ఒక శుభమహుర్తాన పండితులు వేదమంత్రాలు చదువుతుండగా రాజ సభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి ఏడు మెట్లు ఎక్కి ఎనిమిదవ మెట్టుపై కాలు పెట్టబోతుండగా,ఆమెట్టుపై ఉన్న సుందరవళ్లి అనే ప్రతిమ "ఆగు భోజరాజా విక్రమార్కుని సింహాసనం పై కూర్చోనే సాహాసం చేయకు.అతని పరాక్రమం తెలియజేసే కథ చెపుతాను విను....
జ్ఞానశూరుడు అనే మహామాంత్రికుని వధించి బేతాళుని వశపరుచుకుని ఆది పరాశక్తి ఆశీస్సులు పొందిన విక్రమార్కుడు, భట్టికి పరిపాలనా బాధ్యత అప్పగించి, బాటసారిలా మారు వేషంలో పలు దేశాలలో పర్యటిస్తూ భవాని నగర పొలిమేరలలో ప్రవేసించి దాహాంతీర్చుకుని, సమీపంలోని శివాలయ మటంపంలో విశ్రమించాడు. అప్పటికే ఇద్దరు బాటసారులు అక్కడ ఉండటం గమనించిన విక్రమార్కుడు "అన్నలూ మీరు నాలా బాటసారుల్లా ఉన్నారు. మీ ప్రయాణంలో చూసిన వింతల విషేషాలు ఏవైనా ఉంటే చెప్పండి" అన్నాడు. "తమ్ముడు ఇప్పుడు మనందరం ఆపదలో ఉన్నాం, ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులలో ఈ భవాని నగర వాసులు తమవారిని కాకుండా బాటసారులలో ఒకరిని తమ దేవత రుద్ర భవానికి బలిఇస్తారు. త్వరలో రుద్ర భవాని ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కనుక మనం వెంటనే ఈ నగరానికి దూరంగా వెళ్లడం మంచిది" అన్నారు బాటసారులు.
"అన్నలు ఏదేవి, దేముడు బలులు కోరరు. మహిషాసురుని వధించడానికి బయలుదేరిన అమ్మవారికి శివుని త్రిశూలం, విష్ణువు చక్రం, విశ్వకర్మ పరసువు, ఇంద్రుని వజ్రాయుధం, వాయుదేవుని ధనుర్బాణాలు దేవికి ఆయుధాలుగా మారాయి. హిమవంతుడు సమర్పించిన సింహాన్ని అధిరోహించి వరుణ దేవువుడు ప్రసాదించిన శంఖం పూరించి మహిషాసురుని దేవి సంహారించింది. రజో, తమో గుణాలకు ప్రతీకాలైన రాక్షస శక్తులు చండా, యుండా, శుంభ, నిశుంభ, దుర్గయాసర, మహిషాసురులను సత్వగుణానికి అధిదేవత అయిన జగన్మాత సంహారించినందుకు గుర్తుగా ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరిగే పండుగే దేవి నవరాత్రులు" అన్నాడు విక్రమార్కుడు.
"అయ్యా తమరు ఎన్నో వేద పురాణ విషయాలు తెలిసిన వారిలా ఉన్నారు. ఆ తల్లి దుర్గా దేవికి నవరాత్రులలో ఏ పేర్లతో పూజించాలో తెలియజేయండి" అన్నారు బాటసారులు.
"నవరాత్రులలో పలు బొమ్మలతో పాటు దేవతా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మెలకెత్తిన నవ ధాన్యాలను పూజలో భాగంగా ఉంచుతారు. అలా కుమరి పూజ నిర్వహిస్తారు. అందులో రెండేళ్ల బాలిక నుండి పదేళ్ల బాలిక వరకు భోజనానికి పిలిచి, నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పిస్తారు. రెండేళ్ల బాలిక కుమరి రూపం, మూడేళ్ల బాలిక అంటే త్రిమూర్తి స్వరూపిణిగా అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి గా, బాలికల వయస్సు పెరిగే కొద్ది, కల్యాణి, రోహిణి, కాళిక, చండిక, శాంభ, దుర్గ, సుభద్రల వంటి అవతారాలు గా పూజించాలి అని దేవి భాగవతం చెపుతుంది. మార్కండేయ పురాణంలో అమ్మవారి తొమ్మిది రూపాలను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంధ్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిధ్ధధాత్రి అనేవి నవ దుర్గ అవతారాలు" అన్నాడు విక్రమార్కుడు.
ఆ రాత్రి బాటసారులతో కలసి అక్కడే నిద్రించాడు విక్రమార్కుడు. మరు నాడు ఉదయం వేకువనే బాటసారులు వెళ్లిపోయారు. తెల్లవారుతూనే విక్రమార్కుని బంధించి రుద్రభవాని దేవికి బలి ఇవ్వడానికి తీసుకు వెళ్లారు ఆనగర వాసులు. బలికి సిధ్ధం చేసిన వారు "ఓ బాటసారి నీ చివరి కోరిక ఏమిటి" అన్నారు. "అయ్య నేను దేవికి బలికావడం సంతోషమే. నా తలను నేనే కత్తితో తెగవేసుకునే అవకాశం కలిగించండి అదే నా చివరి కోరిక" అన్నాడు విక్రమార్కుడు. "అలాగే ఇప్పటివరకు ఇలా కోరుకున్న వారెవరూ లేరు. తప్పక నీకోరిక తీరుస్తాము" అన్నారు ఆక్కడి ప్రజలు.
చేతిలోని కత్తితో "జైభవాని" అని మెడను తెగవేసుకున్నాడు విక్రమార్కుడు. ఆశ్చర్యంగా, అతని చేతిలోని కత్తి పారిజాత పూమాలగా మారి విక్రమార్కుని మెడలో పడింది. ఆ దృశ్యం చూసిన భక్తులంతా "జైభవాని" అంటూ ఆహాకారాలు చేసారు. ప్రత్యక్షమైన భవాని దేవి "వత్సా నీ సాహసం మెచ్చదగినది. ఏం వరం కావాలో కోరుకో" అన్నది. "తల్లి ధన్యుడను ఈరోజునుండి భూలోకంలో ఎక్కడ బలి ఇవ్వడం అనే అనాచారం జరగకుండా ఉండే వరం ప్రసాదించు అన్నాడు. "తధాస్తు" అని రుద్రభవాని అదృశ్యమైయింది. విక్రమార్కుని కి ఆక్కడి ప్రజలు బ్రహ్మరధం పట్టి వీడ్కోలు పలికారు.
భోజరాజా పరాశక్తి నే మెప్పించే సాహసం, మూఢాచారాలను రూపుమాపే తెగువ నీలో ఉన్నాయా? అంతటి సాహసివే అయితే ఈ సింహాసనం అధిష్టించు" అన్నది ఎనిమిదో బొమ్మ. అప్పటికే ముహుర్త సమయం మించిపోపోవడంతో భోజరాజు వెనుతిరిగాడు.