బొమ్మలు చెప్పిన కమ్మని కథలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Bhojaraju Kathalu - Four Gems

ఓ శుభముహుర్తాన పండితులు వేదమంత్రాలు చదువుతుండగా తన పరివారంతో రాజసభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇరవై తొమ్మిదో మెట్టుపై కాలు మోపబోతుండగా, ఆ మెట్టుపై ఉన్న సంప్రదాయవళ్ళి అనే బంగారు ప్రతిమ 'ఆగు భోజరాజా పరోపకారంలోనూ, దానగుణంలోనూ, శౌర్యప్రతాపాలలోనూ నువ్వు విక్రమార్కుడికి సాటి ఎనుకోకు నేను చెప్పేకథవిను....

పూర్వం గౌడదేశంలో పుడరవర్తనం అనే పట్టణంలో ఒక వడ్రంగి, ఒక చేనేత పనివాడు స్నేహంగా ఉండేవారు. యువకులైన ఆ ఇరువురు ఒకరోజు తిరునాళ్ళకు వెళ్ళారు. అక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ దేశ రాజకుమారి సుదర్శిని వచ్చింది. ఆమెను చూసిన నేత యువకుడు ఎలాగైనా రాకుమారిని వివాహం చెసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాకుమారి విష్ణుమూర్తిని తప్ప అన్యులను వివాహం చేసుకోను అన్నదని తెలిసిన నేత యువకుడు దిగులుగా ఉండిపోయాడు.

తన మిత్రుని వేదన గమనించిన వడ్రంగి యువకుడు ఎగిరే గరుడపక్షిని తయారుచేసి 'మిత్రమా దీని సహాయంతో విష్ణుమూర్తి వేషంలో వెళ్ళి రాకుమారిని గాంధర్వవివాహం చేసుకో' అన్నాడు. నేత యువకుడు అలానే వెళ్ళి రాజకుమారిని ఆరాత్రే వివాహం చేసుకున్నాడు.

అలా కొంతకాలం గడచాక,పొరుగు దేశమైన చందన రాజు విక్రమూసేనుడు గౌడదేశంపై దండెత్తబోతున్నాడని తెలిసిన గౌడదేశరాజు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువే తన అల్లుడు అయినప్పుడు తనకు భయమెందుకు అని హాయిగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న నేతయువకుడు తన మిత్రుడు వడ్రంగి యువకుని సలహాతో విక్రమార్కుని కలసి తన సమస్య విన్నవించాడు. చందనరాజుకు వర్తమానం పంపుతూ గౌడదేశ పాలకులు తమ మిత్రులని వారిపై దాడిచేస్తే తను స్వయీంగా రావలసి ఉంటుందని విక్రమార్కుడు తెలియజెసాడు. గౌడదేశరాజు యుధ్ధ ప్రయత్నం విరమించుకున్నాడు.

కొంతకాలం అనంతరం యాగం తలపెట్టిన విక్రమార్కుడు దూర ప్రాంతమైన భువనగిరి రాజు సముద్ర వర్మకు ఆహ్వానం ఒ పండితుని ద్వారా పంపించాడు. ఆహ్వానం అందుకున్న సముద్రవర్మ ఆరోగ్యం సహకరించక రాలేనని నాలుగు విలువైన రత్నాలు విక్రమార్కునికి బహుమతిగా ఇస్తు 'పండితోత్తమా వీటిలో ఒక రత్నం ద్వారా మనకు కావలసినది ఏదైనా ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. రెండో రత్నం ద్వారా మనం కోరుకున్న ఆహార పదర్ధాలు అమృతమయమైన రుచితో లభిస్తుంది. మూడవ రత్నం చతురగ బలాలు సర్వ ఆయుధాలను కోరిన వెంటనే ఇస్తుంది. నాలుగో రత్నం మణిమయ భూషితాలు, దివ్యవస్త్రాలు, సంపదలు ఇస్తుంది అన్నాడు.

నాలుగు రత్నాలతో బయలుదేరిన పండితుడు దారిలో నదీప్రవాహాం వలన ఉజ్జయినీకి ఆలస్యంగా వెళ్ళి, నాలుగు రత్నాలు విక్రమార్కునికి అందించి వాటి విలువ వివరించాడు. 'పండితోత్తమా యాగంలో దానం వలన కోశాగారం ఖాళీ అయింది. కనుక ఈనాలుగు రత్నాలలో ఏదైనా ఒకటి తమరు స్వీకరించండి' అన్నాడు విక్రమార్కుడు.

'ప్రభు నా కుటుంబ సభ్యులను సంప్రదించి రేపు వచ్చి తీసుకుంటాను అన్నాడు. పండితుని కుమార్తె నగలు పట్టువస్త్రాలు ఇచ్చేరత్నాన్ని, పండితుని భార్య ఆహారం ఇచ్చే రత్నాన్ని, సర్వసైన్యాన్ని, ఆయుధాలు ఇచ్చే రత్నాన్ని కోరుకున్నాడు పండితుని కుమారుడు. మరుదినం తమఇంట్లో వారి కోరికలు విక్రమార్కుని తెలిపాడు పండితుడు. 'పండితోత్తమా అలాగైతే నాలుగు రత్నాలు తమరే స్వీకరించండి' అని ఇచ్చి పంపాడు విక్రమార్కుడు.

భోజరాజా అంతటి శౌర్య,దాన గుణం నీలో ఉంటే ముందుకు వెళ్ళు' అన్నది ప్రతిమ. అప్పటికే ముహూర్త సమయం మించి పొవడంతో వెనుతిరిగాడు భోజరాజు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు