"ఏమండీ! మన పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది కదా! ఈ పెళ్ళిరోజును మనం మన రాజధాని నగరంలో సెలబ్రేట్ చేసుకుందాం. హైదరాబాదులో చూడ వలసిన ప్రదేశాలు అన్నీ చూద్దాం. స్టార్ హోటళ్ళలో మనకు ఇష్టమైన ఫుడ్స్ తిందాం. షాపింగ్ చేద్దాం. సినిమా చూద్దాం. లైఫ్ లాంగ్ గుర్తుండే విధంగా ఈసారి పెళ్ళి రోజును సెలబ్రేట్ చేసుకుందాం." అన్నది శ్రీలక్ష్మి. "నీ ఐడియా బాగానే ఉంది. కానీ ఎంత డబ్బు అవుతుందో!" అన్నాడు రాంబాబు. "ప్రతి సారీ ఖర్చు పెడతామా ఏంటి? ఈ ఒక్క సారికి ఎంత ఖర్చు అయినా సరే జీవితాంతం గుర్తుండి పోయేలా సెలబ్రేట్ చేసుకుందాం " అన్నది శ్రీలక్ష్మి. "సరేలే! ఒప్పు కోక పోతే ప్రాణం తీయవూ?" అన్నాడు రాంబాబు. "ఏమండీ! మీతో టు వీలరుపై లాంగ్ జర్నీ చేయాలని ఉంది." అన్నది శ్రీలక్ష్మి. "మన ఊరి నుంచి 60 కిలో మీటర్లు ఉంటుంది హైదరాబాద్. పైగా సిటీలో చాలా తిరగాలి. అస్సలే వద్దు." అన్నాడు రాంబాబు. "మరీ ఇంత పిరికి తనం పనికి రాదు. ఎంతో మంది టు వీలర్లపై వెళుతున్నారు కదా! మీరెందుకు ఇలా పిరికి వెధవలా తయారు అయ్యారు." అంటూ మొదలు పెట్టి, పది ఇండ్లకు వినబడేలా తిట్ల దండకం అందుకుంది. కరోనా కాదు దాని బామ్మ వచ్చినా తట్టుకో వచ్చు కానీ శ్రీలక్ష్మికి కోపం వస్తే ఆపడం చాలా కష్టం.
విధిలేక రాంబాబు ఒప్పుకున్నాడు. రాంబాబు తన బావ మరిది హనుమంతును పిలిపించి, తన పిల్లలను చూసుకోమని చెప్పి, భార్యతో టు వీలరుపై బయలు దేరాడు. "మరీ ఇంత నిదానమా? డెబ్బై స్పీడ్ అయినా మెయింటైన్ చేయాలి. అప్పుడే మీకు ముసలి తనం వచ్చిందా?" అన్నది శ్రీలక్ష్మి. అవమానం భరించ లేక స్పీడ్ పెంచాడు రాంబాబు. "ఏమండీ! మీరే కనుక యంగ్ అయితే ఆ గరుడ బస్సును ఓవర్ టేక్ చేయాలి." ఇలా అడుగడుగునా నస పెడుతూ రాంబాబుకు కఠిన పరీక్షలు పెడుతుంది శ్రీలక్ష్మి. దేవుడు ఇంత త్వరగా తనను పిలిపించుకుంటాడని అనుకో లేదు అని మనసులో అనుకున్నాడు రాంబాబు. "అంత త్వరగా ప్రాణం ఏమీ పోదు లేండి. యముడు మీ ప్రాణాలను తీసుకుని వెళ్తుంటే అడ్డు పడిన మరీ మిమ్మల్ని బ్రతికించుకుంటా. నేనసలే సతీ శ్రీలక్ష్మి." అన్నది. నా మనసులోని మాటలు ఎలా వినిపించాయా అనుకున్నాడు. హాయిగా త్వరగా నరకానికి వెళ్ళే అదృష్టం కూడా లేదా? భూలోకంలో నాకు ఎన్నాళ్ళు ఈ కష్టాలు?" అనుకున్నాడు రాంబాబు. యమ ధర్మరాజా! ఎంతైనా నువ్వే గ్రేట్ అన్నాడు రాంబాబు. ఆ మాటలు యమ ధర్మరాజు కు వినిపించాయి. "ఆహా! నన్ను గ్రేట్ అన్న అతీ కొద్ది మానవులలో నువ్వూ ఒకడిని. ఈరోజు నీ జోలికి రాను. నీ ప్రయాణం సుఖమయం అగుగాక" అని దీవించాడు యముడు. రాంబాబు మీద యముడికి కనికరం లేనట్టుంది.
హైదరాబాద్ చేరుకున్నారు. "ఏమండీ! ఆ హొటల్ ఎంత హైకెక్కుగా ఉందో! ఆ హోటల్ ముందు ఆపండి. మంచి టిఫిన్, టీ తీసుకుందాం." అన్నది శ్రీలక్ష్మి. అక్కడ పార్కింగ్ లేదు. "బండి ఎక్కడ ఆపాలి?" అన్నాడు రాంబాబు. "ఎక్కడో ఓ చోట ఆపండి. అది కూడా సమస్యేనా" అంది శ్రీలక్ష్మి. "అదిగో అక్కడ ఖాళీ ఉంది. ఆపండి." అన్నది. రాంబాబు శ్రీలక్ష్మి చెప్పిన చోట పార్కింగ్ చేశాడు. టిఫిన్ చేసిన తర్వాత మార్నింగ్ షో సినిమా ప్లాన్ వేసుకున్నారు. "సినిమా ఎక్కడ చూద్దాం.?" అన్నాడు రాంబాబు. "ఐమాక్సులో చూద్దాం." అన్నది శ్రీలక్ష్మి. మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చిన చోటల్లా "ఆ సిగ్నల్స్ పట్టించుకుంటే ఇక సినిమాకు వెళ్ళినట్లే. ఆగకుండా త్వరగా వెళ్ళండి." అని ఒకటే నస. "అస్తమానం నెత్తి మీద ఆ హెల్మెట్ ఏమిటి? తీసెయ్యండి. హెల్మెట్ నెత్తి మీద ఉంటే చెమటలు పట్టి మీ ముఖం జిడ్డు ముఖం అవుతుంది. ఆ హెల్మెట్ నా చేతికి ఇవ్వండి. పెట్టుకుంటా. పతి కోసం ఎంత సాయం అయినా చేస్తా." అన్నది. ఆహా! ఏమి పతిభక్తి? సతీ శ్రీలక్ష్మి అనుకున్నాడు. సినిమా చూడటం అయి పోయింది. "ఇప్పుడు ఏం చేద్దాం." అన్నాడు రాంబాబు. "పెద్ద పెద్ద షాపుల్లో షాపింగ్ చేద్దాం. మంచి మంచి చీరలు కొనాలి. మళ్ళీ మళ్ళీ రాలేం కదా!" అన్నది శ్రీలక్ష్మి. ఒక ప్రముఖ దుకాణానికి వెళ్ళారు. అక్కడ ఏమీ కొన లేదు. బయటికి వచ్చారు. "అదిగో అక్కడ చూడండి. మంచి షాపు కనబడుతుంది. అక్కడికి వెళ్దాం " అన్నది శ్రీలక్ష్మి. "ఆ షాపు దగ్గరే కదా! మళ్ళీ బండి తీయడం ఎందుకు. పైగా వెనక్కి తిప్పి, రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. నడుచుకుంటూ వెళ్దాం." అన్నాడు రాంబాబు. "అది దగ్గర ఉందా? అంత దూరం వెళితే నా కాళ్ళు కంది పోయాయి. చెమట పట్టి, మేకప్ పోతుంది. నా కోసం రిస్క్ తీసుకోలేరా? రాంగ్ రూట్లో అయినా సరే వెళ్దాం." అన్నది శ్రీలక్ష్మి. ఎన్నో షాపులు తిరిగి, అనేక చీరలు కొన్నాక రాత్రి డిన్నర్ చేసి, ఇంటికి బయలు దేరారు. అర్థరాత్రి ఇంటికి చేరారు.
మరునాడు శ్రీలక్ష్మి తన తమ్ముడు హనుమంతుకు అంతకు ముందు రోజు జరిగిన విశేషాలు చెబుతుంది. "ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మీ బావగారు ఎంత ధైర్యవంతులో! మా జంట ఎంతోమందికి ముచ్చట అనిపించింది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల అందరి కళ్ళు మా మీదే. వారి కళ్ళు పేలిపోనూ! మా మీద వారి దిష్టి బాగా సోకింది. మా జంట ముచ్చటగా అనిపించిందేమో? ఎంతో మంది ట్రాఫిక్ పోలీసులు మా ఫోటో తీసుకున్నారు. అవి మాకు పంపిస్తే ఎంత బాగుంటుంది." అన్నది శ్రీలక్ష్మి. ఉలిక్కి పడ్డాడు హనుమంతు. "అక్కా! మీ ఫోటోలను ఇప్పుడే చూపిస్తా. గుండె రాయి చేసుకొని చూడు." అన్నాడు హనుమంతు. "అంటే నీ ఉద్దేశ్యం. మా జంట అంత చండాలంగా ఉంటుందా?" అని గుడ్లు ఉరిమి చూసింది శ్రీలక్ష్మి. "బావ గారూ! మీ మొబైల్లో గుగుల్ సెర్చి లో ఈ చలాన్ అని టైప్ చేసి సెర్చ్ చెయ్యండి." అన్నాడు హనుమంతు. ఓపెన్ చేశాక టు వీలర్ నంబర్ ఎంటర్ చేయండి అన్నాడు. రాంబాబు ఎంటర్ చేశాడు. కింద 2+3 ఎంత? అని అడిగారు. "మనం మరీ వెర్రి వెంగళప్పళ్ళా కనబడుతున్నామా? ఈ లెక్క కూడా రాదా? 3 ఎంటర్ చేయండి." అన్నది శ్రీలక్ష్మి. "ఎంటర్ చేయి బావా? ఆ తర్వాత పెద్ద లెక్కలే వస్తాయి. అక్క చేసి పెడుతుంది." అన్నాడు హనుమంతు. ఎంటర్ చేశాడు రాంబాబు. ఆ తర్వాత వచ్చిన లెక్క చూసి మూర్చ పోయాడు. రాంగ్ పార్కింగ్సుకు, అతి వేగానికి, రాంగ్ రూట్ డ్రైవింగుకి, సిగ్నల్ జంపింగ్సుకి, హెల్మెట్ పెట్టుకోనందుకు ఇలా రకర కాల కారణాలతో పడిన ఫైన్ లిస్ట్ పెద్ద నోట్లు రద్దు చేసిన కొత్తలో ఏ టి ఎంల వద్ద ఉన్న లైన్ అంత పెద్దగా ఉంది. అది చూసిన శ్రీలక్ష్మి "ఈ పైన్ డబ్బులు, నిన్న ఖర్చు చేసిన డబ్బులకు కలిపితే ఎంతో బంగారం వచ్చేది. నేనేదో బుద్ధి తక్కువై హైదరాబాద్ వెళ్ళి పార్టీ చేసుకుందాం అంటే చెప్పుకోవడమేనా? ముందు వెనుక ఆలోచించేది లేదా? నా నోరు ముందే మూయిస్తే ఇంత జరిగేది కాదు కదా! మూర్ఛ లోంచి తేరుకోండి. మీ సంగతి చెబుతా అనుకుంది శ్రీలక్ష్మి. పాపం బావగారు అనుకున్నాడు హనుమంతు.