చివరి మాటలు - దార్ల బుజ్జిబాబు

Lost Words

రాఘవయ్యకు పక్షవాతం వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. చూడటానికి చిన్ననాటి మిత్రుడు రామయ్య వెళ్ళాడు. రామయ్య రాగానే రాఘవయ్య కళ్ళలో ఆనందం కనిపించింది. ఏదో చెప్పాలని నోరు తెరవటానికి ప్రయత్నించాడు. నోరు పాక్షికంగా పడిపోయి ఉండటంతో అప్రయత్నంగా కన్నీరు కార్చాడు. ముద్దముద్దగా మాట్లాడ సాగాడు.

రామయ్య, రాఘవయ్య ఒకే ఈడు వారు. మంచి స్నేహితులు. పదో తరగతి దాకా ఒకే పాఠశాలలో చదివారు. పై చదువులు చదివే స్థోమత లేని కారణంగా రామయ్య చదువును ఆపేసాడు. తండ్రి నుంచి వచ్చిన రెండెకరాల భూమికి తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయసాగాడు. వ్యవసాయంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కుటుంబ పోషణకు డోకా లేకుండా గడిచిపోయింది. డబ్బు సంపాదించాలన్న పెద్ద ఆశ కూడా లేని కారణంగా చీకు చింతా లేకుండా ఉంటున్నాడు. అరవై ఏళ్లు వచ్చిన పుష్టిగా, ఆరోగ్యంగా ఉండ గలుగుతున్నాడు. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి తాను చదుకోలేదన్న లోటు తీర్చుకున్నాడు.

రాఘవయ్య అలా కాదు. పది అయిపోయాక పట్నం వెళ్ళిపోయాడు. డిగ్రీ దాకా చదివాడు. పుగాకు వ్యాపారంలో స్థిరపడ్డాడు. రైతుల వద్ద పుగాకు కొని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు. విచ్చలవిడిగా సంపాదించాడు. సంపాదనలో తనను తానే మర్చిపోయాడు. నిరంతరం వ్యాపార లావాదేవీలు ఆలోచిస్తూ నిద్రకూడా పోయేవాడు కాదు. ఎక్కడ ఎంత డబ్బు ఉంది, దాన్ని ఎలా రెట్టింపు చేయాలి? ఎలా కాపాడుకోవాలి అనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఆరోగ్యం గురించి ఆలోచించకుండా సంపాదన పైనే ధ్యాస నిలిపేవాడు. శరీరానికి విశ్రాంతి లేకుండా మానసికంగా పని చేయటంతో షుగరు, బీపీ జంట వ్యాధులు తిష్ఠ వేసాయి. ఉన్న ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించాడు. డబ్బుకు కరువులేక పోవడంతో పిల్లలు ఆడిందే ఆట పాడిందే పాటల పెరిగారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఖరుదైన మోటారు సైకిలు కొని, దాన్ని అతివేగంగా నడుపుతూ రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు ఇటీవలనే చనిపోయాడు. దీంతో భార్య మతి స్థిమితం కోల్పోయింది . చెడు సావాసాలు పట్టి పెద్దవాడు వ్యసనాలకు బానిస అయ్యాడు. వాడిది వేరే లోకం అయింది. ఈ కారణాలతో రాఘవయ్య ఆరోగ్యం రోజురోజుకు క్షించింది. చివరికి కాలు, చేయి, పాక్షికంగా నోరు పడిపోయి దీనావస్థకు చేరాడు.

*** *** ***

రామయ్య, రాఘవయ్య ప్రక్కనే కూర్చున్నాడు. కళ్ళవెంట నీళ్లు కారుతుండగా ముద్దముద్దగా అర్థమైకొంత, అర్ధంకాకుండా కొంత మాటలు చెబుతున్నాడు రాఘవయ్య. దాని సారాంశం ఏమిటంటే "సంపాదనే సంతోషాన్ని ఇస్తుందనుకున్నాను. అదంతా భ్రమ. నీ లాంటి ప్రాణ స్నేహితుని కూడా పట్టించుకోకుండా ధన సంపాదనలో పడ్డాను. జీవితంలో గెలవాలంటే ధనం ముఖ్యం కాదని ఆరోగ్యం ముఖ్యమని తెలుసుకున్నాను. అది తెలుసుకునేటప్పటికి ఇలా జరిగింది. పశ్చాత్తాప పడి మారు మనసు పొందే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. ఇప్పటికే చేతులు కాలిపోయాయి. ఆకులుపట్టుకున్నా ప్రయోజనం లేదు. నేను సంపాదించినదంతా ఖర్చు చేసైనా సరే నన్ను బ్రతికుంచరా రామయ్య" అని వేడుకున్నాడు రాఘవయ్య.

రామయ్య కూడా కన్నీరు కారుస్తూ నిస్సహాయంగా రఘవయ్యను చూడసాగాడు. అంతకు మించి ఏమి చేయగలడు. క్షిణించిన ఆరోగ్యాన్ని తీసుకు రావటం ఎవరి సాధ్యం? కూడ బెట్టిన కోట్ల రూపాయలు ఆరోగ్యాన్ని ఇవ్వగలవా?

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు