మరుదినం ఎప్పటిలా తన పరివారంతో శుభమహూర్తాన వేదపండితుల ఆశీర్వచనాలతో విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి ఆరు మెట్లు ఎక్కి ఏడో మెట్టుపై కాలు పెట్టబోయాడు భోజరాజు. అదే మెట్టు పైఉన్న 'నవరత్నావళి' అనే స్వర్ణ ప్రతిమ" ఆగు భోజరాజా ఈసింహాసనం పై కూర్చోవాలి అంటే విక్రమార్కుని లో ఉన్నఈశుభ లక్షణాలు మొదట తెలుసుకో.... మధుర భాషా ప్రియంవరుడు, స్మిత పూర్వాభిలాషి, ప్రసన్నఅంతఃకరణం, ప్రియదర్శకుడు ఆత్మవంతుడు, ఆయ వ్యాయవిభాగజ్ఞుడు, స్ధిరప్రజ్ఞుడు, దీర్ఘదర్శి, నిజాయితీపరుడు, సకలజన సంరక్షకుడు, వివేక విద్యా వినయ సంపన్నుడు, సకల శాస్త్ర పారంగతుడు, సత్పురుషుడు, సర్వలోకేష్టుడు, భక్తిపరుడు, దానశీలి, రూప సంపన్నుడు, ఆజానుబాహువు, సవ్యసాచి, గూఢకత్రువు, ప్రసన్నవదనుడు, పద్మపత్రవాశాలాక్షుడు, పరశ్రీలను తల్లిలా భావించేవాడు, సాధుస్వభావి, ఆదర్శభావాలు కలిగినవాడు, అందరి మంచి కోరేవాడు, అందరిమన్ననలు పొందేవాడు విక్రమార్క మహారాజు ఇతని ఉత్తతత్వం దానగుణం తెలిపేకధ చెపుతాను విను....
ఉజ్జయిని నగర సమీపంలోని కాళీమాత ఆలయంలో త్రికాలవేది అనే మహిమాన్వితుడు అయిన త్రికాలవేది ఉన్నాడని తెలిసి, తన పురోహితుడను పంపి రాజమందిరానికి ఆహ్వానించాడు విక్రమార్కుడు. పురోహితుని తెచ్చిన రాజ ఆహ్వానాన్ని తిరస్కరించిన త్రికాలవేది 'అయ్యా సంచారం చేస్తూ ఏ తల్లో పెట్టిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ కాళిమాత నామస్మరణ తో జీవించే నాకు రాజులతో పని ఏముంటుంది. ఒక వేళ మీరాజు గారికి నాతో ఏదైనా పని ఉంటే వారినే ఇక్కడకు రమ్మనండి' అన్నాడు.
పురోహితుని ద్వారా ఆవిషయం తెలుసుకున్న విక్రమార్కుడు,తను స్వయంగా బయలు దేరి వెళ్లి త్రికాలవేదిని దర్శించి నమస్కరించాడు. విక్రమార్కుని సాదరంగా ఆహ్వానించిన త్రికాలవేది అతని సందేహాలన్ని తీర్చాడు. "స్వామి తమ వయసు ఎంతో తెలుసుకోవచ్చా" అన్నాడు విక్రమార్కుడు. "వత్సా వయసు, సంపద, ఔషదం, మంత్రం, పరస్త్రీ పరిచయం, స్నేహం, దానం,మానం అవమానం. అనే తొమ్మిది లక్షణాలు ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. నేను నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. అది జపిస్తూ, బ్రహ్మచర్యం అవలంభించి, పది విధాల హామాలు ఆచరిస్తే, యాగపురుషుడు ఓ ఫలం ఇస్తాడు. దాన్ని భుజిస్తే సకలవ్యాధులకు దూరమై, ఆయుష్షు ఉన్నంత కాలం నిత్య యవ్వన వంతులుగా జీవించవచ్చు" అని మంత్రం ఉపదేసించి త్రికాలవేది దేశాటనకు వెళ్లి పోయాడు.
త్రికాలవేది చేసిన సూచన మేరకు పది యాగాలు నిర్వహించగా, యాగపురుషుడు ఇచ్చిన పండు స్వీకరించి నగరానికి వెళుతుండగా దారిలో ఓక కుష్ఠిరోగి వేదనతో మూలుగుతూ కనిపించి "అయ్య తమరు ఎవరో దేముడిలా కనిపించారు రెండు రోజులు గా ఆహారంలేదు. వ్యాధి ఎంతో బాధ కలిగిస్తుంది. తినడానికి ఏదైనా ఉంటే ఇచ్చి నాప్రాణాలు కాపాడండి" అని చేతులు జోడించాడు. ఆ రోగ బాధితుని దీనావస్త చూసి మనసు కరిగిన విక్రమార్కుడు, త్రికాలవేది సూచన ద్వారా తనకు లభించిన పండును ఆ కుష్ఠు రోగికి అందించి సంతోషంగా ఉజ్జయినికి విక్రమార్కుడు వెళ్లిపోయాడు.
"భోజ రాజా పరమేశ్వరుని నుండి ఇంద్రునికి, ఇంద్రుని విక్రమార్కుని బుద్ది కుశలతకు మెచ్చి బహుమానంగా ఇచ్చిన నవరత్నఖచిత బంగారు సింహాసనం ఇది. దీనిపై కూర్చోవాలి అంటే నీవు విక్రమార్కుని అంతటి వాడవైతే సింహాసనం ఎక్కడానికి సాహసించు" అంది ఏడో ప్రతిమ. అప్పటికే మహుర్ తసమయం మించి పోవడంతో తనపరివారంతో వెను తిరిగాడు భోజరాజ.