మంగళవాద్యాలు మోగుతుండగా తన పరివారంతో రాజసభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించిన భోజరాజు మెదటి మెట్టు దాటి రెండో మెట్టుపై కాలు పెట్టాడు. ఆ మెట్టుపై ఉన్న'ఉదయాభిషేకవళ్ళి'అనే సాలభంజకం 'ఆగు భోజరాజా నువ్వు గొప్ప పండితుడవే కావచ్చు.పాండిత్యాన్ని ప్రదర్శించి తాము రాసి చదివిన ఓక్కో పద్యానికి లక్ష వరహాలు ఇచ్చి ఉండవచ్చు. అసమాన కీర్తిమంతుడు అయిన విక్రమార్కుని కథ చెపుతానువిను...
బాటసారి వేషంలో దేశాటన చేస్తున్న విక్రమార్కుడు, దారిలో ఎదురైన మునికి నమస్కరించి 'స్వామి ఆశీర్వదించండి' అన్నాడు. ' శుభమస్తూ నాయనా నీ ముఖవచ్ఛస్సు శుభ లక్షణాలు నువ్వు రాచబిడ్డవని తెలియజేస్తున్నాయి. రాజ్యం వదలి ఇలా వచ్చావు. అక్కడ నీ రాజ్యాన్ని శత్రువులు దాడి చేసే అవకాశం కలిగించావే' అన్నాడు.
'స్వామి దైవ నిర్ణయం ప్రకారం అంతా జరుగుతుంది. అందుకు నేను ఓ కథ చెపుతాను వినండి. పూర్వం నందివర్ధన దేశాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. యుధ్ధంలో ఓటమి పాలై అడవిలో మర్రిచెట్టు కింద విశ్రమించాడు. భార్య, కుమారుడు నిద్రించగా కళ్ళు మూసుకుని రాజు తన దురదృష్టానికి చింతించసాగాడు. ఇంతలో ఎక్కడనుండో వచ్చిన జంట పక్షులు వచ్చి ఆ చెట్టుపై వాలాయి. అందులోని ఆడపక్షి మానవభాషలో 'నాథా ఈ చెట్టు కింద ఉన్న రాజు గొప్ప దైవ భక్తుడు కదా ఇలాంటి కష్టాలు అతనికి ఎందుకు?' అన్నది. కాలం కలసి రానప్పుడు హరిశ్చంద్రుడు అంతటి వానికే అగచిట్లు తప్పలేదు. ఇక్కడకు తూర్పున ఆమడ దూరంలో 'చంపా' రాజ్యం రాజు మరణించాడు. ఆ రాజ్య ఆచారం ప్రకారం పట్టపు ఏనుగు పూమాల ఎవరి మెడలో వేస్తుందో వారే రాజు. రేపు రాజు ఎంపిక జరుగుతుంది' అన్నది మగ పక్షి. ఆ విషయం విన్న రాజు భార్యా, కుమారుడితో చంపారాజ్యం చేరుకుని ఏనుగుచే పూమాల పొంది రాజై సుఖంగా ఉన్నాడు.
కొంతకాలానికి పొరుగు రాజు చంపా రాజ్యంపై దండెత్తి వస్తున్నాడని వేగులు వార్త తీసుకువచ్చారు. చంపా రాజ్య మంత్రి 'ప్రభు సేనలు సిధ్ధం చేయమంటారా?' అన్నాడు. 'మంత్రివర్యా ఏదైనా రావలసి ఉంటే వచ్చితీరుతుంది. పోవలసి ఉంటే వెళ్ళితీరుతుంది. మనం నిమిత్తమాత్రులం. కాళీమాత ఇచ్చిన రాజ్యం ఇది, ఆ తల్లే కాపాడుకుంటుంది' అన్నాడు రాజు. ఆ రాత్రి శత్రుసేనలు విడిది చేసిన అడవిలో కారుచిచ్చు బయలుదేరింది. ఆ మంటల్లో చాలామంది మరణించగా మిగిలిన వారు పారి పోయారు' అలా కాళీమాత కృప పొందిన నేను వేయి సంవత్సరాలు పాలించగలను' అన్నాడు విక్రమార్కుడు.
'వత్స ఇది కాశ్మీరి శివలింగం. ఏది కోరినా తీర్చుతుంది. ఇటువంటిది నీవంటి పాలకుల వద్ద ఉండాలి' అని శివలింగం విక్రమార్కునికి ఇచ్చి ఆ ముని వెళ్ళిపోయాడు. ఉజ్జయినికి బయలుదెరిన విక్రమార్కునికి దారిలో ఒక వృధ్ధ పండితుడు ఏదో వెదుకుతూ కనిపించాడు. 'పండితోత్తమా తమరు దేని కోసం వెదుకుతున్నారు' అన్నాడు. 'అయ్యా నేను ఏనాడు శివనామస్మరణ మరువలేదు. నా వద్ద ఓశివలింగం ఉండేది దాన్ని అభిషేకించనిదే నేను నాకుటుంబం నీళ్ళు కూడా తీసుకోము ఈ దారిలో వస్తు నా శివలింగాన్ని ఎక్కడో జారవిడుచుకున్నాను' అన్నాడు బాధగా పండితుడు. 'చింతించకండి ఇదిగో నావద్ద కాశ్మీరి లివలింగం ఉంది స్వీకరించి యధావిధిగా మీపూజలు నిర్వహించుకొండి. మహిమాన్విత ఈ లింగం మీకోరికలు అన్ని తీరుస్తుంది' అని శివలింగాన్ని బ్రాహ్మణునికి దానంచేసాడు విక్రమార్కుడు.
భోజరాజా నువ్వు అంతటి దానశీలివైతే ముందుకు కదులు' అన్నది సాలభంజకం. అప్పటికే ముహుర్త సమయం మించి పోవడంతో తనపరివారంతో వెనుతిరిగాడు భోజరాజు.