ఎప్పటిలా తన పరివారంతో శుభ మహూర్తాన రాజ సభలో ప్రవేసించిన భోజరాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి తొమ్మిది మెట్లు ఎక్కి పదో మెట్టుపై కాలు మోపబోయాడు. ఆ మెట్టుపైఉన్న'కనకాభిషేకవళ్లి' అనే స్వర్ణప్రతిమ "ఆగు భోజరాజా సాహాసి, సాటిలేని వీరుడు విక్రమార్కుడు. ఇది అతని సింహాసనం దీనిపై ఆసీనుడువి అయ్యేముందు ఈకథవిను. . .
మందరగిరి పర్వత సమీపంలోని సరయు నది ఒడ్డున ఉన్న ఉమాపురి అనే రాజ్యాన్ని కనకరాజు పాలిస్తుండేవాడు. అతనిమంత్రి పేరు విభూతుడు. ఒక రోజు రాజు తన పరివారంతో ఉచ్చమ పర్వత ప్రాంతంలోని అడవిలో వేట ముగించుకుని ఉమా పురికి వస్తూ, దాహం వేయడంతో దారిలో ఉన్నఆశ్రమంలో ప్రవేసించి, తనను అక్కడ ఉన్న మహర్షికి తనను పరిచయం చేసుకుని తనకూ, తన పరి వారానికి దాహం తీర్చమని కోరాడు.
"వత్స నాపేరు వశిస్టుడు మీరంతా దాహంతో పాటు ఆకలి తీర్చుకొండి" అని "అమ్మా కామధేనువు రా. . భూలోకానికిరా ఈమహారాజు గారి పరివారాని ఆకలి, దాహం తీర్చి వెళ్లు" అని చేతులు జోడించి వేడుకున్నాడు వశిస్టుడు. దేవలోకం నుండి వచ్చిన కామధేనువు, అడిగినవారికి లేదనకుండా కోరినవన్ని వడ్డించి అందరిని తృప్తి పరచింది. ఆ కామధేనువును తనతోపాటు ఉమాపురి రాజ్యానికి తీసుకు వెళ్లదలచిన కనకరాజు, కామధేనువును బంధించమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. కామధేనువు సమీపానికి వెళ్లిన రాజభటులు భస్మం అయ్యారు.
అదిచూసిన కనకరాజు వీరత్వం కన్నా తపస్సు గొప్పదని తలచి, ఎంతో నిష్ఠతో గొప్ప తపస్సు చేసి 'విశ్వామిత్రుడు' అనే పేరు పొందాడు. ఒక సారి కనకపురి రాజ్యం చెరి, ఆ రాజ్యపాలకుని దర్శనం కోరగా ఆలస్యంగా రాజు దర్శనం లభించడంతో కోపంతో ''పెద్దల, తపోధనుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావా? తగిన ఫలితం అనుభవించు. రేపటి సూర్యోదయ సమయానికి నీతోపాటు నీరాజ్య ప్రజలు అందరు ప్రాణాలు కోల్పోదురుగాక"అని శపించాడు.
విశ్వామిత్రుడు తన పాదాలపై పడిన రాజ దంపతులను చూసి "నా శాపానికి తిరుగు లేదు, మహారాణి చేయని తప్పుకు శిక్ష అనుభవించబోతున్నావు, పరిహారంగా ఏదైనా ఒక వరం కోరుకో" అన్నాడు. మరు జన్మలో కూడా కనకపురి రాజే తనకు భర్తగా లభించాలని, తను యవ్వనవతిగా ఉన్నప్పుడు కోరినవెంటనే రెక్కలగుర్రం రావాలని కోరుకుంది మహారాణి. "తధస్తు" అని విశ్వామిత్రుడు వెళ్లిపోయాడు.
అలా ఆమె మరు జన్మలో, శ్వేతపర్వత ప్రాంతంలోని తామరనది తీరమైన 'ప్రతిష్టాను పురం' రాజ్యా పాలించే 'సద్గుణరాజు' అతని భార్య 'సాహిత్యవతి' దంపతులకు 'సంజీవిని' పేరున జన్మించింది. అలానే విశ్వామిత్రుని శాపంవలన మరణించిన రాజు, సద్గుణరాజు గారి పురోహితుడు అయిన 'కాలకంఠ' భార్య 'కనకాంబ కు' కేశవుని పేరిట జన్మించాడు. కాలక్రమంలో సంజీవిని వివాహం చేయదలచిన సద్గుణ రాజు, తన కుమార్తె కోరిక మేరకు కనకపురి రాజ్యం ఎక్కడ, ఎలాఉందో చూసి దాని వివరాలు చెప్పగలిగినవారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తాను అని ప్రకటించాడు.
ఎందరో ప్రయత్నించినా కనకపురి ఎక్కడ ఉందో తెలుసు కోలేకపోయారు. ఊహ తెలిసిన నాటి నుండి సంజీవిని నే వివాహంచెసుకోదలచిన కేశవుడు, ఉజ్జయిని చేరి విక్రమార్కుని దర్శించి 'మహారాజా తమరి పరోపకారం లోకవిదితమే, అందుకే తమ సహాయం కోరి వచ్చాను. కనకపురి రాజ్యం ఎక్కడ ఉందో, దాని విషేషాలు ఏమిటో తెలిస్తే, నేను ప్రేమించే రాజకుమారి సంజీవిని నాకు దక్కుతుంది. ఇది ఆమె తండ్రిగారు ప్రకటించిన స్వయంవర నియమం'అన్నాడు.
"తప్పక నీకు సహాయపడ తాను" అన్న విక్రమార్కుడు, బేతాళుని పిలిచితననూ, కేశవుడిని కనకపురి రాజ్యం చేర్చమన్నాడు. క్షణ కాలంలో తన మాయ విద్య ద్వారా వారు ఇరువురిని కనకపురి చేర్చాడు బేతాళుడు. ఆనగరం అంతా విక్రమార్కుడు, కేశవుడు తిరిగి చూసారు. అక్కడ అంతా నిర్జివంగా ఉంది. అక్కడ ఉన్న ఆలయంలో దేవి దర్శనం చేసుకుని ఆశ్చర్యపోయాడు. అమ్మవారి మెడలో వాడని పచ్చిపూమాల తోపాటు, ఎవరో నిన్నటి రోజున పూజించిన గుర్తులు అమ్మవారి ముందు వెలుగుతున్న దీపం చూసి. ఆవిషం తెలుసుకో దలచి, ఆలయ ప్రాంగణం లోని మండపంలో ఇరువురు విశ్రమించారు.
నడిరాత్రి గుర్రం సకిలింపు అలికిడి కావడంతో విక్రమార్కుడు, కేశవు లకు మెలకువ వచ్చింది. రెక్కల గుర్రం పై వచ్చిన రాజకుమారి అమ్మవారి గుడిలోకి వెళ్లి, తను తెచ్చిన కొత్త పూలమాలను అమ్మవారిమెడలో వేసి దీపంలో నూనె పోసి పూజ చేసి రెక్కలగుర్రం ఎక్కి వెళ్లి పోయింది. బేతాళుని ద్వారా ఆమె సద్గుణరాజు కుమార్తె అని తెలుసుకున్నడు విక్రమార్కుడు. కేశవునితో కలసి ప్రతిష్టానుపురం చేరాడు విక్రమార్కుడు. అక్కడ రాజు గారికి తను కనకపురిని చూసానని, అక్కడ విషయాలు రాకుమారి సంజీవిని రాత్రులు రెక్కల గుర్రంపై వచ్చి పూజ చేసి వెళ్లే విషయం సద్గుణరాజు గారికి కేశవుడు తెలియజేసాడు. రాజకుమారి సంజీవిని యదార్ధమని అంగీకరించడంతో, వారివివాహం ఘనంగా జరిపించాడు సద్గుణరాజు. విక్రమార్కుని ఘనంగా సత్కరించాడు సద్గుణ రాజు. భోజరాజా కథ విన్నావుగా పరులకోసం శ్రమించే విక్రమార్కుని గుణ గణాలు, నీలోకూడా ఉంటే ఈసింహాసనం పై చేరి పరిపాలన సాగించు"అన్నది ఆప్రతిమ.
అప్పటికే ముహూర్త సమయం మించి పొవడంతో వెనుతిరిగాడు భోజరాజు.