ఎవరు దీనికి కారణం - శింగరాజు శ్రీనివాసరావు

Who is Responsible

సాయంత్రం వాకింగ్ నుంచి తిరిగివస్తూ అరటిపండ్లు కొందామని పండ్లదుకాణం దగ్గర ఆగి బేరమాడుతున్నాను. ఇంతలో ఒక స్కూటీ సర్రున రాసుకుంటూ వచ్చి నా పక్కన ఆగింది. నన్ను గుద్దిందేమో అన్నంత దగ్గరగా ఆగింది. అంత సడన్ బ్రేకు వేశాడతను. ఆవేశంతో తలపక్కకు తిప్పి చూశాను విసురుగా, నడిపేది ఎవరా అని. విస్తుపోయాను అతడిని చూసి. పట్టుమని పది సంవత్సరాల వయసు ఉండదు వాడికి. సీటు మీద కూర్చుంటే కాళ్ళు కిందకు ఆనవు. అలాంటివాడు అంత వేగంతో వచ్చి సడన్ బ్రేకు వేసి నా పక్కన ఆగడం, చిర్రెత్తుకొచ్చింది నాకు.

"ఏరా వేలెడంత లేవు. ఆ వేగమేమిటి. మనిషిని రాసుకుంటూ ఆపడమేమిటి. కొంచెం ఆదమరచి వుంటే నాకు గుద్దేవాడివి తెలుసా" కోపం ప్రదర్శించాను.

"భయపడ్డారా అంకుల్. ఇది నాకు మామూలే. రెండేళ్ళ నుంచి నడుపుతున్నా. నా స్పీడు అంతే. మా డాడీనే ఆశ్చర్యపోతారు తెలుసా" గొప్పగా చెప్పాడా కుర్రాడు.

వళ్ళు మండింది నాకు. " ఎవడ్రా నీకు లైసెన్స్ ఇచ్చింది"

" లైసెన్సా. అదేంటి అంకుల్. నాకవేవీ తెలియవు. మా డాడీ నాకు నేర్పాడు. నేను బండి తోలుతున్నా. అంతే"

" మైనారిటీ తీరకుండా, లైసెన్స్ లేకుండా బండి ఇచ్చి ఊరి మీదకు పంపాడా మీ నాన్న. ఎంతమంది ప్రాణాలు తీయమని. మీ నాన్న ఫోను నెంబరు యివ్వు. అసలు నీకు బండి ఎలా ఇచ్చిపంపాడో అడుగుతాను" బెదిరించాను వాడిని.

" ఏంటి అంకుల్. మానాన్నతో చెబుతారా. చెప్పండి. అసలు మానాన్న ఈ బండి కొన్నది నాకోసమే. నా వయసుకు చాలా మంది యమహా లాంటి పెద్ద పెద్ద బండ్లు నడుపుతున్నారు. మీరేమిటిలా స్కూటీ నడుపుతుంటేనే గోల చేస్తున్నారు. ముసలివాళ్ళకు అన్నీ భయమే" వెటకారంగా అన్నాడు వాడు.

వాడి వయసుకు వాడి మాటలు చాలా ఎక్కువనిపించాయి. అంటే వాడి తల్లిదండ్రుల పెంపకంలో ఏదో తేడా కొట్టింది నాకు. " ముందు నోరు మూసుకుని నెంబరు ఇవ్వు" గదిమాను.

" నెంబరెందుకు నేనే ఫోను చేసి మీకిస్తాను. ఆ తిట్లేవో మీరే తినండి" అని వాళ్ళ నాన్నకు ఫోను చేశాడు.

" హాయ్ డాడీ. నేను పండ్లు కొనడానికి వస్తే ఇక్కడొక అంకుల్ నన్ను పిచ్చి పిచ్చి ప్రశ్నలేసి విసిగిస్తున్నాడు. 'నీకు బండెవరిచ్చారు, లైసెన్సు ఉందా, మీ నాన్నతో మాట్లాడుతా' అని ఇందాకటి నుంచి సొద. మీరట మాట్లాడండి" అని ఫోను నాకిచ్చాడు, అదోరకంగా నవ్వుతూ.

వీడు మహాముదురు అని మనసులో అనుకుంటూ ఫోను చేతికి తీసుకున్నాను. " ఏమండీ ఇంత చిన్న కుర్రాడు లైసెన్సు లేకుండా బండి నడుపుతున్నాడు. భయం కొంచెం కూడ లేకుండా మితిమీరిన వేగంతో వెళుతున్నాడు. అసలు మీకు తెలిసే చేస్తున్నాడా, తెలియకుండా చేస్తున్నాడా" గట్టిగానే అడిగాను.

" ఏంటి మాస్టారు. మావాడి స్పీడు చూసి భయపడినట్టున్నారు. వాడు మామూలు కుర్రాడు కాదండీ, భయమంటే తెలియని భుజంగం కొడుకు. వాడికి లైసెన్సు ఎందుకండీ, వాడు పులిబిడ్డ. పోలీసులంతా మా బంధువులే. వాడి జోలికెవరూ రారు. అయినా పదేళ్ళ కుర్రాడు గాలిపటంలా దూసుకెళుతుంటే, వెన్నుతట్టి ప్రోత్సహించాలి గానీ, అలా పిరికితనం నూరిపోస్తారేమిటి" అతను కూడ దబాయించాడు నన్ను.

'అనవసర విషయాలు నీకెందుకు' అన్నట్లుగా వుంది అతని మాటతీరు. " ఇప్పుడు గర్వంగానే ఉంటుంది. రేపు ఖర్మకాలి వాడికేదయినా జరిగితే నెత్తి, నోరు బాదుకుని ఏడవాలి. కాస్త ముందుచూపుతో ఆలోచించి వాడికి బండి ఇవ్వడం మానేయండి"

" అసలింతకీ మీరెవరండీ నాకు నీతులు చెప్పడానికి. నా కొడుకు, నా ఇష్టం. వాడిప్పుడు బండితో మిమ్మల్ని గుద్దలేదు కదా. అనవసరంగా మాట్లాడతారెందుకు" విసుక్కున్నాడతను.

"వయసులో పెద్దవాడిని, అనుభవం ఉన్నవాడిని కనుక, పసివాడి మంచికోసం చెబుతున్నాను. వాడికి పద్ధెనిమిది సంవత్సరాలు వచ్చిన తరువాత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి, స్కూటి ఏం ఖర్మ, ఏకంగా కారో, లారీనో ఇచ్చి ఊరిమీదికి పంపు. అంతేగానీ, ఇలా పదేళ్ళకే బలాదూరుగా వాహనాలిచ్చి రోడ్డు మీదకు పంపకు. మరల చూశానంటే ఏకంగా కలెక్టరుకే రిపోర్టు చేస్తాను" రెచ్చిపోయాను, ఇలా బెదిరిస్తేనన్నా అతను భయపడి, ఆ పసివెధవకు అంతంత బండ్లు ఇవ్వడం మానేస్తాడని.

" ఇదిగో పెద్దాయనా. చెప్పింది చాలు. మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావు. నువ్వు చెప్పినంత మాత్రాన బండి ఇవ్వడం మానేస్తాననుకున్నావా. ఇప్పుడు చెప్పావుగా. రేపటి నుంచి వాడికి బుల్లెట్ నేర్పించి, వారంలోపు రోడ్డు మీదికి పంపుతాను. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. ముందు ఆ ఫోను వాడికివ్వు" అని విదిలించి పారేశాడు.

మనసు చివుక్కుమంది. ఏదో మంచికిపోతే చెడు ఎదురయినట్టు, నేను ఆ పసివాడికి ఏదయినా జరగరానిది జరుగుతుందేమో, తెలిసి తెలియకుండా అతివేగంతో పోయి ఎక్కడైనా గుద్దుకుంటే, వాడికి ఏదయినా అయితే, జీవితాంతం బాధపడవలసి వస్తుందేమోనని చెబితే, అతనేమిటి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతాడు. అనవసరంగా కెలికానా అనిపించి మరో మాట మాట్లాడకుండా ఫోను కుర్రాడికి ఇచ్చాను. వాడు వెటకారంగా నవ్వుతూ పండ్లు తీసుకుని సర్రున దూసుకుని వెళ్ళిపోయాడు.

నా ముఖంలో కవళికలు మారడం గమనించాడేమో పండ్లకొట్టతను. " సర్. మీరెందుకు బాధపడుతున్నారు. మీరు మంచి చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. దానికి మీరేంచేస్తారు. అయినా ఈరోజులలో ఎవరూ ఎవరిమాట వినడం లేదు సర్. ఎవరికివారే తోపులమని విర్రవీగిపోతున్నారు. మీ పాతకాలపు రోజులు కాదు సార్ "పెద్దలమాట చద్దన్నపు మూట" అని విని ఆచరించడానికి. మిడిమేలపు కాలం సార్ ఇది. ఎవడి ఖర్మకు ఎవరు బాధ్యులు. మీరు అనవసరంగా ఆలోచించి బాధపడకండి" అని సర్దిచెబుతూ పండ్లు చేతికిచ్చాడు.

నిజమే అన్నట్లు తలను వూపి అక్కడినుంచి కదిలాను. కానీ నా మనసులో ఆ పసివాడి రూపం, వాళ్ళ తండ్రి మాటలు మాత్రం చెరిగిపోలేదు.

********

ఉదయాన్నే లేచి నాలుగు ఆసనాలు వేసి, మా ఆవిడ కాఫీ ఇచ్చేలోపు పేపరు చూద్దామని చేతిలోకి తీసుకున్నాను. ఈ మధ్య పేపరు చదవాలంటేనే చికాకుగా ఉంటోంది. నిష్పక్షపాతంగా వార్తను వ్రాసే పరిస్థితి ఏ పత్రికకూ లేకుండా పోయింది. నిజం పదిపైసలైతే, దానికి తొంబై పైసలు కల్పితాన్ని జోడించి ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తూ వ్రాసే రాతలే అధికమయిపోయాయి. అవికాకుంటే యాక్సిడెంట్లు, మానభంగాలు, అక్రమసంబంధాలు, ఆస్తుల కోసం కొట్లాటలు. విసుగొస్తున్నది పేపరు చూడాలంటే. అయినా అదేకదా ఈ వయసులో కాసింత కాలక్షేపం. అందుకే తిరగేస్తూ కూర్చున్నాను.

మెయిన్ పేపరు అయిన తరువాత జిల్లా ఎడిషన్ చేతులోకి తీసుకుని చూస్తూనే అదిరిపడ్డాను. " పదేళ్ళకే నూరేళ్ళు... ప్రాణం తీసిన వేగం... ఎవరిది నేరం?" ఫైల్ ఫొటోలో నిన్న నేను మందలించిన పసివాడు. మనసు బాధగా మూలిగింది. నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. నూరేళ్ళ జీవితం నిర్లక్ష్యానికి బలయిపోయింది. కళ్ళు తుడుచుకుని ఏం జరిగిందోనని చదివాను. " రాత్రి పది గంటల ప్రాంతంలో పది సంవత్సరాల కుర్రాడు తండ్రి తెమ్మన్నాడని స్కూటీమీద వెళ్ళి, ఊరి చివర ఉన్న బ్రాందిషాపులో నుంచి బీరు బాటిళ్ళు తీసుకువస్తూ, ముందు వెళుతున్న కారును దాటి వెళ్ళాలని వేగాన్ని పెంచి, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ బిడ్డను తామే పొట్టన పెట్టుకున్నామని విలపిస్తున్నారు. మైనరు బాలుడికి లైసెన్సు లేకుండా వాహనాన్ని ఇవ్వడమే కాకుండా, మందు తెమ్మని పంపిన తండ్రిదే నేరమని, ఆ బిడ్డ చావుకు తండ్రే కారణమని విలపిస్తున్న ఆ తల్లిని చూస్తే గుండె తరుక్కుపోతున్నది. వయసును మించిన పనులను అప్పగిస్తే పర్యవసానమిలాగే ఉంటుందని అందరూ తండ్రినే తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ననుకున్నా ఉపయోగమేముంది. తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న అతినమ్మకాలే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయన్నది నిష్టుర సత్యం. ఇకనైనా తల్లిదండ్రులు మేలుకుని పిల్లలకు వయసు వచ్చిన తరువాత డ్రైవింగు లైసెన్స్ తీసుకుని, తగిన తర్ఫీదు యిచ్చి వాహనాలు ఇస్తే మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు. మా ఆశాదీపాన్ని మేమే చేజేతులా ఆర్పుకున్నామని విలపించే ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరమూ కావడం లేదు" చదువుతున్నంతసేపూ ఆ పసివాడి రూపమే కళ్ళముందు కదిలింది నాకు. ప్రభుత్వనియమాలను ఉల్లఘించి ప్రజలు ప్రవర్తిస్తున్నంత కాలం ఇటువంటి ఆపదలు తప్పవు. బ్రహ్మ రాసిన రాతను చేజేతులా చెరిపేస్తున్నది మనమే కదా. ఇక్కడ ఒక తండ్రి అతివిశ్వాసం, చిన్నపాటి నిర్లక్ష్యం, పెద్దల మాట పెడచెవిని పెట్టడం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ తల్లికి కడుపుకోతను మిగిల్చింది. మా ఇంటి బిడ్డను కోల్పోయినంత బాధ కలిగింది. కాఫీ కూడ తాగాలనిపించలేదు. మౌనంగా కళ్ళు మూసుకుని పడకకుర్ఛీలో వాలిపోయాను, రెప్పల వెనుక తడిని దాచుకుంటూ.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు