శుభముహుర్తాన తనపరివారంతో రాజసభలో ప్రవేసించిన భోజరాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి, పదిమెట్లు ఎక్కి పదకొండో మెట్లుపై కాలు మెపబోతుండగా, ఆమెట్టుపై ఉన్న'విద్యుత్ శిరోమణి' అనే స్వర్ణ ప్రతిమ "ఆగు భోజరాజా, ఈసింహాసనం పై కూర్చునే ముందు నేను చెప్పే కథ విను...
విక్రమార్కుడు తన సామంత రాజులు, నగర ప్రముఖుల తో సభతీరి ఉండగా, సభలో ప్రవేసించిన వేగు "మహారాజా 'వారణాపురం' పాలించే 'స్వరూపుడు' 'అరుంధతి' దంపతులకు చాలా కాలానికి ఒక కుమార్తె జన్మించింది. ఆబిడ్డకు 'సద్గుణవతి' అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె అతిలోక సుందరి గా పేరు పొందింది. ఒకరోజు వేటకు వెళ్లిన స్వరూపుడు దారితప్పి అడవిలో తిరుగుతూ, కాళీమాత ఆలయం చేరుకుని విశ్రాంతి తీసుకోసాగాడు. కొంతసేపటికి, ఒక సౌదర్యవతి ఆలయంలో ప్రవేసించి కాళీ మాతను పూజించి ఆలయం వెలుపలకు వచ్చింది. స్వరూపుడు ఆమె అందానికి దాసుడై తనను వరించమని ఆమెను బలవంతం చేసాడు. కోపగించిన ఆమె"మూర్ఖుడా దేవతా స్త్రీలతో పరాచకాలా! అనుభవించు. నువ్వు నీరాజ్య ప్రజలు, నీరాజ్యంలోని ప్రాణ కోటి అంతా పగలంతా నిర్జివంగా పడిఉండి, రాత్రులు సజీవులుగా ఉందురుగాక" అని శపించి వెళ్లిపోయింది.
అలా శాపం పొందిన వారణాపురం సమస్త ప్రజలు పగలు విగత జీవులుగా ఉండి, రాత్రులు సజీవులుగా జీవించ సాగారు. ఒక రోజు రాత్రి సద్గుణవతి వనవిహారం చేస్తుండగా, 'దుర్జయుడు' అనే మాంత్రికుడు ఆమెను తన మాయతో తీసుకువెళ్లి తనను వివాహంచేసుకోమని బలవంతం చేయసాగాడు. "నేను కాత్యాయిని దేవి వ్రత దీక్షలో ఉన్నాను దీక్ష సంవత్సరకాలం పడుతుంది"అని సద్గుణవతి చెప్పింది.
వేగు తెచ్చిన వార్త విన్న విక్రమార్కుడు, తన రాజ్యాన్ని భట్టికి అప్పగించి బేతాళుని సహాయంతో స్వరూపుడు శాపం పొందిన ఆలయం చేరి దేవిని పూజించి" తల్లి లోకపావని నేను తలపెట్టిన ఈ పరోపకార్యం విజయం సాధించేలా నువ్వే నాకు దారి చూపాలి అని వేడుకున్నాడు. అతని పరోపకార గుణానికి, నిస్వార్ధతకు మెచ్చిన కాళీమాత ప్రత్యక్షమై" వత్సా నువ్వు తలపెట్టిన ఈకార్యం నెరవేరాలి అంటే స్వరూపుడిని శపించిన స్త్రీ తన శాపవిమోచన మార్గం చెప్పాలి. మరి కొద్ది సేపటికి ఆస్త్రీ ఇక్కడకు రాబోతుంది. నువ్వు ఆమెద్వారా శాపవిమోచన ప్రయత్నం చేయి విజయోస్తూ"అని అదృశ్యమైయింది.
వెంటనే విక్రమార్కుడు బ్రాహ్మణుడి వేషంలో రోదిస్తూ చితి పేర్చుకుని, ప్రాణత్యాగానికి సిద్ధపడిన వాడిలా నటించసాగాడు. అప్పుడే వచ్చిన ఆదేవతా స్త్రీ "అయ్య తమరు ఎవరు ఎందుకు ప్రాణ త్యాగం చేయబోతున్నారు మీకష్టం నేను తీర్చగలను చెప్పండి"అన్నది.
"తల్లి నాకష్టం తీరుస్తాను అని మాట ఇచ్చావు కనుక ఈనా ప్రయత్నం విర మించుకుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు యుక్తవయసు వచ్చాక వారణాపురిలోని ఓ కన్యతో వాడి వివాహం జరిపించాను. ఎవరి శాపంవలనో నాబిడ్డ పగలు నిర్జీవంగా ఉంటూ, రాత్రులు సజీవంగా గడుపుతున్నాడు. ఇది నాలాంటి వేలమందికి వేదన కలిగించింది. ఆబాధను భరించలేక ఇలా మరణించబోతున్నాను"అన్నాడు.
"అయ్యా ఆవేశంలో స్వరూపుడు చేసిన తప్పుకు అనాలోచితంగా, ఆ రాజ్యంలో అందరిని శపించాను. నేను మీకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం నాశాపాన్ని ఉపసంహారించుకుంటున్నాను, వెళ్లండి ప్రశాంతంగా మీ కుమారుడితో జీవించండి" అని ఆమె వెళ్లిపోయింది. వెంటనే వారణాపురం చేరి జరిగినదంతా స్వరూపునికి వివరించాడు విక్రమార్కుడు. అది విన్న స్వరూపుడు సంతోషించి, అదృశ్యమైన తన కుమార్తెను రక్షించమని విక్రమార్కుని వేడుకున్నాడు.
బేతాళుని ద్వారా మాంత్రికుని స్ధావరం చేరి సద్గుణవతిని కలసి జరిగినది అంతా ఆమెకు వివరించాడు . అది విని రాజకుమారి సంతోషించింది. "రాకుమారి మాంత్రికుడి ప్రాణ రహస్యం ఏమిటో మంచిమాటలతో తెలుసుకో, మిగిలిన విషయాలు నేను పూర్తి చేస్తాను"అన్నాడు విక్రమార్కుడు.
కొంతసమయం తరువాత వచ్చిన మాంత్రికుని చూసిన సద్గుణవతి" వచ్చే పౌర్ణమి నాటికి నా వ్రతం ముగుస్తుంది. నిన్ను వివాహం చేసుకోవడానికి సమ్మతమే! కాని నీ ప్రాణాలకు ఎవరైనా ఆపద తలపెడితే నేను ఎలాభరించెగలను"అన్నది.
"అమాయకురాలా ఈ దుర్జయుని సంహరించడం ఎవ్వరి వల్లకాదు. ఇక్కడకు తూర్పు దిశగా సముద్రందాటి మూడు యోజనాలు వెళితే, అరణ్య మధ్యభాగాన కాళీమాత ఆలయంఉంది. ఆవిగ్రహం పీఠభాగం అడుగున బంగారు దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఆదీపాన్ని ఆర్పగలిగితే నేను మరణిస్తాను. కాళీమాతను ప్రసన్నం చేసుకుని తనంతట తాను ఆమె పక్కకు తప్పుకునేలా చేయగలిగితేనే నాకుమరణం. భయపడక సంతోషంగా వ్రతం పూర్తి చేసుకో" అన్నాడు మాంత్రికుడు.
విషయంఅంతా రాకుమారి ద్వారా తెలుసుకుని, బేతాళుని సహాయంతో అక్కడకు చేరి కాళీమాతను ప్రసన్నం చేసుకుని, పీఠిక భాగాన వెలుగుతున్న దీపాన్నిఆర్పివేసి, రాకుమారిని ఆమె తల్లి తండ్రికి అప్పగించవలసినదిగా బేతాళునికి చెప్పి తను ఉజ్జయిని కి బయలు దేరాడు విక్రమార్కుడు. భోజరాజా నువ్వు అంతటి గొప్ప వాడవు అయితే, ఈసంహాసనం పై కూర్చునే ప్రయత్నం చేయి. లేదా వెనుతిరుగు అన్నది స్వర్ణ ప్రతిమ. మించిపోపోవడంతో భోజరాజు వెనుతిరిగాడు.