సోమరితనం అరిష్టం - సరికొండ శ్రీనివాసరాజు‌

laziness is a sin

అవంతీనగర రాజ్యాన్ని విజయేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడుతూ ఎంతో ధర్మవంతంగా పరిపాలించేవాడు. అతని పరిపాలనే శాశ్వతంగా ఉండాలని ప్రజలు కోరుకునేవారు. విజయేంద్రునికి వృద్ధాప్యం రావడంతో అతని కొడుకైన ప్రతాపుడిని రాజును చేసి, తాను విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ప్రతాపునికి ఒకటే ఆలోచన. రాజుగా తన తండ్రికంటే మంచిపేరు సంపాదించాలని. అందుకే నిరుపేదలకు, బిచ్చగాళ్ళకు విరివిగా దానధర్మాలు చేయాలని అనుకున్నాడు. తన రాజ్యంలో పేదరికం అస్సలు ఉండకూడదు. తన రాజ్యంలోని గ్రామ, పట్టణ అధికారులకు ఖజానాలోని ధనాన్ని పంచివేశాడు. వాటిని నిరుపేదలు, బిచ్చగాళ్ళకు దానం చేయాలని ఆదేశించాడు. మంత్రి సోమనాథుడు ఇందుకు అభ్యంతరం చెప్పాడు. "మహారాజా! కష్టించి పనిచేయడం ధర్మం. కష్టపడి పనిచేసేవాళ్ళకు వాళ్ళ కష్టాన్ని బట్టి ఎంతైనా ఇవ్వవచ్చు. కూర్చోబెట్టి దానధర్మాలు చేస్తే కష్టపడేవారు కూడా సోమరులుగా తయారు అవుతారు. అప్పుడు రాజ్య అభివృద్ధి కుంటుపడుతుంది. సోమరిపోతులం పెరగడం రాజ్యానికి అరిష్టం. కాబట్టి నా మాట విని, ఈ దానధర్మాలు మాని, కష్టించి పనిచేయడాన్ని ప్రోత్సహించండి." అన్నాడు మంత్రి. "ఈ విషయంలో మీ ఉచిత సలహాలు అక్కరలేదు. నాకు ఎక్కడ మంచిపేరు వస్తుందో అన్న ఈర్ష్యతో నాకు ఇలాంటి పనికిరాని సలహాలు ఇస్తున్నారని నాకు అర్థమైంది. మీ పని మీరు చూసుకోండి." అని కఠినంగా బదులు చెప్పాడు రాజు. మూర్ఖులకు హితబోధలు చెవికి ఎక్కవు అనుకున్నాడు మంత్రి.

ధర్మపురం పట్టణ పాలకుడు సుధాముడు. ఇతడు రాజు ఇచ్చిన ధనాన్ని తన దగ్గర ఉంచుకొని కష్టపడి పనిచేసే వారికే వారి కష్టాన్ని బట్టి ఇస్తున్నాడు. నగర అభివృద్ధి ధ్యేయంగా మరియు సోమరితనాన్ని అంతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది నచ్చని సోమరులు కొందరు రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజు తన ఆజ్ఞను ధిక్కరించినందుకం సుధాముని చెరసాలలో బంధించాడు.

ఈ సంఘటనతో సోమరులు రెచ్చిపోతున్నారు. పనిచేసేవారు కూడా సోమరులుగా తయారు అవుతున్నారు. ఖజానా ఖాళీ అయింది. రాజు వద్దకు చిన్న చిన్న ప్రాంత అధికారులు ధనం కోసం బారులు కట్టారు. రాజ్యాభివృధ్ధి కుంటుపడింది. ప్రజలలో రాజుపట్ల వ్యతిరేకత పెరిగింది. రాజ్యం బలహీనమైంది. ఇదే అదనుగా ఎన్నో ఏళ్ళుగా ఆ రాజ్యంపై కన్నేసిన పొరుగు దేశపు రాజు క్రూరసింహుడు అవంతీనగరంపై దండయాత్ర చేశాడు. సునాయాసంగా రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రతాపుని వల్ల ఎప్పటికైనా ప్రమాదం పొంచియుండవచ్చని అతణ్ణి చెరసాలలో బంధించాడు. తన నిర్ణయం ఎంత తప్పో అతనికి అర్థం అయింది. మంత్రి సలహా విని ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదని అనుకున్నాడు. కానీ సమయం మించిపోయింది. అందుకే కష్టించి పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. సోమరితనం రాజ్యానికి అరిష్టం.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు