విక్రమార్కుని సింహాసనం అధిష్టించడానికి ఓ శుభమహుర్తాన పండితులు వేదమంత్రాలు చదువుతుండగా,తన పరివారంతో రాజసభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి దానికి ఉన్న మెట్లు ఎక్కతూ పదముడవ మెట్టు చేరేసరికి ఆమెట్టుపైనున్న 'సూర్యప్రకాశవళ్లి' అనే ప్రతిమ 'ఆగు భోజరాజా ఇది మహావీరుడు పరక్రమశాలి అయిన విక్రమార్కుని సింహాసనం. అతని గుణగణాలు తెలిసేలా ఒక కథ చెపుతాను విను...
'కనకపురి' రాజ్యాన్ని 'సుధనుడు' అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానార్ధి అయి ఓ మునిని ఆశ్రయించగా ఆయన సలహా మేరకు నిష్ఠతో కాళీమాతను పూజిస్తూ నేలపైనే నిద్రిస్తూ మాత ప్రసాదమే ఆహారంగా స్వీకరిస్తూ భక్తిగా ఉండసాగారు రాజదంపతులు. వారి పూజలకు మెచ్చిన కాళీకాదేవి ప్రత్యక్షమై 'భక్తా నీ భక్తి శ్రధ్ధలకు సంతసించాను ఏంవరం కావాలో కోరుకో' అన్నది. 'తల్లి నాకు మంచి పేరు తెచ్చే సంతానం అనుగ్రహించు' అని సుధనుడు చేతులు జోడించాడు. వత్సా నీకు సకల గుణ సంపన్నురాలు అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తె జన్మిస్తుంది. కాలక్రమంలో ఆమె వివాహం ఉజ్జయినీ రాజ్యాన్ని పాలించే విక్రమార్కునితో జరుగుతుంది శుభం' అని కాళీమాత అదృశ్యమైయింది.
అలా కాళీకాదేవి వరన జన్మించిన తన కుమార్తెకు 'విచిత్రకళా' అనే పేరు పెట్టి సకల విద్యలు నేర్పించసాగాడు సుధనుడు. యవ్వనవతి అయిన విచిత్రకళ ఉద్యానవనంలో విహరిస్తుండగా, 'మృగాంగధుడు' అనే రాక్షసుడు విచిత్రకళను బంధించి తనతో తీసుకు పోవడానికి ప్రయత్నించగా విచిత్రకళ తప్పించుకుని కోటలోనికి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసిన సుధనుడు 'తల్లి నువ్వు కాళీమాత వరాన జన్మించావు. ఆ తల్లిని పూజించి ప్రసన్నం చేసుకో. ఆ తల్లి దయవలన మనకు అంతా మంచే జరుగుతుంది' అన్నాడు. తండ్రి చెప్పిన విధంగా తని పూజలతో కాళీమాతను ప్రసన్నం చేసుకుని 'తల్లి నాన్ను ఒక మాంత్రికుడు బంధించాలని చూస్తున్నాడు. ఈ ఆపద నుండి నువ్వే కాపాడాలని' వేడుకుంది. 'బిడ్డా ఆ మాంత్రికుడు చాలా శక్తిమంతుడు నువ్వు ఉజ్జయినికి వెళ్ళి అక్కడ రాజైన విక్రమార్కుని శరణు వేడు అంతా మంచే జరుగుతుంది. నీ ఉజ్జయిని ప్రయాణంలో మాంత్రికుడు నిన్ను ఏమి చేయకుండా నేను నీకు కామరూప విద్యలు ప్రసాదిస్తాను కోరిన రూపంలో నువ్వు క్షణకాలంలో మారిపోగలవు శుభం' అని అదృశ్యమయింది కాళీమాత. మరుదినం తండ్రి అనుమతి పొంది కురూపిణిగా మారి ఉజ్జయిని చేరి అక్కడ ధర్మసత్రంలో తనతో వచ్చిన వారితో బస చేసింది. ఆ రాత్రి పౌర్ణమి చంద్రుని చూస్తూ పరవశయై పాట పాడసాగింది. ఆ పాట వినిపించేంతవరకు కమ్మని సుగంధ భరిత పరిమళం వెలువడ సాగింది. మారువేషంలో మంత్రి భట్టితో కలసి నగర పర్యటన చేస్తున్న విక్రమార్కుడు ఆమె పాట విని సత్రం చేరుకుని 'అమ్మాయి రేపు రాజ సభకు రండి మీకు సత్కార సంభావన ఇప్పిస్తాను' అన్నాడు. విక్రమార్కుని మాటలు విన్న విచిత్రకళ తన నిజ రూపం ధరించి తనకు వచ్చిన ఆపదకు కాళీమాత చెప్పిన విషయం వివరించింది. రాజకుమార్తెను తన రాజ మందిరంలో ఉంచి, బేతాళుని ద్వారా మాంత్రికుని ఉనికి తెలుసుకుని అక్కడకు వెళ్ళి తను మాంత్రికుని సంహారించి అనంతరం ఉజ్జయిని చేరి విచిత్రకళను వివాహం చేసుకున్నాడు. భోజరాజా సాహాసానికి ధైర్యానికి మారుపేరైన విక్రమార్కుని తో సమానుడివి అయితే ఈ సింహాసనం అధిష్టించు' అన్నది పదమూడవ ప్రతిమ. అప్పటికే మహుర్త సమయం మించి పోవడంతో తన పరి వారంతో వెనుతిరిగాడు భోజరాజు.