ఉన్నకారణాన నావ నడిపే వారు ఎవరూ ముందుకు రాలేదు. నేను వారికి నా పరిస్ధతి వివరించి నది దాటించమని అడిగితే, రాను పోనూ నావ వారు నాలుగు రత్నాలు తీసుకున్నారు. ఇంటి వద్ద నా తల్లి గారికి అత్యవసర చికిత్స చేయించాలి అందుకే వారి నిబంధనకు ఓప్పుకున్నాను. అన్నాడు రత్నాల వ్యాపారి. 'వ్యాపారి ఎనిమిది రత్నాల ధనం తీకు వెళ్ళి మీ అమ్మ గారి ఆరోగ్యం గమనించండి' అని అతనికి ధనం ఇచ్చి సాగ నంపాడు విక్రమార్కుడు.
ఇంతలో ఓ పండితుడు సభలో ప్రవేసించి 'మహా రాజులకు విజయోస్తూ రాజా నేను నా కుమార్తె వివాహం తల పెట్టాను అన్ని కుదిరాయి కాని మగ పెళ్ళి వారు రత్నాల హారం అడుగుతున్నారు తమరే పెద్ద మనసుతో ఆదుకుని నా బిడ్డ వివాహం జరిపించాలి' అన్నాడు. భట్టికి తన చేతి లోని రత్నాలు అందిస్తూ 'ఈ విప్రునికి ఈ రత్నాలతో హారం చేయించి యిస్తూ, వేయి మెహిరీలు ఇచ్చి అతని గ్రామం వరకు భటులను తోడు పంపండి' అన్నాడు విక్రమార్కుడు.' భోజ రాజా నీవు అంతటి దాన శీలివైతే అడుగు ముందుకు వేయి' అన్నది బంగారు సాల భంజికం.
అప్పటికే ముహుర్త సమియం మించి పోవడంతో తన పరివారంతో వెను తిరిగాడు భోజ మహారాజు.