బొమ్మలు చెప్పిన కమ్మని కథలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Akshaya Patra - Bommala Kathalu

శుభ ముహూర్తాన తన పరివారంతో రాజ సభ చేరి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించిన భోజరాజు ఎనిమిది మెట్లు ఎక్కి తొమ్మిదో మెట్టు పైకాలు పెట్టబోతుండగా, ఆమెట్టుపై ఉన్న' ఏకభోగవళ్లి' అనే స్వర్ణ ప్రతిమ "ఆగు భోజరాజా విక్రమార్కుని సింహాసనం పై కూర్చోవాలి అనే కోరిక ఆపదకు దారితీస్తుంది. విక్రమార్కుని పట్టుదలకు బేతాళుడు ప్రశంసించాడు. కాళీమాతనే ప్రసన్నం చేసుకున్న విక్రమార్కుని సాహాస కథచెపుతాను విను....

ఆరు మాసాల పాలన అనంతరం రాజ్యాన్ని భట్టీకి అప్పగించి, బాటసారి వేషంలో దేశాటన చేస్తూ 'శోణిపురం' అనే రాజ్య పొలిమేరలలోని విష్ణు ఆలయం కోనేరులో స్నానమాచరించి దేవుని దర్శించి ఆలయ మండపంలో విశ్రమించాడు విక్రమార్కుడు. అప్పటికే అక్కడ ఉన్న మరో బాటసారి "అయ్య తమరు చూపరులకు రాజవంశానికి చెందిన వారు లా ఉన్నారు. నేను గత పన్నెండేళ్లుగా కామాక్షి దేవిని స్మరిస్తూ, ఈ దారిన వెళ్లే వారందరికి నా కోరిక తెలియజేస్తూ సహాయ పడమని కోరుతున్నా ఎవరు నా కోరిక తీర్చలేక పోతున్నారు, దయతో మీరైనా నాకోరిక తీర్చగలరా? అన్నాడు బాటసారి. "తమరు ఊహించినది నిజమే నేను ఉజ్జయిని ప్రభువు విక్రమార్కుడను, సంకోచించక మీ కోరిక ఏమిటో తెలియజేయండి. నేను తీర్చేప్రయత్నం చేస్తాను" అన్నాడు.

"మహారాజా ఈ దాపునే 'నీలగిరి" అనే పర్వతం దిగువున కామాక్షి ఆలయం ఉంది. ఆ పక్కనే మూయబడిన సొరంగమార్గం ఉంది. వీరుడు, సకల విద్యా పారంగతుడు, శుభ లక్షణాలు కలిగిన సాహాసి ఆసోరంగ మార్గం ముందు ప్రాణత్యాగంచేస్తే, కామాక్షి తల్లి సంతోషించి సొరంగ మార్గంలోనికి వెళ్లడానికి మార్గం ఏర్పరుస్తుంది. ఆ సొరంగం లోపలి గుహలో వెండి, రాగి, ఇనుము, ఇత్తడి, తగరము, సత్తు, సీసము, కంచు వంటి ఎనిమిది రకాల లోహాలను బంగారంగా మార్చే'అక్షయ' పాత్ర ఉంది. అందులోని రసాయనం ఎంతవాడినా తరగదు" అన్నాడు బాటసారి. అతని మాటలు విన్న విక్రమార్కుడు బాటసారితో కలసి కామాక్షి ఆయం చేరి ఆ రాత్రి విశ్రమించారు.

ఆ రాత్రి కలలో విక్రమార్కునికి కనిపించిన కామాక్షి దేవి "వత్స సాహసి, వీరుడు, దానగుణ సంపన్నుడు, నిత్యం ఆదిపరాశక్తిని పూజించే, శుభ లక్షణాలు కలిగిన వ్యక్తి ఆ సొరంగ మార్గంపై రక్తం చిందిస్తే దారి ఏర్పడుతుంది" అని చెప్పి అదృశ్యమైయింది. తెల్లవారుతూనే కోనేటిలో స్నానమాచరించి మీనాక్షి దేవిని పూజించి, ఆ సొరంగమార్గం చేరడానికి బాటసారితో కలసి బయలు దేరాడు విక్రమార్కుడు. బాటసారితో, సొరంగ మార్గం చేరిన విక్రమార్కుడు "తల్లి రక్తం చిందించేందుకు నేను సిద్ధం. ప్రజలకు రాజు తండ్రి వంటి వాడు. ప్రజల కోర్కెలు తీర్చడం నా విధి అందుకు ప్రాణత్యాగానికైనా నేను సిద్ధమే." అన్నాడు కత్తి చేతి లోని కత్తి పైకి ఎత్తాడు. "వత్స ఆగు నీ సేవాభావం, రాజధర్మం, పరోపకార గుణం మెచ్చదగినవే. వెళ్లు సొరంగ మార్గం ఏర్పడుతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకో " అని మీనాక్షి దేవి అదృశ్యమైయింది. సొరంగ మార్గం లోనికి వెళ్లి అక్కడి గుహలో ఉన్న అక్షయ పాత్రను బాటసారికి అందించి తన ప్రయాణం కొనసాగించాడు విక్రమార్కుడు. భోజరాజా అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వము వంటి అష్ట సిధ్ధులు సాధించిన విక్రమార్కుని ఆసనం ఇది. నీవు అంతటి సుగుణ ధీరశాలివైతే, ఈ సింహాసంనపై కూర్చొని పాలనచేయి" అంది తోమ్మిదో స్వర్ణ ప్రతిమ. అప్పటికే ముహుర్త సమయం మించి పోవడంతో, తన పరివారంతో వెను తిరిగాడు భోజరాజు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు