"ఈసారి సంక్రాంతి పండగ అంటేనే భయంగా వుంది" అన్నాడు నాయుడు.
"ఏమైంది! ప్రతిసారీ సంక్రాంతి పండగనేసరికి ఎగిరి గెంతుకేసి కోడిపందెలు కోసం కోడిపుంజుల వేటలో వుండేవాడివి, ఇప్పడేమైంది" అడిగింది వెంకటి.
"గత సంక్రాంతి పండగలు వేరు ఇప్పుడు సంక్రాంతి వేరు, ఇది కరోనాకాలం సంక్రాంతి" అన్నాడు నాయుడు.
"బాగుంది! విడ్డూరం, కరోనాకి సంక్రాంతికి ఏటి సంబంధం" అంది వెంకటి.
"ఓసి పిచ్చిదానా కరోనా దాన్నికాదు దీన్నికాదు మొత్తానికి దేన్నీ వదలలేదు కదా!" అన్నాడు నాయుడు.
"అంటే ఏటి!" అంది వెంకటి.
"మనం ప్రతి ఏడాదీ వలస పోయి సంక్రాంతి ముందు వూరు వచ్చేవాళ్ళం, వలస నుండి వచ్చేటప్పుడు నా యాల్ది డబ్బులు చేతిలో గలగల ఆడుతుండేవి, అప్పుడు పులస పులుసు, కోడికూర, బలే బలే మాజాగా వుండేది" అన్నాడు నాయుడు.
"అవును మావ నీకు పులస పులుసు, కోడి కూర గుర్తుకొస్తున్నాయి, నాకైతే మాయమ్మకి మూడుసీరలు, మా అయ్యకి పంచెలు సాపులు లాల్చీ, మా అన్నదమ్ములకీ, అక్క చెల్లిల్లుకీ బట్టలు కొనిపెట్టడం గుర్తుకొస్తున్నాయి" అంది వెంకటి.
"మీయమ్మకీ, మీ అయ్యకీ కాదు ఇప్పుడు మనింట్లో మన పిల్లలకీ, పెద్దలకీ బట్టలు తియ్యడానికే డబ్బులు లేవు" అన్నాడు నాయుడు.
"చెప్పుకోడానికి సిగ్గులా ఉంది సంక్రాంతికి పిల్లలకైనా కొత్త గుడ్డలు కొనలేము అనిపిస్తుంది" అంది వెంకటి.
"అమ్మఒడి డబ్బులు వస్తాయి కదా….! చూద్దాం వాటితోనే పండగ అయ్యేటట్లు వుంది" అన్నాడు నాయుడు.
"నీకు సెప్పడం మర్చిపోయాను, మనకి అమ్మఒడి రాదని టీచరమ్మ అంటున్నారు" అంది వెంకటి.
"అదేటే! పోయినేడాది అమ్మఒడి డబ్బులు వచ్చాయి కదా! మళ్లీ ఇప్పుడమైంది" అన్నాడు నాయుడు.
"పోయినేడాది మనం చెన్నైలో వున్నాం, మన పిల్లలు మీయమ్మ సంరక్షణలో ఉన్నట్లు కాగితం పెడితే అప్పుడు డబ్బులు వచ్చాయి, ఇప్పుడు తల్లి బ్రతికుండగా నాయనమ్మ సంరక్షణ చెల్లదని రూలు వచ్చిందట" అంది వెంకటి.
"మరి ఇప్పడేమి చెత్తావు" అడిగాడు నాయుడు.
"ఇప్పుడు నాకు సంబంధించిన కాగితాలు బడికి ఇవ్వాలి కేవైసీలూ... గీవైసీలూ చేసి మీయమ్మ బియ్యం కార్డు నుండి మన పిల్లల పేర్లు తప్పించి మన కార్డులోకి తెచ్చుకోవాలి, నా ఆధార్ కి మన పిల్లల్న వివరాలు కలపాల… ఇవన్నీ జరిగే సరికి పుణ్యకాలం దాటిపోతాది, డబ్బులైతే వత్తాయి గానీ అమ్మఒడి మొదట విడతలో ఆ డబ్బులు రావు. అవి రెండోవిడతలో వచ్చేసరికి పండగ పోద్ధి" అంది వెంకటి.
"ఓసి నా ఎంకటో….! అమ్మఒడి డబ్బులు వత్తాయి సంక్రాంతి పర్వాలేదు. గతమంత గొప్పగా కాకపోయినా చౌచౌగానైనా జరుపుకుందాం అనుకున్నా" అన్నాడు నాయుడు.
"వలస పోడానికి కరోనా భయం, వున్న ఊర్లో పనులు అంతంత మాత్రమే… చాలా రోజులు లాక్ డౌన్ తరువాత ఇసుక కొరత, తరువాత కాంట్రాక్టర్లు దగ్గర డబ్బులు కొరత, ఇక తీరా పనులు షురూ అయినా మనం చెన్నై వలస పక్షులమని ఎవరూ సరిగ్గా కూలి పనికి పిలవడం లేదు" అంది వెంకటి.
"మేస్త్రీలకి వాళ్ళ దగ్గర ఎప్పుడునుండో పనిజేస్తున్న జట్టులు వుంటాయి కదా! చెన్నై పోయి వచ్చిన మనల్ని మధ్యలో చేర్చుకోడం కష్టం కదా! అన్నాడు నాయుడు.
"నువ్వు చూస్తే జల్సారాయుడువు, చెన్నైలో చేతినిండా పనివుండి, కూలి డబ్బులు గలగలలాడినప్పుడు నాలుగు రూపాయలు పొదుపు చేసుకుందాం అంటే వినేవాడివు కాదు, ఎప్పుడు డబ్బులు అప్పుడే ఖర్చు పెట్టేశావు, కరోనా దెబ్బకి కట్టుబట్టలతో చెన్నై నుండి సొంతూరు నడుచుకుంటూ వచ్చేసాం" అంది వెంకటి.
"ఇప్పుడు ఆ సోదంతా ఎందుకుగానీ సంక్రాంతి ఎలా గడుస్తాదో చూడు… నా దగ్గరైతే దమ్మిడీ లేదు, అప్పు పలకదు, పండగ చేసుకొని అడపిల్లల్ని అక్కమ్మల్ని పిలుపు చెయ్యకపోతే ఇరుగుపొరుగు దగ్గర అవమానం, తల తీసేసినంత పనౌద్ధి" అన్నాడు నాయుడు.
"ఏమో నువ్వేమి సేత్తావో….! నాకైతే పండగ దగ్గర పడతన్నకొలదీ బెంగ బెంగగా ఉంది" అంది వెంకటి.
"బెంగ ఎందుకే… నారుపోసినోడు నీరు పొయ్యడా... అంటారు పెద్దలు ముందు ముందు ఏమి జరుగుద్దో…చూద్దాం!" అన్నాడు నాయుడు.
పండగ నాలుగు రోజులుందనగా వెంకటి అమ్మ అయ్య కలిసి కుటుంబ సమేతంగా నాయుడు ఇంటికి వచ్చేసారు.
"వెంకటీ నీ పుట్టింటి వాళ్ళు బాగా తెలివైనవారే... అల్లుడ్ని కూతుర్ని పండక్కి పిలుపు సెయ్యడానికి బదులు వాళ్లే మనింటిలో వాలిపోయారు" వెంకటి చెవిలో గొనిగాడు నాయుడు.
"ఇష్...ఊర్కో మా వాళ్ళు వింటే బాగుండదు" అంది వెంకటి.
"మనం పిలవకుండానే వచ్చేసారు, అటు నీ కుటుంబం, ఇటు నా కుటుంబం మొత్తం కలిపి దగ్గర దగ్గర ఇరవై మంది సంక్రాంతి మనింటిలోనే... ఇక మా అక్క మా చెల్లి కుటుంబాలు కూడా వత్తాయి… సూడు నా సామిరంగా పైసా చేతిలో లేకుండా పండగ, ఇదే కరోనా పండగంటే"నవ్వాడు నాయుడు.
"నీ నవ్వులాట బాగానే వుంది గానీ… నువ్వు ఎక్కడైనా పదివేల రూపాయలు బెత్తాయించు, నాను తెలిసినోలి దగ్గర ఒక ఐదు వేల రూపాయలైనా బెత్తాయిస్తాను, పండక్కి పిల్లలకే బట్టలు, పెద్దలకు వద్దు, మిగతాది పండగ ఖర్చులకి" అంది వెంకటి
"సరే చూద్ధాం కొత్త కాంట్రాక్టర్ కోటారావుని డబ్బులు అడుగుతాను పది వీలైతే ఇవ్వడుగానీ ఐదు వేలు ఇత్తాడేమో… ఈసారి మా తోబుట్టువులకీ చెబుతానులే కరోనా కాలం కరువులో సంక్రాంతి కాబట్టి కట్న కానుకలు ఇవ్వలేమని" నెమ్మదిగా అన్నాడు నాయుడు.
"సరే పండగ ఖర్చులకైనా బెత్తాయించుకుందాం డబ్బులు… ముందు ఆ పని చూడాలి" అంది వెంకటి.
"మీరు ఏ డబ్బులూ బెత్తాయించక్కర్లేదు, అప్పుచేసి పప్పు కూడు మాకు పెట్టనక్కర్లేదు" అన్నాడు నాయుడు తండ్రి.
"ఈ ఏడాది మీరు వలస పోలేదు, ఊర్లో పెద్దగా పనులు లేవు డబ్బులు లేక మీరే ఇబ్బంది పడతన్నారని మీ అయ్య పదివేల రూపాయలు జమ చేసుకొని ఉంచాడురా నీకు ఇవ్వడానికి" అని అంది నాయుడు తల్లి.
"అమ్మా... ఆ డబ్బులు గొడవ మీకెందుకే మీ కోడలుగానీ నాను గానీ కాంట్రాక్టర్లు, మేస్త్రీలు వద్ద అప్పులు తేవడం లేదే… అడ్వాన్స్ తెత్తాము, పండగ పోయాక పనిలోకి వెళ్ళితే వాళ్ళ బాకీ తీరిపోతాది" అన్నాడు నాయుడు.
"పండగ ముందు ఆడినీ ఈడినీ డబ్బులు చేబదుళ్ళు అడగడమెందుకుగానీ నాను గొర్రిపిల్లలు మేపుకొని అమ్మడాలు కొనడాలు వ్యవహారంలో ఓ పదిహేను వేల రూపాయలు మిగిలిందిలే అందులో నీకు పదివేలు, నీ అక్కకి చెల్లికి పండగ కట్నంగా మిగతా డబ్బులు" అన్నాడు నాయుడు తండ్రి.
"బావా నీ కొడుక్కి నువ్విచ్చే పండగ కానుక బాగుంది… ఇక నాను నా కూతురికి ఒక పదివేల రూపాయలు ఇస్తున్నాను, నువ్వు గొర్రెలు మేపి సంపాదించినట్లే, నాను కోళ్లుని పెంచి డబ్బులు సంపాదిస్తున్నాను, ఇక ఈసారి ఈ ఇంట్లో పండగ ఖర్చులన్నీ నావే... ఈ రోజే వెళ్ళి అల్లుడికి, కూతురికి, వాళ్ళ పిల్లలకే మా పిల్లలకీ మీ ఆడ పిల్లల కుటుంబాలకీ కొత్త బట్టలు కొని తెస్తాను" అన్నాడు నాయుడు మామ.
"అయ్యా! నీకెందుకే ఈ బాధ్యతలన్నీ" అంది వెంకటి తన తండ్రితో
"మామా... నువ్వూ... మా అయ్యా పెద్దవాళ్ళు అయిపోయారు గతంలో కుటుంబాలు గురుంచి చానా కష్టపడ్డారు… ఈ వయసులో మీకెందుకు ఈ జంజాటాలు" అన్నాడు నాయుడు.
"అత్తని మామని, తల్లిని తండ్రిని కష్టబెట్టకుండా చూసుకోవల్సిన మేము మాయదారి కరోనా కాలంలో కూలీలేక మీ మీద ఆధారపడవలసి వచ్చింది" అంది వెంకటి బాధగా.
"బాధపడకమ్మా... వెంకటీ గతంలో మీరు వలస పోయి కష్టపడి డబ్బులు సంపాదించి అటు అత్తింటి వారికీ, ఇటు పుట్టింటి వారికీ ఘనంగా కానుకలు ఇచ్చి సంక్రాంతి సరదాగా ఎంతో ఘనంగా జరిపేవారు, ఈసారి మీరు వలస వెళ్ళలేదు, ఊర్లో పెద్దగా పనులు లేవు మీకు డబ్బులు ఇబ్బంది వచ్చింది అందుకే పెద్దవాళ్లగా మాకు చేతనైన సాయం మేము చేస్తున్నాం" అంది వెంకటి తల్లి.
"అవునమ్మా వెంకటీ వారం రోజులు ముందే మీ అయ్య,మీ మామ మాట్లాడుకున్నారు. ఈసారి నీ పుట్టింటి వారూ నీ అత్తింటి వారూ కలిసి ఓకే దగ్గర ఒకే ఇంట్లో కలిసి సంక్రాంతి పండగ జరుపుకోవాలని మంతనాలు చేసుకున్నారు, ఇదంతా మీకు తెలీకుండా వియ్యాలవారి ఒప్పందం" నవ్వింది వెంకటి అత్.
"అవునమ్మా నువ్వూ అల్లుడూ బాధ పడటానికి ఏముంది! మీరూ మేమూ వేరుకాదు కదా! అందరమూ ఒకే ఇంటి మనుషులం కరోనా కాలం కూలి లేకుండా చెయ్యగలిగింది కానీ ఆత్మీయతనూ అనుబంధాలనూ తగ్గించలేదు కదా!" అంది వెంకటి తల్లి.
"సరేగానీ మీ అయ్య ఇచ్చిన డబ్బులు, మీ మామ ఇచ్చిన డబ్బులు మొత్తం ఇరవై వేలు జాగ్రత్తగా ఉంచుకోండి… ముందు ముందు మీకు ఏదైనా అవసరం పడొచ్చు" అంది వెంకటి అత్త.
"ఈ పండగ వారంరోజుల ఖర్చులు బాధ్యత మాదే నువ్వూ నీ పెనిమిటీ లిస్ట్ చెబితే అవి కొని తేవడమే మా పని" అంది నవ్వుతూ వెంకటి తల్లి
"ఇంకెందుకు ఆలస్యం ఆడవాళ్లు పండగ సామానులు, కూరగాయలు, వెచ్చాలు గురుంచి చూసుకోండి… మగవాళ్ళం పండగ బట్టలు కొనడానికి వెళతాం"అన్నాడు వెంకటి మామ.
నాయుడు… వెంకటి ఆనందభస్ఫాలు రాల్చారు రెండు కుటుంబాలూ భారమైన హృదయాలతో పరస్పరం ఆలింగనం చేసుకొని కాసేపటికి తేరుకొని సంక్రాంతి పండుగను మున్నెన్నడూ చేసుకోలేనంత ఘనంగా ఈసారి చేసుకోడానికి తయారీలకు సిద్ధమయ్యారు. చాలా కాలం తరువాత పుట్టింటివారు అత్తింటివారు కలిసి ఒకే ఇంట్లో హాయిగా ఆనందంగా గడుపుతూ పండక్కి సిద్ధమవ్వడంతో కాబోలు వెంకటి, నాయుడు ఉషారుగా, సరదా వున్నారు పిల్లలు,పిల్లల పిల్లలు ఆనందంగా ఉండటం చూసి పెద్దవాళ్ళు సంతోషంతో మురిసిపోయారు.