పూర్వం విజయపురి రాజ్యంలోని అడవి ప్రాంతంలో ఓ గూడెం ఉండేది. ఆ గూడెంలో ఆటవిక జాతి వారు నివసించేవారు. వీరు మంచి ధైర్య సాహసాలు కలిగి బలంగా దృడంగా వుండేవారు. జంతువులను చాకచక్యంగా వేటాడేవారు. వాటినే ఆహారంగా స్వీకరించేవారు. అడవిలో లభించే పండ్లు, దుంపలు, ఇతర శాకాహారపదార్ధాలను కూడా తినేవారు.
ఆ గూడెంలో మల్లయ్య ఉండేవాడు. ఆయన కొడుకు సూరయ్య. వాడికి 12 ఏళ్ల వయసు. వాడు తల్లి తండ్రులను అనుసరిస్తూ వారు చేసే పనులలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకరోజు వాడు అడవిలో తోటి పిల్లలతో ఆటలాడుతూ ఉండగా ఆ రాజ్యంలోని యువరాజు గుఱ్ఱంపై వేటకు వచ్చాడు. అతడు గురుకులంలో చదవి అన్ని విద్యలలో ఆరితేరాడు. ఇటీవలనే చదువు ముగించుకున్నాడు. అతడిని చూడగానే ఆటవిక బాలుడికి అతడిలా ఉండాలనే ఆశ కలిగింది. అతడిలాగానే విద్యలన్నీ నేర్చుకోవాలనే తలంపు ఏర్పడింది.
వెంటనే ఇంటికి వెళ్లి తండ్రి మల్లయ్యకు మనసులో మాట చెప్పాడు. మల్లయ్య ఉలిక్కి పడ్డాడు. "సూరిగా! అలవి కానీ కోరిక కొరకు. మనమెక్కడ, రాజకుమారుడు ఎక్కడ? మనం ఉట్టే ఎక్కలేం. స్వర్గం చేరుకోవాలంటే ఎలా? నీ ప్రయత్నం మానుకో. చక్కగా వేట నేర్చుకుని నీ బ్రతుకు నీవు బ్రతుకు. పెళ్లీడు వచ్చింది. పెళ్లిచేస్తా" అన్నాడు. సూరిగాడు నిరుత్సాహ పడ్డాడు. ఎలాగైనా రాకుమారుడు కావాలనే కోరిక బలంగా నాటుకుంది.
ఒక రోజు సమీపంలోని గురుకులానికి వెళ్ళాడు. గురువును కలిశాడు. విద్యలు నేర్పమని అడిగాడు. గురువు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఆటవికులకు విద్య నేర్పనని ఖరాఖండిగా చెప్పాడు. మొఖం వేలాడేసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో వాడికి ఓ ముని కలిశాడు. తన మనో వాంఛను మునికి చెప్పాడు. గురుకులానికి వెళ్లి గురువును కలిసినట్టు, ఆయన విద్య నేర్పటానికి నిరాకరించినట్టి చెప్పాడు. ముని చిన్నగా నవ్వి " నీవేమి దిగులు పడకు. గురి ఉన్న వాడికి గురువు అవసరం లేదు. నీ మనసులో నీ గురిని నిలుపుకో. నిరంతరం ఆ గురి గురించే ఆలోచించుకో. ప్రయత్న లోపం లేకుండా సాధన చేయి. సాధనతో అసాధ్యమైనది ఏది ఉండదు. అనుకున్నది సాధిస్తావు. ఏనాటికైనా రాజువు అవుతావు. అయితే నీ గురిని ఎట్టి పరిస్థితులలో కూడా మరువకు. ఎన్ని కష్టాలు వచ్చినా వైదొలగకు" అన్నాడు.
ముని మాటలు వాడిలో బాగా నాటుకున్నాయి. గురుకులంకు వెళ్లి దూరంగా ఉండి గురువు నేర్పేవన్ని గమనిస్తూ సాధన చేయటం ప్రారంభించాడు. ఇలా ఎనిమిదేళ్లు గడిచాయి. యుక్త వయస్కుడయ్యాడు. స్వయం కృషితో సకల విద్యలలో నైపుణ్యం సాధించాడు.
విజయపురికి పక్క రాజ్యం అవంతి పురం. ఆదేశ రాజుకు ఒక్కగానొక్క కుమార్తె .ఆమె చక్కని చుక్క. ఆమెకు పెళ్లీడు వచ్చింది. రాజు స్వయంవరం ప్రకటించాడు. దేశదేశాల రాకుమారులు వచ్చారు. స్వయం వరంలో పెట్టే పరీక్షలో నెగ్గితే యువరాణి తో పాటు రాజ్యం కూడా సొంతం అవుతుంది. వివిధ దేశాల యువరాజులతో పాటు ఆటవిక యువకుడు కూడా హాజరయ్యాడు. అనేక కష్టతరమైన ప్రశ్నలతో పాటు యుక్తికి సంబంధించిన సమస్యలు ఈ స్వయం వరం పరీక్షలో వచ్చాయి. తొలి దశలోనే చాలామంది యువరాజులు ఓడిపోయారు. ఇక మిగిలింది ఒకే ఒక్కడు. అతడే ఆటవిక యువకుడు. యువరాణి అతడి మెడలో పూల హారం వేసింది.
వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత రాజుగా పట్టాభిషేకం జరిగింది. కొన్నాళ్లకు విజయపురిని కూడా జయించి తన రాజ్యంలో కలుపుకుని ఏక ఛత్రాధిపత్యంగా ఏలాడు. చూసారా పిల్లలు గురి ఉంటే గురువు అవసరం లేదని, స్వయం కృషితో సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదూ!