ఒక సాధువుతో,శిష్యుడు కూడా తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఒకచోట పొలిమేర దాటి అడవి ప్రాంతం నుండి వెళుతుండగా శిష్యుడికి కొంచెం దూరంలో సాధు జంతువులతో పాటు పులులు కూడా కలిసిమెలిసి ఉండడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి...“గురువుగారు! ఏమిటీ ఈ వింత” అని అడిగాడు.
“ఒక సారి నేను ఇదే ప్రాంతం గుండా వెళుతుండగా... ఒక ఆవు పడుకుని ఒక దూడకు, రెండు పులి పిల్లలకు పాలు ఇస్తోంది. అది చూసిన నేను నీలాగే ఆశ్చర్యపోయి ఆ ఆవును అడిగినప్పుడు...’ ఒక వేటగాడు పులి చర్మాల కోసం ఈ పులి పిల్లల తల్లిదండ్రులను వేటాడి చంపాడు.ఆ ప్రాంతంలో మేత కోసం వెళుతుండగా ఇవి ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నాయి...అప్పుడు వాటికి పాలిచ్చి ఆకలి తీర్చాను...అప్పటి నుండీ వీటిని నా బిడ్డలుగానే చేరదీశాను’ అని చెప్పింది. ఆ పులి పిల్లలు కూడా ఆవును తమ అమ్మగానే భావించాయి” అన్నాడు సాధువు.
సాధువు, శిష్యుడు ఆ ఆవు,పులులు ఉన్న చోటికి వెళ్లారు. ఆవుతో “బాగున్నావా?” అన్నాడు సాధువు.” ఆ బాగున్నాను నువ్వు కూడా బాగున్నావా?” అంది ఆవు. “అప్పటి పులి పిల్లలే కదా ఇవి!” అన్నాడు సాధువు.
“అవును అవే పెరిగి పెద్దవయ్యాయి....అవి కందమూలాలు తింటూ ఇతర సాధుజంతువులతో కలిసిమెలిసి ఉంటున్నాయి” అని అంది ఆవు. “చాలా సంతోషం” వెల్లివస్తామని సాధువు,శిష్యుడు అక్కడ నుండి బయలు దేరారు.
“ఆ ఆవు దయాగుణం ఎంతో గొప్పది! గురువుగారు” అన్నాడు శిష్యుడు.
“అవును శిష్యా! ఆ పులులు కూడా అంతే విశ్వాసంతో మెలుగుతున్నాయి” అన్నాడు సాధువు